BigTV English

California Wildfire: అమెరికాలో కార్చిచ్చుకు.. అసలు కారణాలు ఇవేనా .!

California Wildfire: అమెరికాలో కార్చిచ్చుకు.. అసలు కారణాలు ఇవేనా .!

California Wildfire: అగ్రరాజ్యం అమెరికాలో కార్చిచ్చు భయం కమ్ముకుంది. దావానంలా వ్యాపించిన వైల్డ్ ఫైర్‌తో ధనిక నగరం లాజ్ ఏంజిలెస్‌ బుగ్గిపాలయ్యింది. హాలివుడ్ సెలబ్రిటీలు ఉండే ఏరియా మంటల్లో బూడిదయ్యింది. ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ధనికులుండే ఏరియాలో ఇంత నష్టం ఎవ్వరూ ఊహించలేదా..? అమెరికా లాంటి అగ్రదేశమే నిప్పును అదుపు చేయలేకపోవడం ఏంటీ? కాలిఫోర్నియాలో కార్చిచ్చు కొత్త కాదని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఇంత విధ్వంసం వెనుక అసలు కారణం ఏంటీ..?


ప్రియాంకా చోప్రా ఇల్లు, ట్రంప్ జూనియర్ నివాసం..

ఎటు చూసినా ఎగసిపడుతున్న మంటలు.. హాలివుడ్ నటుల హైక్లాస్ భవనాలన్నీ బూడిదగా మారాయి. ధనికుల ఆస్తి అంతా కొన్ని గంటల్లో బుగ్గిపాలయ్యింది. ఎర్రని మంటల పైన నల్లలి పోగతో ఆ ప్రాంతమంతా భయంకరంగా కనిపించింది. కోట్లాది రూపాయల కార్లు, ఫర్నిచర్, వస్తువులు.. ఒకటేంటీ.. కట్టు బట్టలతో సెలబ్రిటీలు రోడ్డున పడ్డారు. అందులో, మన భారతీయ నటీమణి ప్రియాంకా చోప్రా ఇల్లు కూడా ఉంది. ఆ మాటకొస్తే.. ట్రంప్ కొడుకు నివాసం, బ్రిటన్ యువరాజు ఇల్లు.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా కాలి బూడిదైంది.


హాలివుడ్ ప్రాంతంలో 20 వేల ఇళ్లు దగ్థం

ఇలా చాలా మంది గొప్పోళ్ల ఇళ్లన్నీ కార్చిచ్చులో కాలిపోయాయి. హాలివుడ్‌లో జరిగిన ఈ విధ్వంసం ఖరీదు రూ.12 లక్షల కోట్ల కంటే ఎక్కువంటే.. నష్టం ఏ మేరకు జరిగుంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలిఫోర్నియాలో లాస్ ఏంజిలెస్‌లోని హాలివుడ్ ప్రాంతంలో 20 వేల ఇళ్లు దగ్థం అయితే, మరోచోట 10 వేల ఇళ్లు మంటల్లో మసై పోయాయి. ప్రపంచాన్నే శాసించే అమెరికా ఈ మంటలను మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. బీచ్ పక్కనున్న ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయాయంటే ఈ వైల్డ్ ఫైర్ ఏ రేంజ్‌లో విజృంభించిందో ఊహించవచ్చు.

జనవరి 7న అర్థరాత్రి అంటుకున్న కార్చిచ్చు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలెస్, గ్రేటర్ లాస్ ఏంజిలెస్‌ అటవి ప్రాంతంలో జనవరి 7న కార్చిచ్చు అంటుకుంది. మొదట 10 ఎకరాల్లో చెలరేగిన కార్చిచ్చు కొన్ని గంటల్లోనే మూడు వేల ఎకరాలకు పైగా వ్యాపించింది. ఈ అగ్నిప్రమాదం తాకిడికి ఈ ప్రాంతల్లో లక్షా 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దావానం ఇప్పటివరకు 11 మంది ప్రాణాలను బలిగొంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గంట గంటకూ పెరిగిన కార్చిచ్చు.. 40 కిలో మీటర్ల మేర ముంచేసి, 40 వేల ఎకరాలకు పైగా ప్రాంతాన్ని దగ్ధం చేశాయి.

