CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై లోతైన చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్టు. వారికి కొన్ని కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
సమావేశంలో ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు నాయుడు ఇన్‌ఛార్జ్ మంత్రులకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే, వారిని సరిదిద్దే పూర్తి బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని మంత్రులను సీఎం ఆదేశించారు.
ఈ ముఖ్యమైన అంశాన్ని మొదట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేవనెత్తినట్లు సమాచారం. కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా లేదా నిర్దేశించిన పనితీరును పాటించకపోయినా.. వారిపై ఇన్‌ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించాలని.. తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు.
పవన్ కల్యాణ్ చేసిన సూచనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ఎమ్మెల్యేల బాధ్యతలను మంత్రులే పూర్తిగా తీసుకుంటారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ విషయంపై రాబోయే కేబినెట్ సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలను నిర్ధారిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల పనితీరులో లోపాలుంటే సహించేది లేదన్న సంకేతాలను ఈ సమావేశం ద్వారా సీఎం స్పష్టంగా పంపారు.
ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినప్పటికీ, అధిక దృష్టి ఎమ్మెల్యేల క్రమశిక్షణ, వారి పనితీరు మెరుగుదలపైనే కేంద్రీకృతమైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు తమ తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలపై మరింత పర్యవేక్షణ పెంచే అవకాశం ఉంది.
కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, కనీస క్రమశిక్షణ పాటించాలని ఈ సమావేశం గట్టి సందేశాన్ని పంపింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం మంత్రులకు ఇవ్వడం ద్వారా.. పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.