TVK Vijay: సినీ నటుడు హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(TVK) 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతున్నట్లు బుధవారం ప్రకటించింది. టీవీకే అధినేత హీరో విజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మహాబలిపురంలోని ఓ హోటల్‌లో పార్టీ అధ్యక్షుడు విజయ్ అధ్యక్షతన జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో టీవీకే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 2000 మంది టీవీకే నేతలు పాల్గొన్నారు.
కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన 41 మందికి నివాళిగా రెండు నిమిషాల మౌనం పాటించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ ఘటన తమకు ఒక గుణపాఠమని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకుంటామని టీవీకే పేర్కొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు టీవీకే, డీఎంకే మధ్య మాత్రమే పోటీ అని ఆ పార్టీ తెలిపింది. విజయ్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ జనరల్ కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించింది. ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య ఆ నిర్ణయాలు తీసుకునే అధికారం విజయ్ ఇస్తూ పార్టీ తీర్మానం చేసింది.
తొక్కిసలాట ఘటనతో తాను, తన పార్టీ తీవ్ర దుఃఖంలో ఉన్నామని టీవీకే అధినేత విజయ్ తెలిపారు. అందుకే తాను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానన్నారు. కానీ ఈ ప్రమాదంపై టీవీకే గురించి దురుద్దేశపూరిత రాజకీయ ప్రచారాలు, నిరాధారమైన పుకార్లు సృష్టించారన్నారు. టీవీకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ రాజకీయ, విధానపరమైన వైఖరిపై మొత్తం 12 తీర్మానాలను ఆమోదించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని టీవీకే కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. ఈ ప్రక్రియతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించింది.
శ్రీలంక నౌకాదళం తమిళ మత్స్యకారులను అరెస్ట్ చేస్తున్నా, డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విజయ్ ఆరోపించారు. తమిళుల ప్రయోజనాలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తమిళనాడులో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. కోయంబత్తూరు కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన ఇందుకు ఉదాహరణ అన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
Also Read: Delhi Politics: ఓట్ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్ మోడల్‌కు ఓటు హక్కు, హవ్వా
ఎన్నికల పొత్తులపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం విజయ్‌కు మాత్రమే ఉందని టీవీకే స్పష్టం చేసింది. 2026 ఎన్నికల్లో తమ పార్టీ సొంత కూటమికి నాయకత్వం వహిస్తుందని తీర్మానం చేసింది. టీవీకే కౌన్సిల్ సమావేశం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను భద్రతా కారణాల చూపుతూ తొలగించారు. దీనిపై టీవీకే ఆగ్రహం వ్యక్తం చేసింది.