40 కిలో మీటర్ల మేర మంటలు, 40 వేల ఎకరాలకు పైగా స్థలం దగ్ధం

ఇప్పటికీ అవి అదుపులోకి రాని పరిస్థితి. అగ్నిప్రమాదం ప్రభావం చాలా వినాశనాన్ని సృష్టించింది. దీనిని చరిత్రలో అత్యంత ఖరీదైన అగ్నిప్రమాదంగా బీమా కంపెనీలు భావిస్తున్నాయి. నిజానికి, కాలిఫోర్నియా అటవీ మంటలకు ప్రసిద్ధి చెందింది. కానీ, ఈసారి వచ్చిన కార్చిచ్చు తీవ్రంగా ఉండటమే కాకుండా, ఇది శీతాకాలంలో సంభవించింది. సాధారణంగా ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు జరగవు. మరి లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా ఇప్పుడు ఎందుకు మండుతున్నాయన్నది, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు

ఫసిఫిక్ పాలిసాడ్స్‌లో సమీపాన జనవరి 7 రాత్రి ప్రారంభమైన ఈటన్‌ఫైర్.. వెంచురా కౌంటీకి దగ్గర్లోని వెస్ట్‌హిల్స్ ప్రాంతంలోని శాన్‌ఫెర్నాండో వ్యాలీకి వ్యాపించింది. తర్వాతి రోజు ఈ కెన్నెత్ ఫైర్ భారీ ఈదురు గాలులతో చాలావేగంతో కమ్ముకుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, వ్యాపార సంస్థలు, వాహనాలు అన్నీ మంటల్లో మాడిపోయాయి. ఇక, ఈటన్, పాలిసేడ్స్ ఫైర్స్ మధ్య 10 వేలకు పైగా నిర్మాణాలు దగ్ధమయ్యాయి.

250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు

చాలా మంది పాలిసేడ్స్‌లో హైస్కూలులో ఆశ్రయం పొందారు. ఈ ప్రదేశానికి దూరంగా రెండు మైళ్ల వరకు కెన్నెత్ ఫైర్ వ్యాపించింది. మాలిబులో ఐదు చర్చిలు, ఏడు స్కూళ్లు, రెండు లైబ్రరీలు, బార్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, గ్రాసరీ షాపులు దగ్థమయ్యాయి. దాదాపు 250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్చిచ్చు మొదలైనప్పటి నుండీ 5 సార్లు మంటలు మళ్లీ మళ్లీ రాజుకుంటూనే ఉన్నాయి. భీకరమైన శాంటా అనా గాలులు ఈ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుకు ఆజ్యం పోయడం వల్లే ఇంత వినాశనం జరిగిందని అంటున్నారు.

దోపిడీకి పాల్పడిన 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

హాలీవుడ్ హిల్స్‌లో మంటలను కొంతవరకు తగ్గించగలగడంతో అక్కడి ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయడానికి వీలుపడింది. లేకపోతే, మరణాలు మరింత పెరిగేవి. ఇప్పుడు, హాలీవుడ్‌లో రగులుకున్న కార్చిచ్చు మొత్తం సినీ పరిశ్రమనే ధ్వంసం చేసిందని అంటున్నారు. హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చిమ్మిన తర్వాతే కొంతమేర హాలీవుడ్‌హిల్స్, స్టుడియో సిటీ మంటలను వేగంగా ఆర్పగలిగారు. ఇక, ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని దోపిడీకి పాల్పడిన 20 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శాంటామోనికాలో కర్ఫూ కూడా విధించారు.

ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణ జనవరి 19కి వాయిదా

బిల్లీక్రిస్టల్, మాండీ మోర్, జేమ్స్ వుడ్స్, పారిస్ హిల్టన్, మార్క్ హామిల్ వంటి ప్రముఖ హాలివుడ్ నటుల ఇళ్లతో పాటు.. చాలా మంది సెలబ్రిటీల ఇళ్లు బూడిదయ్యాయి. అగ్నిబాధితులకు సాయం చేసేందుకు ఒక మిలియన్ డాలర్లతో జేమీ లీ కర్టిస్ నిధిని ప్రారంభించారు. ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు. ప్రస్తుతం, నగరానికి ఉత్తరాన ఉన్న అల్టాడైన సమీపంలోని వేలాది ఎకరాల అడువులు ఇంకా తగలబడుతూనే ఉన్నాయి. అడవుల్లో ఎండిపోయిన ఆకులు, చెట్ల వల్ల పెరుగుతున్న మంటల్ని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా కంట్రోల్ కావట్లేదు.

