YCP Vs TDP: దశాబ్దాలుగా మా రాజ్యం, మా అడ్డా అన్నట్టు కడప జిల్లాలో దివంగత వైఎస్ ఫ్యామిలీ హవా నడిపించింది. కాంగ్రెస్‌లో వైఎస్ సొంత జిల్లాలో తన ఆధిపత్యం కొనసాగిస్తే.. తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ దాన్ని తన ఇలాకాగా మార్చుకున్నారు. మరీ ముఖ్యంగా పులివెందుల సెగ్మెంట్ వారికి కంచుకోటగా మారిపోయింది. అలాంటిదిప్పుడు జిల్లాల్లో జెడ్పీటీసీ బైపోల్స్ కాక రేపుతున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటిసి స్థానాల ఉప ఎన్నికకు ఎన్నికల నొటిఫికేషన్ జారీ అయింది. పులివెందుల జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ క్యాండెట్‌గా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి బరిలో నిలవడంతో అక్కడ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బైపోల్స్‌పై సీఎం చంద్రబాబు సైతం ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారంతో.. పులివెందులలో వైసీపీ కోటకు బీటలు తప్పవన్న ప్రచారం మొదలైంది
ఉత్కంఠ రేపుతున్న పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నిక
ఎన్నిక చిన్నదే కానీ పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోటీ మాత్రం రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తోంది.. మండల స్థాయిలో జరిగే ఎన్నికను టీడీపీ, వైసీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇలాకాలో జరుగుతున్న రెండు జెడ్పీటిసి స్థానాల ఉప ఎన్నిక జిల్లాలో కాక రేపుతోంది. వైసిపి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్నికల హ్యూహాలను రచిస్తుంటే.. టిడిపి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైసిపి కి చెక్ పెట్టే ప్రతి హ్యూహాలను రచిస్తున్నారు. వారికి పక్కనే ఉన్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తోడవ్వడంతో కడప జిల్లా బైపోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి..
పులివెందులలో ఎన్నికలు అంటేనే ఎత్తులు పై ఎత్తులు
కడప జిల్లా ఎన్నికలు అంటేనే ఎత్తులు పై ఎత్తులు.. వ్యూహాలు ప్రతి వ్యూహాలు .. అక్కడి పాలిటిక్స్ ఎవరికీ అంతుచిక్కవు.. వైఎస్ రాజశేఖరరెడ్డి 1978లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి కడప జిల్లా పులివెందులలో ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం ఆ కుటుంబానిదే అన్నట్లు పరిస్థితి తయారైంది. వైఎస్ మరణాంతరం జగన్ కూడా అదే పట్టు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా పేరుంది. అయింది ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇక్కడ అన్ని పార్టీల క్యాడర్ సిద్దంగా ఉంటుంది. కానీ ఉప ఎన్నిక అంటే రాజకీయ పార్టీల మధ్య సహజంగానే వేడి మరింత రాజుకుంటుంది.
50లో 49 జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ
గత జెడ్పీటీసీ ఎన్నికల్లో కడప జిల్లాలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది వైసీపీ. తర్వాత జడ్పీటీసీ స్థానాలు ఖాళీ అవ్వడంతో పులివెందుల, ఒంటిమిట్టలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంత జిల్లాలో చావు దెబ్బతిన్న వైసిపి ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.. 2020 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 50 జెడ్పీటీసి స్థానాలకు గాను వైసిపి 49 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం అట్లూరు జెడ్పీటిసి స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో 8 మంది జెడ్పీటిసీలు వైసిపి ని వీడి టిడిపీలో చేరారు
అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన ఒంటిమిట్ట జడ్పీటీసీ
ఒంటిమిట్ట నుంచి జెడ్పీటిసిగా గెలిచి జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. పులివెందుల జెడ్పీటిసిగా ఉన్న మహేశ్వర్ రెడ్డి అకాల మరణంతో రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది.. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జిల్లాలో రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఈ ఉప ఎన్నిక రెండు స్థానాల్లో జరుగుతున్నా పులివెందుల జెడ్పీటిసి ఉప ఎన్నిక మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది.
