BigTV English

YS Jagan 2.0: రూటు మార్చిన జగన్.. 2.0 వెనుక పెద్ద స్కెచ్చే..?

YS Jagan 2.0: రూటు మార్చిన జగన్.. 2.0 వెనుక పెద్ద స్కెచ్చే..?

YS Jagan 2.0: చాలా గ్యాప్ తర్వాత, విదేశీ పర్యటన ముగించుకున్నాక, చారిత్రక ఓటమి తర్వాత వైఎస్ జగన్ మరోసారి తన గళం విప్పారు. వచ్చే ప్రభుత్వం జగన్ 2.0 చూస్తారని చెప్పడం ద్వారా చాలా సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల రాగం ఎత్తుకున్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు వారిని వెంట ఉండేలా చూసుకునేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత, క్యారెక్టర్ ముఖ్యమంటూ చెప్పడం వెనుక ఏ ప్లాన్ దాగి ఉంది? అధికారం పోతేనే కార్యకర్తలు గుర్తొస్తున్నారా?


వైఎస్ జగన్ జనవరి 11న లండన్ వెళ్లి ఫారిన్‌లో లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా వస్తూనే డైరెక్ట్ హైదరాబాద్ లేదంటే విజయవాడ కాదు.. బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. యలహంక ప్యాలెస్ వెళ్లారు. తాజాగా అమరావతి వచ్చారు. సో ఇప్పుడు మ్యాటర్ జగన్ లండన్ టూర్ కాదు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో విజయవాడ నగరపాలక సంస్ధ వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముఖ్య నేతలతో భేటీ నిర్వహించడం, అందులో చెప్పిన మాటల చుట్టూ ఇప్పుడు రాజకీయం గరంగరంగా మారింది.

ఈసారి వచ్చే జగన్ 2.0 వేరుగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తానన్నారు. గతంలో పార్టీ శ్రేణులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వ లేకపోయానన్నారు. జగన్ 1.0లో కార్యకర్తలకు గొప్పగా చేయలేకపోయా. మొదటే ప్రజలే గుర్తొచ్చారు.. వారికోసమే తాపత్రయపడ్డానన్నారు. ఇప్పుడు కార్యకర్తల్ని చంద్రబాబు సర్కార్ పెడుతున్న ఇబ్బందులు చూస్తున్నానని, వారికి అండగా ఉంటానన్నారు. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్నాళ్లూ కార్యకర్తల్ని ఎందుకు పట్టించుకోలేదు? విపక్షంలో ఉన్నప్పుడే గుర్తొచ్చారా అన్న పాయింట్స్ తెరపైకి వస్తున్నాయి. అంతే కాదు.. మాజీ సీఎం జగన్ మళ్లీ కలల్లో తేలిపోతున్నారా అన్నది కూడా చర్చనీయాంశమైంది. మనిషి మారలేదా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏపీని వైసీపీ 30 ఏళ్ల పాటు పాలిస్తుందని, కథ మార్చేస్తామని అంటున్నారు.


ఇప్పుడు జగన్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన క్లియర్ కట్ సందేశం ఏంటంటే.. కేసులకు భయపడొద్దు, జైళ్లో పెట్టినా తగ్గొద్దు.. రెట్టించిన ఉత్సాహంతో పార్టీకోసం పని చేయాలంటున్నారు. నిజానికి ఇదే కార్యకర్తల కోసం తన తొలి టర్మ్ పాలనలో ఏమీ చేయలేదని జగన్ ఒప్పుకున్నా.. మనస్ఫూర్తిగా చెప్పలేని విషయాలు చాలానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి పవర్ లో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోకి ఎవరినీ పెద్దగా అనుమతించలేకపోయారు.

నిజానికి ఏ లీడరైనా గెలవాలంటే ముఖ్య కారణం గ్రౌండ్ లెవెల్‌లో పని చేసే కార్యకర్తలే. కానీ వైసీపీలో మాత్రం గత ఐదేళ్లు పూర్తిగా రివర్స్. రావాలి జగన్.. మమ్మల్ని కలవాలి జగన్ అంటూ ఒక దశలో కార్యకర్తలు తాడేపల్లి ప్యాలెస్ ముందు నినాదాలు కూడా చేశారు. వైసీపీ ఓడిన తర్వాత కూడా వెళ్లి కలుద్దామన్న వారికి చుక్కెదురు తప్పలేదు. ఇంకా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తాడేపల్లి ప్యాలెస్ ముందున్న రోడ్లలో ఆంక్షలు తొలగిపోయి సామాన్య జనం రాకపోకలకు వీలు కల్పించారు. గతంలో ఫొటోలు, గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించే వారు. అదీ పరిస్థితి.

