Big Stories

Stone Politics In AP: రాయి పడుద్ది!.. ఏపీలో కాకరేపుతున్న రాయి రాజకీయం

Stone Politics In Andhra Pradesh: భూమిలో ఉంటే పునాది రాయి. సరిహద్దుగా ఉంటే హద్దు రాయి. గుళ్లో ఉంటే దేవుడి రాయి. బయట ఉంటే గడప రాయి. ఏంటీ రాయి పురాణం చెబుతున్నారు అనుంటున్నారా.. అవును.. ఇప్పుడు ఏపీలో రాయి పురాణమే నడుస్తోంది. రాయి నామ స్మరణతో ఏపీ మారుమోగిపోతుంది. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి రాయి కాదు. ఇదో పొలిటికల్ రాయి. ఒకరికి తగిలి.. మరో ఇద్దరికి మిస్సవ్వడంతో.. ఇప్పుడు ఏపీ నేతలు రాయి సహస్ర నామాలు రాస్తున్నారు. రాయి జపం చేస్తున్నారు. మొత్తంగా ఏపీ ప్రజలకు పిచ్చెక్కిస్తున్నారు.

- Advertisement -

విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. కరెంట్ పోవడం.. రాయి రావడం.. సీఎం జగన్‌కు తగలడం. నుదుటి నుంచి రక్తంకారడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఆ తర్వాత మొదలైంది అసలు రాజకీయం. ఇదే అసలు టాపిక్. అందరూ ఊహించినట్టే రాయిపై రచ్చ మొదలుపెట్టారు అధికార, విపక్ష నేతలు. ఆ నెక్ట్స్‌ డేనే.. చంద్రబాబు, పవన్ రోడ్‌ షోలలో రాళ్లు పడ్డాయి. బట్‌.. అవి వాళ్లకు తగలలేదు.

- Advertisement -

అయితే అధికారపక్షమే చేయించిందని గట్టిగా విమర్శించలేకపోయాయి టీడీపీ, జనసేనలు.. ఎందుకంటే అలా చేస్తే.. జగన్‌పై దాడి చేయించింది విపక్షాలే అనే అస్త్రాన్ని వైసీపీ నేతలకు ఇచ్చినట్టే.. అందుకే ఆ జోలికి వెళ్లలేదు. కానీ భద్రతా వైఫల్యం, సీబీఐతో విచారణ జరిపించాలి. ఇలాంటి డిమాండ్లను తెర ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఇది టీడీపీ పన్నిన దుష్టపన్నాగమే అని ప్రూవ్ చేసే పనిలో వైసీపీ నేతలు. లేదు ఇదంతా సింపతి కోసం వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామా అని టీడీపీ నేతలు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

Also Read: జగన్‌పై రుసరుసలు, ఇదే పాలన..!

కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.. వాటికి సమాధానాలు మాత్రమే దొరకడం లేదు. సేమ్‌ 2019 ఎన్నికల ముందు జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. దెబ్బ చిన్నదే కానీ.. అది చూపిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. జగన్ గెలుపుకు ఒక కారణమైంది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్లీ జగన్‌పై రాళ్ల దాడి జరిగింది.అసలే పొలిటికల్ సీజన్.. సో దీన్ని కూడా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సానుభూతిని పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఒకరోజు ప్రచారం ఆగిపోయింది. తలకు కట్టుతో జగన్‌ బయటికి వచ్చారు. ఈ దెబ్బలు తనను ఆపలేవంటూ మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు.