గత ఎన్నికల్లో జగన్ మెజార్టీని తగ్గించిన టీడీపీ
ఇప్పటికే వైసిపి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరితో నామినేషన్ వేయించగా టిడిపి కూడా బీటెక్ రవి కుటుంబం నుంచి ఆయన సతీమణి లతా రెడ్డిని రంగంలోకి దింపింది. పులివెందుల జెడ్పీటీసి ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జిల్లా నేతలతో చర్చించి ఖచ్చితంగా గెలిచి తీరాలని ఆదేశించడంతో టిడిపి పూర్తి స్థాయిలో రాజకీయ హ్యూహాలకు పదును పెడుతోంది. పులివెందుల ఇలాకాలో జగన్ పై పైచేయి సాదించేందు ఇదే అదునుగా బావిస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మెజారిటీని తగ్గించిన టిడిపి ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని బావిస్తోందట. మండల స్థాయిలో జరిగే ఎన్నిక కావడం కేవలం 10 వేల ఓట్లు కావడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని మార్గాలను వాడుకుంటున్నారట.
వైఎస్ వివేకాపై ఎమ్మె్ల్సీగా గెలిచిన బీటెక్ రవి
2017 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి.. వైయస్ వివేకానందరెడ్డిపై గెలిచి వైఎస్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు. 2022 లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్ఢి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన గెలుపులో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు అదే ఫార్ములా ను అనుసరిస్తోంది టీడీపీ. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్న బీటెక్ రవి వ్యూహరచనలో దిట్టగా పేరు పొందారు. ఇప్పుడు ఆయన సతీమణి లతారెడ్డి పులివెందుల జడ్పీటీసీగా నామినేషన్ వేయడంతో అక్కడ ఉపఎన్నిక అత్యంత ఆసక్తికరంగా తయారైంది. ఇప్పటికే తెలుగుదేశం నేతలు ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతి కుటుంబాన్ని కలుస్తూ.. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
Also Read: జగన్ -పెద్దిరెడ్డి అవినావ బంధం
వైసిపి అధికారం లో ఉన్నప్పుడు కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి పక్కా వ్యహంతో టిడిపిని దెబ్బ కొట్టింది. ఇప్పుడు టిడిపి కూడా పులివెందుల లో అదే ఫార్ములా అమలు చేసి వైసిపి సొంత ఇలాకాలో చావు దెబ్బ కొట్టాలని పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోందంట. కుప్పంలో గెలిచాం అని జబ్బలు చరుచుకున్న వైసిపికి ఇప్పుడు పులివెందుల లో టిడిపి సత్తా ఏంటో రుచి చూపించాలని బీటెక్ రవి తన సతీమణిని రంగంలోకి దించారని ప్రచారం సాగుతోంది. పులివెందుల లో బీటెక్ రవి టిడిపి కీలక నేత కావడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. పైగా పులివెందుల మండలానికి చెందిన వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరిని తమ వైపు తిప్పుకోవడంలో టీడీపీ సక్సెస్ అవుతోంది.
పులివెందులలో మకాం వేసిన ఆదినారాయణరెడ్డి
మరోవైపు పులివెందుల పక్కనే ఉన్న జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గత కొన్ని రోజులుగా పులివెందులలోనే మకాం వేశారు. పులివెందుల నుంచి రాయలసీమ పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయంలో ఆదినారాణయణరెడ్డి, బీటెక్ రవిలు సమర్ధవంతమైన పాత్ర పోషించారు. ఇప్పుడా ముగ్గురు పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడానికి సమష్టిగా కృషి చేస్తుండటంతో వైసీపీ శ్రేణులకు చుక్కలు కనపడుతున్నాయంట. ఈ స్థానాన్ని టిడిపి కైవసం చేసుకుంటే రాబోయే 2029 ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పదు అంటున్నారు. మరి జగన్ అడ్డాలో ఆయనకు టీడీపీ ఏ రేంజ్లో షాక్ ఇస్తుందో చూడాలి.
Story By Rami Reddy, Bigtv