గవర్నర్ రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్

ఇక, తాజా పరిస్థితులపై అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌లు సీరియస్ అయ్యారు. కాలిఫోర్నియా గవర్నర్ కారణంగానే ఈ స్థాయి నష్టం వాటిల్లిందంటూ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ట్రంప్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందంటూ ఎలన్ మస్క్ వంత పాడారు. అయితే, ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయి మంటలు రావడం వెనుక కుట్రలు కూడా జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు సైజులో ఉండే అరుదైన పప్ ఫిష్ అనే జాతి చేపల్ని రక్షించడానికి కొన్నాళ్ల నుంచి కాలిఫోర్నియాకు నీటి సరఫరలో కోత విధించారనీ.. దీని కారణంగా సుమారు లక్షల ఎకరాల్లో పంటలు కూడా ప్రభావితం అవుతున్నాయని కొందరు వాదిస్తున్నారు.

నాలుగు నెలల క్రితమే అన్ని పాలసీలను రద్దుచేసిన ఓ బీమా కంపెనీ

ఈ చేపల కోసం దక్షిణ కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించడం వల్లనే ఈ స్థాయి నష్టం జరిగిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే, ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ వుడ్ కూడా కుట్ర కోణాన్ని వెల్లడించారు. బీమా కంపెనీలకు ఈ పరిస్థితి గురించి ముందే తెలిసి ఉంటుందనే సందేహం వ్యక్తం చేవారు. “నాలుగు నెలల క్రితం ప్రధాన బీమా కంపెనీలలో ఒకటి మా పరిసరాల్లోని అన్ని పాలసీలను రద్దు చేసింది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, అస్థిరమైన ఆర్థిక టోల్ ఇప్పటికే భారీ ఒత్తిడిలో ఉన్న బీమా మార్కెట్‌ను అస్థిరపరిచే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా వెలువడుతోంది.

కాలిఫోర్నియాలో కార్చిచ్చు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే… అమెరికాలో చాలా ప్రాంతాల్లో కార్చిచ్చులు రగులుకుంటూనే ఉంటాయి. అయితే, తాజగా ఏర్పడిన మంటలు మాత్రం ఇది వరకూ ఎప్పుడూ లేనంత నష్టాన్ని మిగిల్చాయి. ఇది ఇంతటితో ఆగుతుందని కూడా అనుకులేము. ఎందుకంటే, వాతావరణ మార్పులు అంతగా ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా మాత్రమే కాదు.. యావత్ భూమి ఈ తాపానికి బలికాబోతోంది.

2023లో హవాయి స్టేట్‌లో కార్చిచ్చు

కాలిఫోర్నియా కార్చిచ్చులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ఒక విధంగా అమెరికా వ్యాప్తంగా పలు ప్రాంతాలు కార్చిచ్చుకు బలౌతూనే ఉన్నాయి. కనీసం రెండు సంవత్సరాల్లో ఒక్కసారైనా అమెరికాలో దావానం రగులుకుంటుంది. 2023లో కూడా హవాయి స్టేట్‌లో కూడా కార్చిచ్చు చెలరేగింది. మౌయి ఐలాండ్‌లో వచ్చిన మంటలకు 93 మంది బలయ్యారు. గత శాతాబ్ధంలో అమెరికాలో ఇదే అతి భయంకరమైన అగ్రిప్రమాదంగా గుర్తించారు.

మొత్తం 19 వేల మందిని తరలింపు

దీనికి ముందు, 2022లో అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో భారీ ఎత్తున దావానం వ్యాపించింది. ఈ మంటలకు అడవులు పూర్తిగా తగలబడ్డాయి. మధ్యాహ్నం మొదలైన కార్చిచ్చు.. సాయంత్రానికి 123 ఎకరాల అడవిని దహించేసింది. మొత్తం 19 వేల మందిని తరలించాల్సి వచ్చింది. 2021లో కూడా కొలరాడో ఏర్పడిన మంటలకు వందకు పైగా ఇళ్లు దగ్థమయ్యాయి.

2020లో కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు

ఇక, 2020లో కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు వల్ల 40 లక్షల ఎకరాల్లో మంటలు చెలరేగగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. సాన్​ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన్న ఉన్న వైన్​ కంట్రీలో ఈ మంటలు వచ్చాయి. 2018లోనూ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్యారడైజ్ పట్టణం మంటలో కాలింది. 23 మంది బలయ్యారు. రెండున్నర లక్షల మంది ఇళ్లను ఖాళీ చేశారు. అప్పుడొచ్చిన క్యాంప్ ఫైర్, వూస్లీ ఫైర్, హిల్ ఫైర్ అనే మూడు కార్చిచ్చులు 70 వేల ఎకరాల స్థలాన్ని బూడిద చేశాయి.

సాంటా ఆనాలో గంటకు 120 కి.మీ వేగంతో మొదలైన గాలులు

ఇక, ఇప్పుడు ఏర్పడ్డ పాలిసేడ్స్ కార్చిచ్చు చరిత్రలోనే అత్యంత భయంకరమైన దావాగ్ని అని అంటున్నారు. జనవరి 7న సాంటా మోనికా పర్వతం వైపు చిన్నగా మొదలైన మంటలు పాలిసేడ్స్‌ను బూడిద చేశాయి. రెండు రోజుల క్రితమే, సాంటా ఆనాలో గంటకు 120 కి.మీ వేగంతో మొదలైన గాలులు దీనిని మరింత ఉధృతం చేశాయి. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో ప్రాణాలు కాపాడుకున్నారే గానీ.. ఆస్తులన్నీ మంటగలిశాయి. వర్షాలు పడకపోవడం వల్ల అంతా పొడిగా ఉండటంతో మంటలు మరింత వేగంగా, తీవ్రంగా వ్యాపించాయి.

జూన్ నుండి అక్టోబర్ మధ్య అమెరికాలో కార్చిచ్చులు

సాధారణంగా, అమెరికాలో అటవీ అగ్నిప్రమాదాలు జూన్ నుండి అక్టోబర్ మధ్య జరుగుతాయి. కానీ, భయంకరమైన ఈ అగ్నిప్రమాదం జనవరి నెలలో రావడమే అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కాలిఫోర్నియాలో కార్చిచ్చులు ఉన్నప్పటికీ.. కొత్త సంవత్సరం ప్రారంభంలో మంటలు చెలరేగడం చాలా అరుదు. అందుకే, నిపుణులు దీనిని వాతావరణ మార్పుకు స్పష్టమైన సంకేతంగా చూస్తున్నారు. ఈ ఉదాహరణతో.. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం మరింత పెరుగుతోందని అంటున్నారు.

ఈ సంఖ్య 2012-2024లో సగటు కంటే 40 రెట్లు ఎక్కువ

ఈ ఏడాది జనవరి నెల ప్రారంభం నుండే లాస్ ఏంజిల్స్ కౌంటీలో 60కి పైగా అగ్ని ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ సంఖ్య 2012 నుండి 2024 వరకు సగటు కంటే 40 రెట్లు ఎక్కువని తేలింది. ముఖ్యంగా, పశ్చిమ అమెరికాలో సంభవించే భారీ అటవీ మంటలకు వాతావరణ మార్పులతో సంబంధం ఉందని ఇటీవలి పరిశోధనలు స్పష్టంగా పేర్కొన్నాయి.

అక్టోబర్ నుండి లాస్ ఏంజిల్స్‌లో 4% వర్షపాతమే

సాధారణంగా జనవరి-మార్చి మధ్య ఎటువంటి అగ్ని ప్రమాద హెచ్చరికలు ఉండవు. అందులోనూ… శీతాకాలంలో వచ్చే వర్షం, చల్లదనం కూడా మంటల్ని అదుపు చేస్తాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. అక్టోబర్ నుండి లాస్ ఏంజిల్స్‌లో కేవలం 4 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. కరువు చాలా పెరిగిపోయింది. ఎండిపోయిన వృక్షాలతో అడవి అంతా మంటలంటుకోడానికి సిద్ధంగా ఉంది. దానికి తోడు, శాంటా అనా నుండి బలమైన పొడి గాలులు మంటలను ఆర్పడానికి చేసిన అన్ని ప్రయత్నాలను విఫలం చేసాయి.

2022-2023లో భారీ వర్షపాతం.. 2024లో వర్ష లేమి

నిజానికి, 20వ శతాబ్దం మధ్యకాలం నుండి వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులకు కారణం అయ్యింది. నివేదికల ప్రకారం, ఈ అస్థిర వాతావరణం 31 నుంచి 66 శాతం పెరిగినట్లు శాస్త్రవేత్తలు అధ్యయనాల్లో కనుగొన్నారు. దీని అర్థం, కాలిఫోర్నియా దశాబ్దాల తరబడి కరువును ఎదుర్కొన్నట్లే.. 2022-2023లో భారీ వర్షపాతం నమోదై, 2024లో వర్షాలు లేకుండా మారింది. ఈ వాతావరణ మార్పు వల్ల కార్చిచ్చులు మరింత తీవ్రంగా మారాయి.

