సామాన్య భక్తులకు ఏఐ టెక్నాలజీ ద్వారా రెండు మూడు గంటల్లోనే దర్శనం కల్పిస్తున్నామని, శ్రీవారి అన్నప్రసాదంలో వడను చేర్చి, లడ్డూ నాణ్యతను పెంచామని నాయుడు వివరించారు. బ్రేక్ దర్శనం, శ్రీవాణి దర్శనం సమయాల్లో మార్పులు చేసి భక్తులకు సౌలభ్యంగా మార్చామన్నారు. తిరుమల-తిరుపతి మధ్య నడిపేందుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Read Also: Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్ పర్యటనలో వల్లభనేని
గత ప్రభుత్వం తిరుపతి ఫ్లైఓవర్‌కు పెట్టిన ‘శ్రీనివాస సేతు’ పేరును, తిరిగి చంద్రబాబు పెట్టిన ‘గరుడ వారధి’గా మార్చామని ప్రకటించారు. అలిపిరిలో ముంతాజ్ హోటల్ కోసం కేటాయించిన 20 ఎకరాల భూముల లీజును రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. దేవలోక్, టూరిజం హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలకు ఇచ్చిన 50 ఎకరాల భూమిని తిరిగి టీటీడీకి కేటాయించాలని తీర్మానించినట్లు తెలిపారు.
స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి నిపుణుల కమిటీ వేశామని, వారి నివేదిక ఆధారంగా రూ.71 కోట్లు కేటాయించామన్నారు. స్విమ్స్‌లో “మెడికల్ మాఫియా”కు అడ్డుకట్ట వేస్తూ, టీటీడీ ఆధ్వర్యంలోనే మెడికల్ షాపుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 650 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పోటు కార్మికులకు జీఎస్టీ భారం తగ్గించి వేతనం పెంచామని తీర్మానించారు. అమరావతి ఆలయ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, రూ.175 కోట్లతో దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతి ఎయిర్ పోర్టుకు ‘శ్రీ వేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’గా పేరు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు బీఆర్ నాయుడు వెల్లడించారు.