AP News: ఏ పార్టీలో ఉన్నా తనదే ఆధిపత్యం కనసాగాలని రాయలసీమ నేతమాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదిపేవారన్న విమర్శలున్నాయి. చంద్రబాబు, వైఎస్‌ల సమకాలీకుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పెద్దిరెడ్డి.. ముగ్గురూ కలిసి రాజకీయ జీవితం ప్రారంభించినప్పటికీ పెద్దిరెడ్డి మాత్రం డామినేషన్ కొనసాగించాలని చూశారంటారు. అందుకే ఆయన ఆ ఇద్దరికీ రాజకీయంగా బద్ద శత్రువులుగా మారారు. వైఎస్‌తో అంత గ్యాప్ పెట్టుకున్న పెద్దిరెడ్డి తర్వాత జగన్‌ను మచ్చిక చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో లైమ్ లైట్‌లోకి వచ్చారంట. ప్రస్తుత రాజకీయాల్లో పెద్దిరెడ్డి ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో?.. జగన్‌కు ఆయన ఎంత సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు పెద్దిరెడ్డికి, జగన్‌కి లింకు ఎలా కుదిరింది?
కిందపడ్డా మాదే పైచేయి అన్నట్లు వ్యవహరించే పొలిటీషియన్లు
రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కిందపడ్డా మాదే పైచేయి అన్నట్లు వ్యవహరించే పొలిటీషీయన్లు… తమ మనుగడ కోసం ఎంత దూరమైనా వెళ్తారన్న దానికి రాయలసీమలోని చిత్తూరు జిల్లా వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ప్రత్యక్ష ఉదాహరణని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . రాజకీయాల్లో కురు వృద్ధుడైన పెద్దిరెడ్డి 1974 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1978 లో జనతా పార్టీ అభ్యర్థిగా, 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పీలేరులో ఓడిన పెద్దిరెడ్డి
తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1989, 1999, 2004 లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. 2009 లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన 2013లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరి 2014 , 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2019లో జగన్ మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టారు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది.
పెద్దిరెడ్డితో ఉప్పనిప్పులా మెసిలిన వైఎస్
అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానమే విభిన్నంగా సాగుతూ వచ్చింది. దానికి ఉదాహరణే వైఎస్ రాజశేఖర్ రెడ్డి – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- వైఎస్ జగన్ ల రాజకీయ బంధం.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఉప్పు-నిప్పు లాగా ఉండేవారు. రాష్ట్ర రాజకీయాల్లో రామచంద్రారెడ్డి ఆయనకు తొలినుండి వ్యతిరేకంగా ఉన్నారు.. చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు లు వైఎస్ వర్గానికి మద్దతుగా నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా తొలుత వైఎస్ కు వ్యతిరేకంగానే పనిచేశారు.
జడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎంలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట విజయభాస్కర్ రెడ్డిల హవా తగ్గాక కిరణ్ వర్గం కూడా వైఎస్ తో కలిసిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం 2009 వరకు వైఎస్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. 2001 జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక విషయంలో వైఎస్ వర్గానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి బీసీ వర్గానికి చెందిన బంగారు పాళ్యం జడ్పీటీసీ రెడ్డెమ్మను చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ చేశారు. అప్పుడు పెద్ద తతంగాన్ని నడిపారు. ఇరువర్గాలకు సయోధ్య కుదర్చడంలో పీసీసీ అధ్యక్షుడు ఎం . సత్యనారాయణ కొంతమేరకు వైఎస్ ను ఒప్పించారు. రాజశేఖరరెడ్డి రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
పోటీగా కుప్పం నుంచి పాదయాత్ర చేసిన పెద్దిరెడ్డి
కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఆ కార్యక్రమానికి హాజరకాకపోగా కుప్పం నుంచి సత్యవేడు వరకు పోటీగా పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు ఎం.వి. మైసూరారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి హాజరై ప్రారంభించారు . అటువంటిది ఆతరువాత ఏం జరిగిందో కాని వైఎస్ తనయుడు జగన్‌కు పెద్దిరెడ్డి ఆప్తుడిగా మారారు.. 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. కాని జిల్లా నుంచి పెద్దిరెడ్డి కి మాత్రం మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు.. అధిష్ఠానం పెద్దలు జోక్యం చేసుకున్నా వైఎస్ అంగీకరించలేదు.. తిరిగి 2009 నాటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాత్మకంగా బెంగళూరు లో ఉంటున్న జగన్‌కి తన కుమారుడు మిథున్ రెడ్డిని దగ్గర చేశారు.
Also Read: అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్! అసలు లెక్కలేంటి?
జగన్‌తో విపరీతమైన సాన్నిహిత్యం పెంచుకున్న పెద్దిరెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో వైఎస్ తన మంత్రివర్గంలోకి పెద్దిరెడ్డిని తీసుకున్నారన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంది. అప్పటి నుండి పెద్దిరెడ్డి కుటుంబం జగన్ తో విడదీయలేని బంధం ఏర్పడిందంట. జగన్ సీఎం అయ్యాక క్యాబినెట్ లో పెద్దిరెడ్డి నంబర్-2 పొజిషన్ ను దక్కించుకున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి తో విభేదించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తరువాత జగన్‌కు అత్యంత ఆప్తుడిగా మారిపోయాయి.. ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో నానా కేసులు ఎదుర్కొవాల్సి వస్తుంది. మొత్తానికి పాలిటిక్స్‌లో దరిద్రం, అదృష్టాలకు ప్రతీక పెద్దిరెడ్డే అని చెప్పుకోవచ్చేమో?
Story By Rami Reddy, Bigtv