BigTV English

Adi Narayana vs MP Ramesh: జమ్మలమడుగు జగడం.. ఆ నేతల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటే..

Adi Narayana vs MP Ramesh: జమ్మలమడుగు జగడం.. ఆ నేతల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందంటే..

Adi Narayana vs MP Ramesh: ఆ జిల్లాలో బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉంటుంది. అయినా కూటమి లెక్కలు కలిసి వచ్చి ఆ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీ ప్రజాప్రతినిధులుగా గెలిచారు. సీనియర్లు అయిన ఆ ఎమ్మెల్యే, ఎంపీలు ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య సఖ్యత లేకుండా పోయింది.. నువ్వా నేనా అన్నట్లు కత్తులు దూసుకుంటూ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్నారు. ఎక్కడో గెలిచిన ఎంపీ జిల్లాకు వచ్చి ఎమ్మెల్యే వర్గంపై పెత్తనం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నాయకులు? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతుంది? కమలం పార్టీలో అంతలావు కీచులాటలకు కారణమేంటి?


కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పాలిటిక్స్ ఎప్పుడు హాట్ హాట్‌గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కారణమవుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటుండటం నియోజకవర్గంలో కాక రేపుతోంది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అయిన దేవగుడి ఆదినారాయణరెడ్డిది ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి గెలిచిన సీఎం రమేష్ కాంట్రాక్టర్ అయిన బిగ్‌షాట్. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్‌లు మధ్య విభేదాలు నియోజకవర్గ రాజకీయాల్లో హీట్ పెంచేస్తున్నాయి. ఈ ఇద్దరు కమలం పార్టీ నుండి తొలిసారి పోటీ చేసి గెలిచిన వారే. వారిద్దరి స్వగ్రామాలు జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఉండటం విశేషం.

దేవగుడి ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం జమ్మలమడుగు.. సీఎం రమేష్ నాయుడు స్వగ్రామం ఎర్రగుంట్ల దగ్గర పొట్లదుర్తి. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ బీజేపీ టికెట్ దక్కించుకున్న సీఎం రమేష్ అనకాపల్లికి వెళ్లి తక్కువ కాలంలోనే అక్కడ చక్రం తిప్పి విజయం సాధించారు. అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేశ్ జమ్మలమడుగు నియోజకవర్గంలోని విషయాలపై ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఆయన దూకుడుతో సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణరెడ్డి అసంతృప్తిగా ఉన్నారట.


ఈనెల 2న కడప జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సీఎం రమేశ్‌ లేఖ రాయడం ఇద్దరి మధ్య పెద్ద రచ్చకు దారి తీసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో నకిలీ మద్యం, మట్కా జూదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని.. వాటిని నిలువరించాలంటూ జిల్లా అధికారులకు సీఎం రమేశ్‌ లేఖ రాశారు. నియోజకవర్గంలో యథేచ్చగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కాపురాల్లో చిచ్చుపెట్టే అలాంటి వాటిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాని జిల్లా ఉన్నతాధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Also Read: అన్ని పార్టీల టార్గెట్ 2029.. వ్యూహానికి ప్రతివ్యూహం

ఎంపీ రాసిన లేఖపై వెంటనే స్పందించిన జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు జమ్మలమడుగులోని క్లబ్బుని మూసివేశారు. దాంతో ఎమ్మెల్యే కి ఎంపీ కి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయిందన్న ప్రచారం జరుగుతుంది. సీఎం రమేష్ అధికారులకు రాసిన లేఖలో ఎక్కడా ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకపోయినా.. నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించడం ద్వారా సీఎం రమేశ్‌ ఉద్దేశం ఏంటో ఆర్ధమవుతుందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గానికి చెందిన దేవగుడి నాగేశ్వర్ రెడ్డి ఆ దందాలు నడుపుతున్నారని సీఎం రమేష్ లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏటంటే దేవగుడి నాగేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దగ్గర బంధువే. దాంతో ఎంపీ ఫిర్యాదుతో ఎమ్మెల్యే ఇరుకున పడ్డట్లైంది.

నియోజకవర్గంలో కాంట్రాక్టర్ల విషయంలోను ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌ ఉందట. జమ్మలమడుగులో అదాని సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ కూడా ఇద్దరి మధ్య విభేదాలకు మరింత కారణమైందట. అదానీ ప్లాంట్ పనులకు సీఎం రమేష్‌కు చెందిన సంస్థ సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తుందంట. ఆ సంస్థ చేస్తున్న పనులకు ఎమ్మెల్యే వర్గం అడ్డం పడుతుందన్న ప్రచారం ఉంది. గతంలో ఆదానీ సంస్థ కార్యాలయంలో సిబ్బందిని ఎమ్మెల్యే వర్గీయులు బెదిరించడం హాట్‌ టాపిక్‌ మారింది. ఈ విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆ క్రమంలో ఎంపీ సీఎం రమేష్ అధికారులకు లేఖ రాయడం… అధికారవర్గం వేగంగా చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యే వర్గీయులకు మింగుడు పడటం లేదంట. పేకాట క్లబ్బులు మూయించడం ఓకే అయినా.. ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వార్ ఎటు నుంటి ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన నియోజకవర్గ వాసుల్లో కనిపిస్తుంది. కూటమి పెద్దలు తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితులు సెట్‌రైట్ చేయకపోతే.. ఫ్యాక్షన్‌ ప్రభావం తగ్గుతున్న జమ్మలమడుగులో పరిస్థితులు చేతులు దాటిపోయే ప్రమాదం ఉందని స్థానికులు బెంబేలెత్తుతున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×