BigTV English

Stephen Hawking | విశ్వం గుట్టు విప్పిన స్టీఫెన్ హాకింగ్.. అంగవైకల్యంతోనే మానవాళికి అద్భుత సేవలు

Stephen Hawking | చిన్నప్పటి నుంచే హుషారైన కుర్రాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంట పడి చివాట్లూ తిన్నాడు. వీకెండ్ వస్తే.. ఫ్రెండ్స్, పార్టీలే లోకంగా గడిపాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. చరిత్ర ఎరుగని విశ్వం పుట్టుక నుంచి.. మొత్తం సృష్టిని మింగేయగల కృష్ణ బిలాల గుట్టును సామాన్యులకూ అర్థమయ్యేలా చెప్పి ఒప్పించగలిగాడు.

Stephen Hawking | విశ్వం గుట్టు విప్పిన స్టీఫెన్ హాకింగ్.. అంగవైకల్యంతోనే మానవాళికి అద్భుత సేవలు

జనవరి 8.. స్టీఫెన్ హాకింగ్(Stephen Hawking) జయంతి


Stephen Hawking | చిన్నప్పటి నుంచే హుషారైన కుర్రాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంట పడి చివాట్లూ తిన్నాడు. వీకెండ్ వస్తే.. ఫ్రెండ్స్, పార్టీలే లోకంగా గడిపాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. చరిత్ర ఎరుగని విశ్వం పుట్టుక నుంచి.. మొత్తం సృష్టిని మింగేయగల కృష్ణ బిలాల గుట్టును సామాన్యులకూ అర్థమయ్యేలా చెప్పి ఒప్పించగలిగాడు. 21వ ఏట ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి, చక్రాల కుర్చీకే పరిమితమైనా, ‘నువ్వు రెండేళ్లకు మించి బతకవు’ అని వైద్యులు తేల్చేసినా.. చిరునవ్వుతో మరో 50 ఏళ్ల పాటు అనుక్షణం మృత్యువుతో సహవాసం చేశాడు. అతడెవరో కాదు.. తన మేధోశక్తితో ఈ తరం ఐన్‌స్టీన్ అనిపించుకున్న స్టీఫెన్ హాకింగ్.

హాకింగ్ 1942 జనవరి 8న ఆక్స్‌ఫర్డ్‌లోని ఒక వైద్యుల కుటుంబంలో జన్మించారు. చదువులో పెద్దగా ప్రతిభ కనబర్చకపోయినప్పటీకీ.. చిన్నారి హాకింగ్‌ తెలివితేటల్ని చూసి టీచర్లు ఆశ్చర్యపోయేవారు. తొమ్మిదేళ్ల వయసులోనే హాకింగ్‌కు ‘ఐన్‌స్టీన్‌’ అనే నిక్‌నేమ్‌ కూడా ఉండేది. తొలుత హాకింగ్‌ను డాక్టర్‌ చేయాలని ఆయన తండ్రి భావించి, బయాలజీ చదవాలని కోరినా.. మేథమేటిక్స్ మీద ఇష్టంతో అందులోనే డిగ్రీ చేయాలనుకున్నారు. కానీ.. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో గణిత డిగ్రీకి పెద్ద విలువ లేకపోవటంతో ఫిజిక్స్‌ను ఎంచుకున్నారు. అనంతరం కేంబ్రిడ్జి నుంచి ఉన్నత విద్యను పొందిన హాకింగ్.. అప్లైడ్ మేథమేటిక్స్, ధియరిటికల్ ఫిజిక్స్ అంశాల మీద PhD డిగ్రీని పొందారు.


1963లో, 21 సంవత్సరాల వయస్సులో, హాకింగ్‌కు మోటారు న్యూరాన్ వ్యాధి బారిన పడ్డారు. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపే ఈ అరుదైన రోగం కారణంగా శరీర కండరాలు బలహీనపడటంతో తినటం, కదలటం చేయలేని స్థితికి చేరుకున్నారు. పూర్తిగా నయమయ్యే అవకాశమే లేని ఈ వ్యాధితో నరాల నుంచి మెదడుకు సంకేతాలు ఆగిపోయి పక్షవాతం బారిన పడ్డారు. చక్రాల కుర్చీకే పరిమితమైన హాకింగ్.. 1985లో జెనీవాలో పర్యటిస్తుండగా, న్యుమోనియా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. గాలి కూడా పీల్చుకోలేని స్థితిలో.. వైద్యులు గొంతుకు రంధ్రం చేసి కృత్రిమ శ్వాసను అందించారు. దీంతో ఆయన మాట్లాడే అవకాశాన్నీ కోల్పోయారు. కొంతకాలంపాటు కనుబొమల కదలికలతో, స్పెల్లింగ్‌ కార్డుల సాయంతో అక్షరాలను సూచిస్తూ వచ్చారు.

ఆ తర్వాత మాట్లాడేందుకు, రాసేందుకు దోహదపడే ‘వూల్టోజ్‌ ఈక్వలైజర్‌’ అనే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌‌ను ఆపిల్‌- 2 కంప్యూటర్‌‌కు, స్పీచ్‌ సింథసైజర్‌ అనే పరికరానికి అనుసంధానించి, తన చక్రాల కుర్చీకి అమర్చుకుని నిమిషానికి 15 పదాల చొప్పున మాట్లాడటం ప్రారంభించారు. అయితే, 2008 నాటికి బొటనవేలిని కూడా కదిలించలేని స్థితిలో మౌస్‌ను క్లిక్ చేయలేకపోయారు. ఆ తర్వాత హాకింగ్‌ విద్యార్థి ఒకరు ‘చీక్‌ స్విచ్‌’ అనే పరికరాన్ని డెవలప్ చేసి, హాకింగ్‌ కళ్లజోడుకు జోడించి, ఆయన దవడ కండరాల కదలికతో పనిచేసేలా చేయగలిగాడు. అలా.. దీనిసాయంతో హాకింగ్‌ ఈ మెయిళ్లు రాయడం, ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయడం, పుస్తకాలు రాయడం, స్పీచ్‌ సింథసైజర్‌ సాయంతో మాట్లాడగలగడం వంటి అనేక పనులు చేయగలిగారు. 2011 నాటికి పరిస్థితి మరింత క్షీణించింది. నిమిషానికి ఒకట్రెండు మాటలే మాట్లాడే స్థితికి వచ్చినప్పుడు.. ఇంటెల్‌ వ్యవస్థాపకుడు గార్డన్‌ మూర్‌ తన కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జస్టిన్‌ రాట్నర్‌, కొంతమంది నిపుణుల సాయంతో హాకింగ్‌ ఆలోచనలనే మాటల రూపంలోకి మార్చగలిగారు.

హాకింగ్ మాటలు…

‘21 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి జీవితంపై నా అంచనాలన్నీ సున్నా అయిపోయాయి. ఆ తరువాత నాకు దక్కిందంతా బోనస్‌’’
‘అధిక జనాభా, వాతావరణ మార్పులు, భూమి దిశగా వచ్చే గ్రహ శకలాల వల్ల మనం మరో 1000 ఏళ్లలో ఈ భూమిని ఖాళీ చేసి మరో గ్రహాన్ని వెతుక్కోవాలి’
‘మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అన్నవి అసలే లేవు. అవన్నీ కట్టుకథలే. కంప్యూటర్ లాంటి మన మెదడు సాయంతో జీవించి ఉండగానే మనలోని శక్తి సామర్థ్యాల్ని సమర్థంగా వినియోగించుకోవాలి.
‘దేవుడు లేడని ఎవ్వరూ నిరూపించలేరు. కానీ సైన్స్‌.. దేవుడి అవసరం లేకుండా చేస్తుంది’

