Ganta Srinivas vs Bharath: ఉత్తరాంధ్రలో విశాఖ లోక్‌సభ సెగ్మెంట్ వర్సెస్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గాల మధ్యవార్ మొదలైంది… ఈ రెండు చోట్ల బడా పొలిటిషియన్స్ రాజకీయాన్ని ఆసక్తికరంగా నడుపుతున్నారు… … విశాఖ ఎంపీ భరత్, భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌లకు డబ్బుకు కొదవ లేదు. పరపతిని ప్రశ్నించేవారు లేరు…. మనసులో అనుకుంటే చాలు ఏదైనా చేయగల సమర్థులు…. రాజకీయ పార్టీల బలం ఉంది… పార్టీల్లో కావలసిన బలగం ఉంది…. చెప్పిన పని క్షణాల్లో చేసే అనుచర గణం ఉంది… ఇన్ని ఉన్న ఆ ఇద్దరు పొలిటిషన్ల మధ్య రాజకీయం రచ్చ నడుస్తుంది… పైకి నవ్వుకుంటూనే కడుపులో కత్తులు దూస్తున్నారంట… నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అంటూ మనసులో మాటలను బహిరంగంగానే బయటపెట్టేస్తున్నారు…అసలు వారిద్దరి మధ్య ఆధిపత్యపోరుకు కారణమేంటి?
విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం భీమిలి… భీమిలి నియోజకవర్గం పర్యాటక ప్రాంతంగానే కాదు ఏపీ ఐటి హబ్ సెంటర్‌గా కూడా మారిపోతుంది…. అధికారంలో ఏ పార్టీ ఉన్న ఐటీ డెవలప్మెంట్ విషయంలో విశాఖ వైపే మొగ్గు చూపడంతో ఇప్పుడు అందరి చూపు విశాఖలోని భీమిలి నియోజకవర్గం మీదే పడుతోంది… 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత భీమిలి నియోజకవర్గంలోని రిషికొండ ఐఐటి హిల్స్ ప్రాంతం మొత్తాన్ని ఐటి సెక్టార్ కోసం డెవలప్ చేశారు. వైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొద్దో గొప్పో ఐటీ పరిశ్రమల స్థాపన చేస్తూ వచ్చాయి. 2014లో సీఎం చంద్రబాబు, 2019లో అప్పటి సీఎం జగన్ విశాఖ ఐటీ హిల్స్ ను డెవలప్ చేసి కీలకమైన ఐటీ కంపెనీలు వచ్చేలాగా ప్రయత్నం చేశారు. రెండు దశాబ్దాల కాలంలో రిషికొండ ఐటి హిల్స్ పై ఎన్నో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆ క్రమంలో విశాఖ అభివృద్ధిలో భీమిలి నియోజకవర్గం కీలకంగా మారిపోయింది
భీమిలి నియోజకవర్గం వర్గానికి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఇదే నియోజకవర్గ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు… భీమిలి నియోజకవర్గంపై గంటా శ్రీనివాసరావుకు గట్టి పట్టు ఉంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజారిటీ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో గంటా రెండో వ్యక్తి. అలాంటి బలమైన గంటా శ్రీనివాస్ కు ఇప్పుడు విశాఖ ఎంపీ భరత్ రూపంలో తలనొప్పి మొదలైనట్లు కనిపిస్తుంది. ఆ లెక్కలతో గంటా శ్రీనివాసరావు తన మనసులో మాటను చెప్పకనే చెప్తూ ఎంపీ భరత్ కు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు నాయకుల ఫోకస్ విశాఖ నగరంపైన ఐటీ హబ్ గా డెవలప్ అవుతున్న భీమిలి నియోజకవర్గం పైన పడినట్లు తెలుస్తోంది…
భీమిలి నియోజకవర్గంలో ఐటీ సెక్టార్ డెవలప్మెంట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, భూముల గుర్తింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవప్మెంట్, ఐటీ కంపెనీల శంకుస్థాపనలు ఇలా ప్రతి నెల ఏదో ఒకటి జరుగుతుండడంతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కు, విశాఖ ఎంపీ భరత్ కు మధ్య రాజకీయ రచ్చ మొదలైనట్లు కనిపిస్తుంది. భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై ముఖ్యంగా ఐటీ సెక్టార్ కు సంబంధించి సంస్థల ఏర్పాటులో తన మార్క్ చూపించేలా ఎంపీ భరత్ పనిచేస్తూ దూసుకుపోతున్నారు. భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న ఐటీ డెవలప్మెంట్ మొత్తం కేంద్రంతో మాట్లాడి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనతో తన విజయంగా ఎంపీ భరత్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చర్చ నడుస్తోంది… దీంతో ఇద్దరు నాయకులు కడుపులో కత్తులు దూసుకుంటూ, పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారంట.
గడిచిన 18 నెలలుగా భీమిలి నియోజకవర్గంలోనే ఐటీ పరిశ్రమకు సంబంధించి అనేక కంపెనీల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగడంతో పాటు, కీలకమైన గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల తర్వాత విశాఖ ఎంపీ భరత్ తన మార్కును చూపించడానికి ప్రతి కార్యక్రమంలోనూ తానే ముందుండి నడిపిస్తున్నారు… భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాధాన్యత దక్కుతుంది కానీ, క్రెడిట్ మొత్తం ఎంపీ భరత్ ఖాతాలోకే వెళ్లి పోతుండడంతో గంటా శ్రీనివాసరావు కుతకుతలాడిపోున్నారంట.
