ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత ఈజీ కాదు.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడం. అది క్లారిటీ. కాక్రోచ్ పార్టీ, జెన్‌జీ మూకుమ్మడిగా మొన్న జంతర్‌మంతర్ వేదికగా చేసిన పోరాటానికి మోడీ తలొగ్గాల్సి వచ్చింది. అందులో పెద్దగా రాజకీయ ప్రమేయం లేదు. ఈ పోరాటానికి యువత స్వచ్చంధంగా ముందుకు వచ్చింది.
పోలీసుల చర్యతో మరింత బద్నామైంది కేంద్రం. అందుకే వీటిన్నింటికీ తక్షణ పరిష్కారంగా ధర్మేంద్రను రాజీనామా చేయించడమేనని వెనక్కి తగ్గాడు మోడీ. దీన్ని పరాజయం అనుకోలేదు. నష్ట నివారణేనని అంగీకరించాడు. ఇప్పుడు పరిస్థితి దీనికి మించినది. తీవ్రత కలిగినది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం తీరునే ప్రశ్నించేది.
ఓటరు సవరణ జాబితా.. ఎస్ఐర్‌లో జ్ఞానేశ్వర్ అత్యుత్సాహం స్పష్టమైంది. కేంద్రం కనుసన్నల్లోనే ఇది జరిగిందనేది అందరికీ తెలిసిపోయింది. ఓ మరకైతే పడింది కేంద్ర సర్కార్‌పై. అది మామూలు ఆరోపణ కాదు. అసలు మోడీ ప్రధాని కావడంలోనే లోపం ఉందనేలా, బీజేపీ అధికారంలో ఉన్నదే మోసం చేసి అనేలా.. ఇది మరీ తీవ్రంగా మారి ఉంది.
ఈ విషయంలో తోటి కమిషనర్ల అభ్యంతరాలు బయటకు రావడమే దీనికి జీవం పోసింది. అప్పటి దాకా కాంగ్రెస్ దీనిపై పోరాటాలు చేస్తున్నా.. పెద్దగా ఫలితం రాలేదు. జనం పెద్దగా పట్టించుకోలేదు. కాక్రోచ్ పార్టీ, జెన్‌జీ కూడా దీనిపై సరైన సమాచారం, ఆధారాలు లేక నిమ్మకుండి పోయాయి.
కానీ ఇద్దరు కమిషనర్ల ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. మంచి ఊతం దొరికింది జెన్‌జీకి. అందుకే జంతర్‌మంతర్ 2.0గా ఈ పోరాటానికి నామకరణం కూడా చేసుకున్నారు. ముంబై కేంద్రంగా గాంధీ జయంతి నాడు చేపట్టిన జెన్‌జీ ఉద్యమం… విజయవంతమైంది. ఎన్నికల సంఘంపై విశ్వసనీయత ఎలా పోయిందో.. కాక్రోచ్, జెన్‌జీల ఉద్యమంపై జనంలో విశ్వసనీయ పెరుగుతున్నది. మోడీ భయం కూడా ఇదే. అందుకే జెన్‌జీని ఆయన లైట్‌గా తీసుకోవడం లేదు.
జ్ఞానేశ్ రాజీనామా చేయకపోతే ఈ నెల 10న జంతర్ మంతర్ చేరుకుంటామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాక్రోచ్ పార్టీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ప్రకటించి ఉన్నాడు. ముంబయి శివాజీ పార్క్ వద్దకు పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించిన యువత చొచ్చుకొచ్చారు. త్వరలో చేపట్టే ఉద్యమంలో భాగంగా జంతర్ మంతర్ వద్దా అదే పరిస్తితి ఉంటుందని కేంద్రానికి తెలుసు.
నీట్ పేపర్ లీకేజీ… ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆందోళన విషయంలో కూడా కేంద్రం ఎన్ని నిర్బంధాలు విధించాలో, ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్నీ పెట్టింది. కానీ వారు వినలేదు. కేంద్రమే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంత ఈజీగా జ్ఞానేశ్ రాజీనామాకైతే కేంద్రం తలొగ్గదు.
రాజీనామాకు ఒప్పుకుంటే తాము తప్పు చేశామని, తప్పులతడక ఓట్ల లిస్టుతోనే గెలిచామని ఒప్పుకున్నట్టవుతుంది. జ్ఞానేశ్‌ను వెనకేసుకొస్తే.. దొంగ దొరికినా.. బాహాటంగానే ఇక ఇలాగే ఎన్నికలకు పోయేందుకు సిద్దమయ్యారనే సంకేతం ఇచ్చినట్టవుతుంది.
రెండో ఆప్షన్‌లో .. దేశం కోసం, ధర్మం కోసం.. అనే ట్యాగ్‌లైన్ తమను కాపాడుతుందనే ధీమాతో బీజేపీ ముందుకు పోయే వ్యూహమే కనిపిస్తోంది. ఇప్పటికే మోడీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో… జెన్‌జీ పోరాటాన్ని అణగదొక్కి, ఎన్నికల సంఘాన్ని వెనుకేసుకొచ్చి.. ప్రజల వద్ద మోడీ విశ్వసనీయతనే పరీక్షగా పెట్టి మెజారిటీ జనం నాడి ఎలా ఉందో తెలుసుకునే రిస్క్ మోడ్ లోకి మోడీ వెళ్లేందుకు రెడీ అయ్యాడా? అనేది కీలక చర్చగా మారింది.