సో ఇప్పుడు కథ మారింది. గోడలు బద్దలయ్యాయ్. కనీసం రాకపోకలకైనా ఛాన్స్ దొరుకుతోంది. మొత్తానికి ఫారిన్ టూర్ ముగించుకుని వచ్చిన జగన్ చాలా విషయాలే చెబుతున్నారు. అధికారంపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. మరి అన్నీ అనుకున్నట్లు సాగుతాయా? ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అవుతోందా? అన్న చర్చ జరుగుతోంది. నిజానికి జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. అక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావించడం లేదు. కావాల్సినంత నెంబర్ లేకపోయినా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రస్తుతం 11 సీట్లే వైసీపీకి ఉన్నాయి.

ఇలాగే చేస్తే ఆ 11 మందిలో కూడా ఉండేదెవరో.. ఊడేదెవరో అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే సభలో విపక్షం ఉండాలి. అప్పుడే ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంది. కానీ తాను మీడియా ముందే అధికార పక్షాన్ని నిలదీస్తానని జగన్ పట్టుబట్టుక్కూర్చున్నారు. లేటెస్ట్ గా సభలో సీఎం మాట్లాడినంత టైం ఇస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు జగన్. సభలో ఎదురెదురుగా కూర్చుని ఫైటింగ్ చేసుకోవాల్సిన పని లేదని కొత్త ఫార్ములా వినిపిస్తున్నారు. జగన్ 2.0 అంటే ఉన్న 11 సీట్లు కూడా ఖతమే అని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉంటే కేసులు మీద పడుతాయి.. అధికారంలోకి వస్తే పోతాయి ఇదే ఫార్ములాతో మాజీ సీఎం జగన్ ఉంటున్నారు. వైనాట్ 175 అన్నారు. తీరా 11కు పరిమితం అయ్యారు. దారి కనిపించడం లేదు. అందుకే కార్యకర్తల రాగం అందుకున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. మరోవైపు జగన్ ప్రతిపక్షంలోకి షిఫ్ట్ అయ్యాక.. మాటి మాటికి బెంగళూర్ టూర్ పెట్టుకుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. ఎవరెవరితో భేటీలు జరుపుతున్నారో తెలియదు. అంతా సీక్రెట్. ఒకప్పుడు చంద్రబాబు, పవన్ మాటి మాటికి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారంటూ విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు అదే రూట్ లో వెళ్తున్నారు. యలహంక ప్యాలెస్‌లో మకాం వేస్తున్నారు. దీనిపైనా అధికార కూటమి పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Also Read: జమ్మలమడుగు జగడం.. ఆ నేతల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటే..

గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పనులు, అక్రమాలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. కూటమి ప్రభుత్వం విచారణలకు ఆదేశిస్తోంది. లేటెస్ట్‌గా లిక్కర్ కేసులో అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకూ మద్యం విధానం ముసుగులో ఏం జరిగింది. ఎవరెవరు ఎంత నొక్కారన్న విషయాలపై సిట్ తేల్చబోతోంది. ఇదే కేసుపై గతేడాది సెప్టెంబర్ 23న ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, బినామీలకు నిర్దేశిత కమీషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపై పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చేయబోతున్నారు. దీనిపైనా జగన్ గరం గరం అవుతున్నారు. మద్యం లింకులకు తమ పార్టీ వాళ్లకు ఏం సంబంధం అంటున్నారు.

ఇప్పటికే వైసీపీలో చాలా మందికి కేసుల భయం పట్టుకుంది. నందిగం సురేశ్, కుక్కల విద్యాసాగర్, బోరుగడ్డ అనిల్ లాంటి వారు జైలుకెళ్లారు. సజ్జల విచారణ ఎదుర్కొన్నారు. కేసులు.. కోర్టులు విచారణలంటూ తిరుగుతున్నారు. ఇంకొందరైతే రాష్ట్రం వదిలేసి తమ సొంత పనులు చూసుకునేందుకు వెళ్లిపోతున్నారంటున్నారు. సిచ్యువేషన్ ఇలాగే ఉంటే పార్టీ సంగతేంటన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో గుర్తు చేసుకోవాలని మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

నాయకుడు ఒకటి చెప్పారంటే దాన్ని కచ్చితంగా ఫాలో అయి అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ జగన్ విషయంలో అలా జరగడం లేదు. ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న మాజీ సీఎం అసెంబ్లీకి మాత్రం వెళ్లడానికి ఇష్టం చూపడం లేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 190 ప్రకారం 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే సభ అనుమతి లేకుండా అన్ని సమావేశాలకు గైర్హాజరైతే, సభ అతని స్థానాన్ని ఖాళీగా ప్రకటించవచ్చని చెబుతోంది. అయితే 60 రోజుల వ్యవధిని లెక్కించడంలో, సభను ప్రోరోగ్ చేసిన లేదా వరుసగా నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా వేసిన కాలానికి లెక్కలోకి తీసుకోవద్దన్న నిబంధన ఉంది. సో వేటు పడకుండా ఉండాలంటే అసెంబ్లీకి వచ్చి టెక్నికల్ గా సంతకం చేసి వెళ్లేలా చూసుకుంటారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా గత ఐదేళ్లలో ఎలా విధ్వంసం చేశారో కూటమి పార్టీలు లెక్కలతో సహా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×