అంకాపూర్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర మంతా ఒకలాంటి సాగు.. ఇక్కడ మాత్రం టోటల్ డిఫరెంట్. వరి అంటేనే ఆమడదూరం పోతారు ఇక్కడ రైతులు. సంప్రదాయ పంటలకు స్వస్తిపలికి దశాబ్దాలే అయ్యింది. అన్నీ లాభదాయక పంటలే. పెట్టుబడి ఎక్కువ, శ్రమా ఎక్కువే. లాభం అంతంతే. మరి రైతు వరి సాగువైపు ఎందుకు పోతాడో వీరికి ఇంకా ఇప్పటికీ అర్థం కాని విషయం. వ్యవసాయంలో ప్రయోగ పంటలతో, లాభదాయక దిగుబడులతో రైతు లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం. నాటికోడి కూరకు కూడా ఇది ప్రసిద్ది. అంకాపూర్ దేశీ చికెన్ అంటే అదో బ్రాండ్ నేమ్. ఈ ఊరు ఎందుకు ఆదర్శ వ్యవసాయ గ్రామంగా కీర్తికెక్కిందో తెలుసుకుందాం.
అంకాపూర్ను ‘తెలంగాణ విత్తన భాండాగారం’ (Seed Bowl of Telangana) గా కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో రైతులు సాంప్రదాయ వరి సాగు కంటే వాణిజ్య పంటలు, విత్తనోత్పత్తికే మొగ్గు చూపుతారు. అంకాపూర్ రైతులు వరి సాగుకు మొదటి నుంచి దూరంగానే ఉంటున్నారు. ఇక్కడి రైతుల కమర్శియల్ మైండ్ సెట్కు వరి సాగు అసలే సెట్ కాలేదు. అందుకే ఆ ఊరి లిస్టులో వరి లేదు.
ఈ రైతులు దశాబ్దాలుగా కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్ డిమాండ్ ఉన్న కమర్షియల్ పంటలను పండించడంలో దిట్టలనే పేరు సంపాదించారు. వరి పంటకు ఎక్కువ రోజులు నీరు పెట్టాలి, శ్రమ ఎక్కువ. దానికి వచ్చే లాభంతో పోలిస్తే వాణిజ్య పంటలపై వచ్చే ఆదాయం చాలా రెట్లు ఎక్కువ అని వారు ఏనాడో గుర్తించారు. ఆ వైపుగానే ఇప్పటికీ వినూత్న సాగుతో అందరిలో ముందున్నారు. అధిక లాభాలు గడిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు.
వరికి ప్రధానంగా కూలీల కొరత ఉంటుంది. నాట్లు, కలుపులు, కోతలకు కూలీలు.. ఇలా అడుగడుగునా అన్నీ ఖర్చులతో కూడుకున్నవే. ఏ ఒక్కటి అందుబాటులో లేకున్నా రైతుకు ఇబ్బందులు తప్పవు. వరి లాంటి నీటి నిల్వ పంటల కంటే, మైక్రో ఇరిగేషన్ కింద బిందు, డ్రిప్ సేద్యం పద్ధతులను వాడుతూ తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడం ఇక్కడి రైతుల ప్రత్యేకతగా మారింది.
ఈ విధానం వీరికి ఓ వరంలా తోచింది. అందుకే వరిని వదిలేశారు. వరి సాగు చేస్తే ఏడాదికి రెండు పంటలు తీయడమే కష్టం. కానీ, అంకాపూర్ రైతులు తక్కువ కాలపరిమితి గల ఆరుతడి పంటలను ఎంచుకుని, ఏడాదికి ఏకంగా మూడు పంటలు తీస్తూ భూమిని నిరంతరం లాభదాయకంగా వాడుకుంటారు.
వివిధ ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని హైబ్రిడ్ మొక్కజొన్న, జొన్న, సజ్జ …విత్తనాలను భారీగా ఉత్పత్తి చేస్తారు. సాధారణ పంటల కంటే ఈ విత్తనోత్పత్తి ద్వారా కంపెనీల నుంచి వీరికి రెట్టింపు ఆదాయం లభిస్తుంది. అందుకే దీన్ని సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. ఆర్మూర్ ప్రాంతం పసుపు సాగుకు చాలా ప్రసిద్ధి.
అంకాపూర్ లో పసుపును ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తారు. ఇక్కడి పసుపు నాణ్యత బాగుండటం వల్ల జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతుంది. ఎర్ర జొన్నల సాగు కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. యాభై ఏళ్ల న నుంచే ఈ గ్రామంలో ఎర్ర జొన్నల సాగు ప్రారంభమైంది. పశుగ్రాసంగా, ఇతర వాణిజ్య అవసరాలకు దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఈ రైతులకు ఇది సిరులు కురిపిస్తున్నది.
అంకాపూర్ చుట్టుపక్కల నగరాలకు నిరంతరం కూరగాయలను సరఫరా చేస్తుంటుంది. టమాటో, మిర్చి, బెండకాయ, ఆకుకూరలు వంటి కూరగాయలను డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తూ ప్రతి వారం చేతికి డబ్బులు వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు.