
Sam Altman : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాట్‌జీపిటీతో విప్లవం తీసుకువచ్చిన ప్రముఖ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మన్.. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా స్వయంగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
సామ్ ఆల్ట్‌మన్‌తో పాటు ‘ఓపెన్ ఏఐ’ గ్రెగ్ బ్రాక్‌మెన్ కూడా మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చె టీమ్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈ వార్త ఐటీ రంగంలో సంచలనం రేపుతోంది. ఎందుకంటే ఇటీవలే ‘ఓపెన్ ఏఐ’ సంస్థ నుంచి సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించారు. అంతకుముందు ‘ఓపెన్ ఏఐ’లో సామ్ ఆల్ట్‌మన్ సీఈఓ పదవిలో ఉన్నారు.
అయితే ‘ఓపెన్ ఏఐ’ సంస్థ బోర్డు డైరెక్టర్లు.. సామ్ ఆల్ట్‌మన్ మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఆయనను ‘ఓపెన్ ఏఐ’ పదవి నుంచి తొలగించారు. ఈ పరిణామాల తరువాత ‘ఓపెన్ ఏఐ’ చైర్మెన్, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మెన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. సామ్ ఆల్ట్‌మన్ స్థానంలో మీరా మురాటీ సీఈఓ బాధ్యతులు నిర్వహిస్తున్నారు.
సామ్ ఆల్ట్‌మన్ తొలగింపుకు కారణం
‘ఓపెన్ ఏఐ’ ఒక స్వచ్చంధ సంస్ధ( నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ – లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలు మానువులందరికీ ఉపయోగపడాలని ఆ సంస్థ ఉచితంగా సేవలందిస్తోంది. అందుకే చాట్ జీపిటీ అందరికీ ఉచితం. దీంతో చాట్‌జీపిటీ డిమాండ్ భారీగా పెరిగిపోయింది.
ఇది చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇతర ప్రయోజనాల కోసం వృద్ధి చేయవచ్చని భావించిన సామ్ ఆల్ట్‌మన్.. చాట్‌జీపిటీ మాత్రమే ఉచితం. కంపెనీ తరపున కొత్త ఏఐ ప్రాడక్ట్స్‌ను కమర్షియల్ చేయాలని కంపెనీ డైరెక్టర్లకు చెప్పాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సామ్ ఆల్ట్‌మన్.. కొత్తగా ‘వరల్డ్‌కాయిన్’ అనే క్రిప్టోకరెన్సీ సంస్థలో కూడా సీఈఓగా పనిచేస్తున్నారు. ఇలా చేయడం నైతికంగా తప్పు అని ‘ఓపెన్ ఏఐ’ డైరెక్టర్లు వాదించారు. అలాగే సామ్ ఆల్ట్‌మన్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో తమ సంస్థ గురించి రహస్యంగా చర్చలు జరుపుతున్నారని తెలిసింది. దీంతో ఆయనను ‘ఓపెన్ ఏఐ’ సంస్థ నుంచి తొలగించారు.