భూమిని వేడిగా, పొడిగా మార్చుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు

నిపుణులు అభిప్రాయం ప్రకారం.. కాలిఫోర్నియా కార్చిచ్చులు, సహజ వాతావరణ మార్పులతో పాటు, మానవ తప్పిదాల వల్ల కూడా ఏర్పడిన విలయం అని చెప్పాలి. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు భూమిని వేడిగా, పొడిగా మార్చుతున్నాయి. దీనితో, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం చాలా రెట్లు పెరిగింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా… 2023, 2024 అత్యంత వేడిగా ఉండే సంవత్సరాలుగా నమోదయ్యాయి. ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఈ సమస్య మరింత తీవ్రంగా మారే పరిస్థితులే ఉన్నాయి.

అడవులకు పట్టణ ప్రాంతాలకు మధ్య ఇళ్ల నిర్మాణం

దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటా అనా గాలుల కారణంగా మంటలను అదుపు చేయడం భవిష్యత్తులో మరింత కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గాలులు మంటలను ఎంతగా వ్యాపింపజేస్తాయంటే.. దానిని ఆపడం దాదాపు అసాధ్యమనే స్థాయిలో విలయం రానుంది. అడవులకు పట్టణ ప్రాంతాలకు మధ్య ఇళ్లు నిర్మిస్తున్న క్రమంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారబోతోంది. అందుకే, కాలిఫోర్నియాలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది.

వాతావరణ మార్పును ఎదుర్కోవాలనే హెచ్చరికలు

అయితే, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నాయి. వాతావరణ మార్పును ఎదుర్కోవాలనే హెచ్చరికలు దశాబ్దాలుగా వస్తున్నా… ఏ ఒక్కరూ దానిపై దృష్టి పెట్టలేదు. కాలిఫోర్నియాలో తాజా కార్చిచ్చును అడ్డుకోడానికి పసిఫిక్ పాలిసాడ్స్‌లోని శాంటా య్నేజ్ రిజర్వాయర్‌లో నీటి నిల్వ అవసరం అయ్యింది. గతంలో కార్చిచ్చులను కూడా ఇదే అడ్డుకుంది. అయితే, ఇటీలవ పెద్దగా వర్షాలు లేకపోవడంతో.. గత ఫిబ్రవరి నుండి మరమ్మతుల కోసం దీనిని మూసివేశారు.

ఐక్యరాజ్య సమితి 2030 ఎజెండాలో భాగంగా ప‌థ‌కం

ఈ కీలకమైన నీటి సరఫరా వ్యవ‌స్థ ఇలాంటి అవసరమైన సమయంలో నిరుపయోగంగా మారడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక, ఇటీవల కాలిఫోర్నియాలో స్మార్ట్ సిటీల ఏర్పాటు చాలా పెరిగింది. కాలిఫోర్నియా అంతటా స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయ‌డానికి ఐక్యరాజ్య సమితి ఎజెండాలో భాగంగా 2030 ప‌థ‌కం వచ్చింది. దీని తర్వాత, కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో భూకబ్జాలు జోరందుకున్నాయి. అడవులను నరికేయడం పెరిగింది. పచ్చదనం తగ్గిపోవడంతో వేడి విపరీతం అయ్యింది. ఫలితం కార్చిచ్చులు అధికమయ్యాయి. ఇక, ఇప్పటికైనా, ప్రపంచ పెద్దన్నా కళ్లు తెరుస్తుందో లేదో చూడాలి.

నిజానికి, పారిస్ ఒప్పందంపై సంతకం పెట్టిన దేశాలన్నీ ఇలాంటి ప్రమాదాలకు కారణమనే చెప్పాలి. ఇవన్నీ, ఒప్పందానికి ఒప్పుకున్నాయి తప్పా.. దాన్ని అమలు చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాయి. ఇక, ఇప్పుడైనా క్లైమేట్ ఛేంజ్‌ని సీరియస్‌గా తీసుకోకపోతే… ఇలాంటి కార్చిచ్చులకు అమెరికా మాత్రమే కాదు… అన్ని దేశాలూ బలికావాల్సి వస్తుంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×