ఈ విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 1,314 కాగా, వీరిలో 121 అసెంబ్లీ స్థానాల కోసం వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో ఒక కోటి 98 లక్షల 35 వేల 325 మంది పురుషులు, ఒక కోటి 76 లక్షల 77 వేల 219 మంది మహిళలు, 758 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.
అలాగే 18 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన కొత్త ఓటర్లు 7.38 లక్షల మంది కాగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న కొత్తగా నమోదు చేసిన ఓటర్లు 10.72 లక్షల మంది ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు, వీటిలో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు, తాగునీటి సదుపాయం, టాయిలెట్లు, షెడ్లు, ఇన్విజిలేటర్ల సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.
భద్రతా దృష్ట్యా గ్రామీణ, ఇతర ప్రాంతాల్లో కఠిన చర్యలు చేపట్టారు. సమస్యాత్మక, అత్యంత సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి, డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల విధుల్లో సుమారు 50 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 121 సాధారణ పరిశీలకులు, 18 పోలీస్ పరిశీలకులు, 33 ఇతర పరిశీలకులను నియమించింది.
పోలింగ్ జరుగుతున్న జిల్లాల్లో మదేపురా, సహర్సా, దర్భంగా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, శివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బేగుసరాయ్, ఖగారియా, ముంగేర్, లఖిసరాయ్, షేక్పురా, నలందా, పాట్నా, భోజ్‌పూర్, బక్సర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని ప్రజలు అధిక ఉత్సాహంతో పోలింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఓటర్ ఐడీతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ కార్డ్ వంటి 11 రకాల గుర్తింపు పత్రాలను ఉపయోగించే అవకాశం కల్పించారు.
ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ దళాలు సున్నిత ప్రాంతాల్లో మోహరించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
సమగ్ర ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద వయస్సు ఉన్నవారికి, వికలాంగులైన ఓటర్లకు ప్రత్యేక సాయం అందించేందుకు వాలంటీర్లను నియమించారు.
Also Read: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. ఇవాళ జరగనున్న తొలి దశ పోలింగ్ నేపథ్యంలో ప్రధానీ మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య వేడుకల్లో ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని కోరారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్లకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. గుర్తించుకోండి.. మొదట ఓటు, తరువాత రిఫ్రెష్‌మెంట్‌లు! అని సందేశం ఇచ్చారు.