విశాఖ ఎంపీ భరత్ స్వయంగానందమూరి బాలకృష్ణకు చిన్న అల్లుడు. ఆయన సీఎం చంద్రబాబు సొంత బంధువు కావడం, మంత్రి నారా లోకేష్ స్వయానా తోడల్లుడు కావడంతో విశాఖ జిల్లాకు అనధికారిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు… రాష్ట్రంలో అన్ని జిల్లాలకు దాదాపు మంత్రి పదవులు ఉన్నా ఏపీ ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖకు మాత్రం మంత్రి పదవి లేకపోవడం వెనక ఎంపీ భరత్ కారణం అనే ప్రచారం కూడా ఉంది… విశాఖ నగరానికి ఎంపీ భరత్ కీలకమైన వ్యక్తిగా వ్యవహరించాలనే ఆలోచనతో విశాఖ జిల్లాకు టీడీనీ మంత్రి లేకుండా చేసిందని ఒక వర్గం అంటుంది… మరోపక్క మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా కూటమి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. చంద్రబాబుకి అత్యంత నమ్మకమైన మంత్రి నారాయణకు గంటా వియ్యంకుడు. ఆ క్రమంలో గంటా శ్రీనివాసరావు కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం ఉంది. దానికి తోడు గంట శ్రీనివాస్ కూడా గత 25 ఏళ్లుగా విశాఖ రాజకీయాల్లో తనకంటూ ఓ మార్క్ ని సెట్ చేసుకుని సీనియర్ గా చలామణి అవుతున్నారు. దీంతో సీనియర్ జూనియర్ అనే రాజకీయ చర్చ కూడా నడుస్తోంది.
భీమిలి నియోజకవర్గానికి ఐటీ రూపంలో అధిక ప్రాధాన్యత పెరగడం, ఎంపీ భరత్ తన లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలలో భీమిలికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుండటంతో 2029 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి ఎంపీ భరత్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది… భీమిలి ఎమ్మెల్యేగా ప్రస్తుత విశాఖ ఎంపీ భారత్ పోటీ చేస్తే తాను భీమిలి నియోజకవర్గాన్ని ఆయనకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తూనే గంటా శ్రీనివాస్ తనకు విశాఖ ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉందని మనసులో మాటను బయటపెట్టారు… దీంతో ఇద్దరు నాయకుల మధ్య ఉన్న కనిపించని విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి… భీమిలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తన నియోజకవర్గంపై ఎంపీ భరత్ ఆధిపత్యాన్ని అంగీకరించలేని గంటా శ్రీనివాస్ విశాఖ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు కనిపిస్తుంది.
దీనికి తోడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమిలీ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది… దీంతో ఒక స్థానం నుండి తన రాజకీయ వారసుడిగా కొడుకు రవితేజను బరిలోకి దింపి విశాఖ ఎంపీగా గంటా శ్రీనివాస బరిలో దిగాలనే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది… ఇప్పటికీ రాజకీయంగా గంటా శ్రీనివాస్ ఓటమిలేని నాయకుడిగా పేరు ఉండడంతో విశాఖ ఎంపీగా పోటీ చేసినా తనకి ఓటమి ఉండదనే భావంలో గంటా శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది…. అందుకు తగ్గట్లే భీమిలి నియోజకవర్గంలో అధికార వ్యవహారాలు అన్ని గంట శ్రీనివాస్ కొడుకు రవితేజ చూస్తుండటంతో పాటు గంటా కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజనలో భీమిలి నియోజకవర్గం రెండుగా విభజించినా తమకు ఓటమి ఉండదని గంట భావిస్తుండడంతో విశాఖ ఎంపీ భరత్‌కు చెక్ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
విశాఖ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం, మంత్రి పదవి ఆశించిన గాజువాక ఎమ్మెల్యే అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో, జిల్లాలో ఉన్న సీనియర్ నాయకుడిగా గంటా శ్రీనివాస్ మంత్రి పదవి ఆశిస్తున్నారు… విశాఖ ఎంపీగా భారత్ కొనసాగుతున్నంతకాలం టిడిపి ప్రభుత్వంలో తనకి మంత్రి పదవి వచ్చే అవకాశం లేకపోవడంతో కొడుకును ఎమ్మెల్యే చేసి, తాను ఎంపీగా బరిలోకి దిగడానికి గంటా స్కెచ్ గీస్తున్నారంట. .. భరత్ కూడా పైకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని చెప్తున్నా., ఒకపక్క తోడల్లుడు నారా లోకేష్ మంత్రిగా వ్యవహారాలు చక్కబెడుతూ రాష్ట్రమంతా తిరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా అత్యంత కీలకమైన భీమిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారం చేపడితే మంత్రి పదవి చేపట్టొచ్చు అని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా విశాఖ ఎంపీ భరత్ భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావులు పైకి కనిపించకుండా రాజకీయ చదరంగంలో ఎవరు ఆట వాళ్ళు ఆడుతూ పైకి మాత్రం అందరూ కలిసి ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది…. ఇద్దరు నాయకుల లెక్కలు ఎలా ఉన్నా టిడిపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలుగు తమ్ముళ్లలో తెగ ఉత్కంఠ పెంచేస్తోందంట.
Story By Ramireddy , Big Tv