ఏళ్లకు ఏళ్లుగా పాతుకుపోయారు. పార్టీని ఎదగనీయరు. అధికారంలోకి రానీయరు. కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయరు. అధికారంలో ఎవరుంటే వారితో లాలూచీ పడతారు. ఇదే తీరు కొనసాగుతోంది తెలంగాణ బీజేపీ సీనియర్లది. వారికే అధిష్టానం ఎప్పుడూ ఉన్నత పదవులు కట్టబెట్టినా ఆ ఒక్కరు, ఆ వర్గం మాత్రం కొంత బెనిఫిట్ పొందినా.. పార్టీకి మాత్రం నయాపైస లాభం లేకుండా పోతోంది.
ఈసారి కచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనే వ్యూహంతో ఢిల్లీ పెద్దలున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేననే విధంగా పొలిటికల్ వాతావరణాన్ని మార్చడమే తమ నైతిక విజయంగా భావిస్తోంది. కిషన్‌రెడ్డి, కే లక్ష్మణ్.. ఈ ఇద్దరే పార్టీలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలున్నాయి. పార్టీలో హార్డ్‌కోర్ కార్యకర్త, లీడర్‌ను ఎవరిని అడిగినా ఇదే ముచ్చట చెబుతారు.
అయితే వీరిని ఏమనలేరు.. వీరిని కాదని కొత్తతరం ముందుకు పోలేదు. అంతిమంగా పార్టీ ఎదిగే వాతావరణమే కనిపించడం లేదు ఢిల్లీ పెద్దలకు. అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా.. వీరి గుత్తాధిపత్యానికి పరోక్షంగా చెక్ పెట్టడంతో పాటు పార్టీని అధికారం దిశగా తీసుకుపోయేందుకు రంగంలోకి తన టీమ్‌ను దింపింది ఢిల్లీ అధిష్టానం.
సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్‌లకు పూర్తి ఇంచార్జి బాధ్యతలు ఇచ్చి రంగంలోకి దింపింది. ఈ పరిణామాలు ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. మిషన్ తెలంగాణ పేరుతో ఢిల్లీ పార్టీ.. తెలంగాణ పార్టీని మొత్తం టేకోవర్ చేసేసిందనే ప్రచారం ఉంది కాషాయ పార్టీలో. ఎన్నికల వ్యూహాలు రచించి.. పార్టీని అధికారంలోకి తేవడంలో మాస్టర్ మైండ్‌గా పేరున్న సునీల్ బన్సాల్… తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జనాల్లో నిలిపేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారని చెబుతున్నారు.
ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ సత్తా చాటాలని చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీపై పట్టు బిగించింది. ఇక్కడ్నుంచి పార్టీ అధ్యక్షుడు రాంచంద్రరావును బరిలోకి దింపాలని యోచిస్తోంది. గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో పాటు గ్రేటర్ పరిధిలో బీజేపీకి పట్టుంది.
బీఆర్ఎస్ దీన్ని సెమీ ఫైనల్ అని ప్రకటించిన నేపథ్యంలో.. తాము రెండింటిలో ఒక్క స్థానమైనా దక్కించుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీగా నిలవనున్నామనే సంకేతాలను ఇవ్వాలనుకుంటున్నది. ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ లాంటి కీలక, సీనియర్ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీ బలోపేతంలో ఎవరిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటడం ద్వారా.. అసెంబ్లీకి దీన్ని ట్రయల్ రన్‌గా తీసుకుని .. ప్రధాన ప్రతిపక్షం.. ప్రత్యామ్నాయం మేమే అనే విధంగా ఎదగాలనేది ఆ ‘మాస్టర్ మైండ్’ యోచనగా కనబడుతోంది. అయితే ఇప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగేలా లేవు. జీహెచ్ఎంసీని ముట్టుకోవడానికి కూడా సర్కార్ భయపడుతోంది. అందుకే ప్రస్తుతం ముందున్న గ్రాడ్యుయేట్లో సత్తా చాటితే.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పాత్రేమిటో జనాలకు తెలియజెప్పే వేదికగా ఇదేనని బీజేపీ భావిస్తోంది.