కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో భాగంగా రెండు రోజుల క్రితమే హైకమాండ్ తెలంగాణకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను నియమించింది. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ కు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇచ్చారు. త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు ఆమె రెడీ అయ్యారు. వచ్చే వారంలోనే ఆమె గాంధీభవన్ లో బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే కొత్త ఇన్ చార్జీకు పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉండటంతో.. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం ఏఐసీసీ ఇన్‌చార్జీ మరింత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుందంటున్నారు.
ఆ క్రమంలో మీనాక్షి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఏఐసీసీ స్థాయిలో పనిచేసిన ఆమె, స్టేట్ ఇన్చార్జి స్థాయిలో ఏం చేయబోతున్నారు? రాహుల్ కోటరీలో కీలక వ్యక్తిగా పేరొందిన మీనాక్షి పార్టీ బలోపేతానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు? గ్రౌండ్ లెవల్ కేడర్‌లో భరోసా నింపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వంటి అంశాలపై ఇప్పుడు పార్టీలో పుల్ డిస్కషన్ నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలక్షన్ అబ్జర్వర్ గా వచ్చిన ఆమె పుల్ స్ట్రిక్ట్ గా ఉంటారని గతంలో దగ్గర నుంచి పరిశీలించిన నేతలు చెప్తుండటంతో .. లీడర్లు, పార్టీ కార్యవర్గ నేతల్లో టెన్షన్ మొదలైందంట.
తెలంగాణపై స్పష్టమైన అవగాహన కలిగిన మీనాక్షి..రాష్ట్ర రాజకీయాలను ఎలా నడిపిస్తారో? అన్న టెన్షన్ పలువురు నేతల్లో కనిపిస్తోంది. ఆమె ఇన్ చార్జ్ గా వస్తున్నట్లు ప్రకటన రిలీజ్ కాగానే, మేడం పనితీరు ఎలా ఉంటుంది..? కేడర్‌కు గుర్తింపు ఇస్తారా? లీడర్లతో అప్రోచ్ ఎలా ఉంటుంది? వంటి వాటిపై కొందరు రాష్ట్ర నాయకులు తమకున్న పరిచయాలతో ఢిల్లీ లెవల్‌లో ఇన్ఫ్మర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించారంట.
మీనాక్షి ముందున్న ప్రధాన సవాలు పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం.. దీంతో పాటు లీడర్లు, కేడర్ పటిష్టత కూడా ముఖ్యమే. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి కేడర్ మధ్య కొన్ని చోట్ల సమన్వయం లేదన్న అభిప్రాయం ఉంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందంటున్నారు. దాని ప్రభావం క్షేత్రస్థాయి కేడర్ పై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను సమర్ధవంతంగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు గ్రౌండ్ లెవర్ లీడర్లు ఆసక్తి చూపడం లేదంటున్నారు.
ఇంత కాలం ఏఐసీసీ ఇన్ చార్జీగా పనిచేసిన దీపాదాస్ మున్షి దృష్టికి కొన్ని జిల్లాల లీడర్లు గతంలోనే ఈ సమస్యను తీసుకువెళ్లారంట. కానీ ఆమె పెద్దగా స్పందించలేదని స్వయంగా జిల్లా అధ్యక్షులే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో యాక్టివ్ రోల్ పోషించిన ఆమె.. జిల్లా వ్యవహారాలపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదన్న వాదన వినిపిస్తుంది. పార్టీ లోని అందరి అభిప్రాయాలను సేకరించేందుకు దీపాదాస్‌మున్షీ ఆసక్తి చూపలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దాంతో కొత్త ఇన్చార్జ్‌గా రానున్న మీనాక్షిపై గురుతర బాధ్యతలు ఉన్నాయంటున్నారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కీలక నేతలు మినహా వివిధ స్థాయిల నాయకుు ఫెయిలయ్యారన్న టాక్ ఉంది. సోషల్ మీడియా దారుణంగా విఫలమైందని .. ఇక ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్ లు, చేస్తున్న కార్యక్రమాలను కూడా పార్టీ నాయకులు జనాల్లోకి బలంగా తీసుకువెళ్లలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. తద్వారా ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టాయి విపక్షాలు. మెజార్టీ జిల్లాల్లో నేతల మధ్య ఇంటర్నల్ ఫైట్‌లు ఉన్నాయి. వీటన్నింటిని సెట్‌రైట్ చేయాల్సిన బాధ్యత నూతన ఇన్చార్జ్‌పై ఉంది.
Also Read: పాలకుర్తిలో వలసల పాలిటిక్స్
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల రానున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీజేపీ దూకుడును అడ్డుకోవడం, బీఆర్ఎస్‌ను మరింత నిర్వీర్యం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టడం కాంగ్రెస్ ముందున్న ప్రధాన టార్గెట్. వాటన్నింటిపై మీనాక్షి నటరాజన్ స్పెషల్ ఫోకస్ పెడితే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నా .. నామినేటెడ్, పార్టీ పదవులు పంపకం పూర్తిస్థాయిలో జరగలేదు. దానిపై లీడర్లు, కేడర్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతుంది.
పార్టీని పవర్ లోకి తీసుకువచ్చేందుకు పనిచేసిన తమకు ఇటు ప్రభుత్వం, అటు పార్టీలోనూ తగిన గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? అని పలువురు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు… భుజాలకు కాయలు కాసేలా జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోలేదని చాలా మంది అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్న వంటి వారు సొంత పార్టీనే టార్గెట్ చేస్తున్నా చర్యలు తీసుకోకపోతుండటం పార్టీలో అసంతృప్తికి కారణమవుతుంది
13 సెప్టెంబరు 2020 నుంచి జనవరి 2023 వరకు మాణిక్యం ఠాగూర్ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా పనిచేశారు. ఆ తర్వాత 4 జనవరి 2023 నుంచి 24 డిసెంబరు 2023 వరకు మాణిక్ రావు ఠాక్రే ఇన్ చార్జీగా పనిచేశారు. ఈ పీరియడ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక 24 డిసెంబరు 2024 నుంచి 14 ఫిబ్రవరి 2025 వరకు దీపాదాస్ మున్షి ఏఐసీసీ ఇన్చార్జ్‌గా పనిచేశారుచేశారు. త్వరలో రాహుల్‌గాంధీ పర్సనల్ కోటరీలోని మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్‌గా బాధ్యతలు చేపట్టన్నారు. అధికారం చేపట్టిన పదిహేను నెలలకే ఇద్దరు ఇన్ చార్జీలను మార్చిన హైకమాండ్ , కొత్త నాయకురాలిని రంగంలోకి దించుతోంది. దాంతో తెలంగాణపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కనబరుస్తున్న ప్రత్యేక శ్రధ్ధ అర్థమవుతుంది.