రచనలు
తన జీవితపు తొలిరోజులను ‘మై బ్రీఫ్‌ హిస్టరీ’ పేరుతో హాకింగ్ ఓ ఆత్మకథగా రాసుకున్నాడు. 1988లో ‘ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌’ పేరుతో సామాన్యులకు అర్థమయ్యేలా భౌతిక, ఖగోళ సిద్ధాంతాలను వివరించారు. 2001 నాటికి ఈ పుస్తకం 35 భాషల్లో తర్జుమా అయింది. లియోనార్డ్‌ మ్లోడినౌ అనే మరో భౌతికశాస్త్రవేత్తతో కలసి హాకింగ్ రాసిన ‘ది గ్రాండ్‌ డిజైన్‌’ అనే మరో పుస్తకం 2010లో విడుదలైంది. ఇందులో బిగ్‌బ్యాంగ్‌(విశ్వ ఆవిర్భావం) భౌతికశాస్త్ర నియమాల ప్రకారమే జరిగింది తప్ప ఇందులో దేవుడి ప్రమేయమేమీ లేదని వివరించారు. ఏ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌ పుస్తకానికి సీక్వెల్‌గా 2001లో ‘యూనివర్స్‌ ఇన్‌ ఏ నట్‌షెల్‌’ అనే పుస్తకాన్ని హాకింగ్ రాశారు. ఇందులో తన పరిశోధనలను, క్వాంటమ్‌ మెకానిక్స్,ఐన్‌స్టీన్, రిచర్డ్‌ ఫైన్‌మెన్‌ల సిద్ధాంతాలను వివరించారు. ఈ పుస్తకం 2002లో అవెన్టిస్‌ ప్రైజ్‌కు ఎంపికైంది. 2007లో చిన్నారుల కోసం తన కుమార్తె లూసీతో కలిసి ‘జార్జ్‌స్‌ సీక్రెట్‌ కీ టు యూనివర్స్‌’ అనే పుస్తకం రాశారు. ఇందులో కథల రూపంలో విశ్వంలోని సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేలా హాకింగ్‌ ఇందులో వివరించారు.

భారత్‌ పర్యటన
తొలిసారి 2001లో భారత్‌కు వచ్చిన హాకింగ్‌ 16 రోజులపాటు పర్యటించారు. అప్పుడే.. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో జరిగిన ఓ సెమినార్‌లో ప్రసంగించారు. అలాగే ‘స్ట్రింగ్స్‌ 2001’పేరుతో జరిగిన మరో కార్యక్రమంలో నిర్వాహకులు హాకింగ్‌ను ‘సరోజిని దామోదర్‌ ఫెలోషిప్‌’తో సత్కరించారు. హాకింగ్‌ చక్రాల కుర్చీని అమర్చేలా మహీంద్రా అండ్‌ మహీంద్రా రూపొందించిన ప్రత్యేకమైన కారులో ఆయన ముంబైలో విహరించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్, కుతుబ్‌మీనార్‌లను సందర్శించిన హాకింగ్‌ ఈ పర్యటనలో భాగంగా అప్పటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ను కలుసుకుని దాదాపు 45 నిమిషాల సేపు ముచ్చటించారు.

ప్రేమ పెళ్లి.. విడాకులు.
1963లో నూతన సంవత్సర వేడుకల్లో జేన్‌ విల్డే అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ అప్పుడే ఆయనకు నరాల వ్యాధి బయటపడింది. ఈ సంగతి తెలిసీ ఆమె పెళ్ళికి సిద్ధపడటంతో 1965లో వారు వివాహం చేసుకున్నారు. వీరికి రాబర్ట్, తిమోతి అనే కుమారులు, లూసీ అనే అమ్మాయి ఉన్నారు. పెళ్లి తర్వాత నర్సుగా సపర్యలు చేయడానికి వచ్చిన ఎలైన్‌ మాసన్‌తో.. హాకింగ్‌ సన్నిహితంగా ఉండటంతో వీరి కాపురంలో కలతలు చెలరేగి భార్య, పిల్లలకు దూరమయ్యారు. దీంతో ఆయన 1995లో ఎలైన్‌ను వివాహమాడారు. అయితే.. ఆమె తరచూ తనను కొడుతోందని హాకింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం, దానివల్ల వచ్చిన గొడవలతో 2006లో వీరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత హాకింగ్‌ తన పిల్లలకు దగ్గరయ్యారు. కుమార్తె లూసీతో కలసి సైన్స్‌కు సంబంధించి ఐదు పుస్తకాలు రాశారు.

నాలుగు శతాబ్దాల నాడు భూమ్యాకర్షణ సిద్దాంతంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఐజక్ న్యూటన్, 20 వ శతాబ్దంలో తన సాపేక్ష సిద్దాంతంతో సైన్స్ లోకాన్ని వేలు పట్టి నడిపించిన ఐన్‌స్టీన్ తర్వాత విశ్వం గుట్టుమట్లను విప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హాకింగ్.. 2018 మార్చి 14న తన 76వ ఏట కన్నుమూశారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×