సో కన్ఫామ్.. జగన్‌ రాయి ఘటనను రాజకీయం చేస్తున్నారు. భద్రతా వైఫల్యమో.. విపక్షాల కుట్రో  సానుభూతి సంపాదించడం కోసమో.. ఇలా రీజన్ ఏంటన్నది తెలీదు కానీ.. విసిరిన రాళ్లను మెట్లగా పెర్చుతూ మరోసారి అధికార కుర్చీని ఎక్కాలని డిసైడ్ అయ్యారు జగన్.. బట్ విపక్షం కూడా ఈసారి ఫుల్ అలర్ట్‌గా ఉంది. జగన్‌కు ఏ కోశాన కూడా సానుభూతి పవనాలు వీచనివ్వద్దని డిసైడ్ అయ్యాయి. అందుకే అటు పవన్.. ఇటు చంద్రబాబు.. రాయి దాడి కోడి కత్తికి సీక్వెల్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే చంద్రబాబు, పవన్ రోడ్ షోల్లో కూడా రాళ్లు పడ్డాయి. చంద్రబాబు గాజువాకలో ప్రచారం నిర్వహిస్తుండగా రాయి విసిరారు. కానీ గురి తప్పింది. తగిలితే ఆయనకు కూడా గాయమయ్యేదే.. తెనాలిలో జనసేన నేత పవన్‌కల్యాణ్‌పై కూడా రాయి విసిరారు. అది కూడా తగల్లేదు. రాయి విసిరిన వాడిని పట్టుకున్నారు. చితకబాదారు.. పోలీసులకు అప్పగించారు. రాళ్లే కాదు చంద్రబాబుపై, జగన్‌పై చెప్పులు కూడా ఇప్పటికే విసిరారు. జనం మద్యలో నుంచి పైకి లేచిన చెప్పును గుర్తించగలిగారు. కాని ఎవరి చేతిలో నుంచి చెప్పు పైకి లేచిందో ఇంతవరకు గుర్తించలేదు.

Also Read: పొత్తు చిత్తు.. సేనానిపై తిరుగుబాటు..

ఓవరాల్‌గా చూస్తే ఇలాంటి దాడులతో అలజడులు సృష్టించడం కోసమే అని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. ఇది ఎన్నికల సీజన్‌.. అందులో ఏపీ.. ఏ చిన్న నిప్పు రవ్వైనా చాలు.. అడవిని తగులబెట్టడానికి.. సేమ్ అదే స్టైల్‌లో ఏ చిన్న ఇష్యూ అయినా చాలు. రాష్ట్రం రావణకాష్టంలా మారడానికి.. ఈ విషయాలన్ని అధికార, విపక్షాలకు తెలుసు. కానీ ఎవ్వరూ సంయమనం పాటించడం లేదు. ఇరు వర్గాల మాటలు వింటుంటే.. అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి కానీ.. ఎక్కడా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేలా కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ ఏపీలో ఇలాంటి సిట్యూవేషన్ లేదు. మరి ఇవి నిజంగా ఆక్రోశంతో ప్రజలు వేస్తున్నవా? లేక ఆకతాయిలు ఆటలా? లేక అధికార, విపక్షాలు విసురుతున్న ప్రచారాస్త్రాలా? పోలీసులు తేల్చాలి.. కానీ ఈ లెక్కలు తెలేసరికి ఎన్నికలు ముగుస్తాయి.లాభపడే వారు పడుతూనే ఉంటారు.

అయితే ఎవరి వాదనలు వారివే.. ఎవరి ఆరోపణలు వారివే.. ఏపీలో పార్టీల నేతల నుంచి హుందాతనం ఎక్స్‌పెక్ట్ చేయడం.. మన మూర్ఖత్వమే అనే టాక్ ఉంది. కానీ ప్రజలు ఇక్కడొక విషయాన్ని గమనించాలి. నేతలు చేస్తున్న ఆరోపణల ట్రాప్‌లో అస్సలు పడకండి. గాయాలు తగ్గిపోతాయి. ఘటనలు మరుగున పడతాయి. ఊగిపోయే ప్రసంగాలు.. ఊకదంపుడు ప్రచారాలు ఎన్నో విన్నారు. బాంబ్‌ బ్లాస్ట్‌ల నుంచి  రాళ్ల దాడుల వరకు అన్ని చూశారు. సో మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించేందుకు ఆవేశాన్ని కాదు. ఆలోచనను ఉపయోగించండి. మీ పాలకుడిని ఎన్నుకునే అమూల్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News