BigTV English

West Bengal: రాజకీయ సంక్షోభం దిశగా పశ్చిమ బెంగాల్..!

West Bengal: రాజకీయ సంక్షోభం దిశగా పశ్చిమ బెంగాల్..!

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ నెల 9న ఒక యువ మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై 22 రోజుల తర్వాత కూడా రాష్ట్రమంతా జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలతో అట్టుడుకుతోంది. కోల్‌కతా ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ ఆవరణలోనే ఈ ఘటన జరగటం, ఈ దారుణంలో పలువురి భాగస్వామ్యం ఉందని తేలటం, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ వ్యక్తులు ఆసుపత్రి మీద దాడి చేశారని సీసీ కెమెరాలలో కనిపించటం, ఘటనను దాచిపెట్టేందుకు ఆసుపత్రి వర్గాలు చెప్పిన మాటలు కాల్‌ రికార్డింగులతో అబద్ధాలని తేలటం, కాలేజీకి ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తి మానవ అక్రమ రవాణాకూ, బలవంతపు వసూళ్ళకూ పాల్పడినట్టు ఆయన మాజీ సహచరులే ఆరోపించటంతో డాక్టర్లు, విద్యార్థులకు తోడు సామాన్య ప్రజలు నిరసనల్లో పాల్గొనటం మొదలైంది. ఘటనలో అనుమానితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను కేవలం పావుగా చూపి అసలైన నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు, ఈ హత్యాచారం ఘటన వెనుక మెడిసిన్ మాఫియా హస్తం ఉందనే ప్రచారం, ప్రభుత్వంలోని పెద్దల హస్తం కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలు, ప్రభుత్వం నిరంకుశ ధోరణి పరిస్థితిని దిగజార్చాయి. మరోవైపు.. 22 రోజులుగా డాక్టర్లు చేస్తున్న ఆందోళనను అణిచివేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలలోని కర్కశత్వం నిరసనలను మరింత తీవ్రం చేసింది. అంతిమంగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందేనంటూ ‘పశ్చిమ బంగా ఛాత్రో సమాజ్’ గత మంగళవారం చేపట్టిన ‘నబన్నా అభియాన్’ ర్యాలీ, శుక్రవారం బీజేపీ నిర్వహించిన 12 గంటల బంద్ సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.


ఆందోళన జరుపుతున్న డాక్టర్లంతా వెంటనే విధుల్లో చేరాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇప్పటికే అనుమతినిచ్చిందని ముఖ్యమంత్రి మమత హెచ్చరించారు. ‘నేను చర్యలు తీసుకోవాలనుకోవడం లేదు. కానీ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తే మీ భవిష్యత్‌ నాశనమవుతుంది. పాస్‌పోర్టులు లేదా వీసాలు రావు, చట్టపరంగా చర్యలు తీసుకుంటే జీవితాలు ధ్వంసమవుతాయి’ అని ఆమె నిరసనలకు పాల్పడుతున్న విధ్యార్థులను, జూనియర్ డాక్టర్లను హెచ్చరించటంపై సర్వత్రా ఖండనలు, విమర్శలు వెల్లువెత్తాయి. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తన అసంతృప్తిని ఈ రకంగా ప్రదర్శించారని అర్థమవుతోంది. మరోవైపు, రేపిస్ట్‌లకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతి బ్లాక్‌లోనూ టీఎంసీ కార్యకర్తలు గట్టిగా ప్రదర్శనలు నిర్వహించాలని ఆమె తన పార్టీ నేతలకు పిలుపునివ్వటం ఆమె అపరిపక్వతను తెలియజేసింది. హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంటే ఇటువంటి పరిస్థితుల్లో స్వయంగా ముఖ్యమంత్రే హింసను రెచ్చగొట్టటం చూసి సుప్రీంకోర్టు రంగంలోకి దిగి అక్షింతలు వేయాల్సి వచ్చింది. ఘటన జరిగిన ఆసుపత్రికి భద్రతగా సీఐఎస్‌ఎఫ్‌ దళాల పహారా పెట్టాల్సి రావడాన్ని బట్టి అక్కడి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందనే సూచనలు కనిపిస్తున్నాయి.

హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవడం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది. విధినిర్వహణలోని వైద్యశిక్షణార్థి జీవితాన్ని చిదిమేసిన ఈ ఉదంతంతో వైద్యుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎన్‌టీఎఫ్‌)ను సుప్రీంకోర్టు గత మంగళవారం ఏర్పాటు చేసింది. ప్రముఖ డాక్టర్ల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్‌ మహిళలు సురక్షితంగా పని చేసేందుకు చేపట్టాల్సిన సమూల సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది. కోర్ట్‌ ఆదేశించినట్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో పరోక్షంగా బెంగాల్‌ అత్యాచార ఘటనను ప్రస్తావించారు. అసాధారణరీతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటనపై స్పందించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్‌ను కలిసి రాష్ర్టాన్ని, ప్రజల హక్కులను కాపాడేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రిని కలిశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘గవర్నర్‌గా అన్నీ చూస్తున్నా. నా నిర్ణయాలు ప్రజల్లో చెప్పడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు, అసాధారణంగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ వరుస పరిణామాలు పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారనే అనుమానాలను కలిగిస్తు్న్నాయి.


Also Read: Harish Rao: ఎస్డీఎఫ్ నిధులు, పనులు నిలిపివేయడం దుర్మార్గం: హరీశ్ రావు

ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాదిగా అక్కడి జరిగిన పలు ఘటనలను ఆయన గుర్తుచేస్తున్నారు. దీనికి పోటీగా, బెంగాల్‌ తగలబడితే ఢిల్లీ సహా పలు రాష్ర్టాలు తగలబడతాయన్న సీఎం మమత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే సీఎంను ఆర్టికల్ 356 ఉపయోగించి తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మమత వ్యాఖ్యలపై ఇప్పటికే బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి ఫిర్యాదు చేశారు. కోల్‌కతా ఘటన, తదనంతర చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబుకుతుంటే… పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి అంతా విమర్శకుల నోళ్ళు మూయించడంపై పెట్టటమూ పరిస్ధితి ఇంతగా దిగజారటానికి కారణమైందని చెప్పకతప్పదు. నిరసనకారులపై ‘రాజ్యాధికారం’ ప్రయోగించే కన్నా దేశవ్యాప్తంగా లోలోపలి భావోద్వేగాలు బయటపడుతున్న వేళ.. వారితో మరింత సున్నితంగా వ్యవహరించాలని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం హితవు చెప్పాల్సి వచ్చింది. ఘటన తర్వాత రాష్ట్ర గవర్నర్‌ హుటాహుటిన అత్యాచారం జరిగిన మెడికల్‌ కాలేజీకి వెళ్లటం, బీజేపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తీరును చూస్తే సమస్యపై సానుభూతి కన్నా రాజకీయ ఆయుధం దొరికిందనే ఉత్సాహమే వారిలో కనిపిస్తున్నది. ఇక, ఈ కేసులో అటు సీబీఐ దర్యాప్తు, ఇటు సుప్రీమ్‌ చొరవతో కేసులో ఇంకెన్ని లోతైన అంశాలు బయటపెడతాయో తెలీదు. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.

2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో ఒక బస్సులో వైద్య విద్యార్థినిని ఆరుగురు ఇనుప కడ్డీతో దారుణంగా కొట్టి అత్యాచారం చేశారు. 13 రోజుల చికిత్స తర్వాత ఆమె మరణించారు. ఈ ఘటనను నిరసిస్తూ దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ఉద్యమించారు. ఈ ఉద్యమంతో పాటు అన్నా హజారే జరిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఢిల్లీలో కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేశాయి. ఈ ఉద్యమాలు ఢిల్లీలో కేజ్రీవాల్‌కు దోహదపడగా, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో బీజేపీకి పరోక్షంగా మేలు చేశాయి. అయితే, ఆ తర్వాత కూడా దేశంలో మహిళల మీద ఆగడాలు కొనసాగుతూనే వచ్చినా, రాష్ట్రాల పరిధిలోనే ఉండిపోయాయి. గత పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ.. గతంలో కంటే ప్రస్తుతం అత్యాచారాలు మరింతగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2012 ఢిల్లీ ఉదంతం తర్వాత అత్యాచారాలు పెరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదికలు కూడా సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలో 2020లో 28,046, 2019లో 32,033 అత్యాచారం కేసులు నమోదు కాగా, 2021 సంవత్సరం ఈ సంఖ్య 31,677 గా ఉంది. అంటే రోజుకు సగటున 86 అత్యాచారాలు జరిగాయన్న మాట. ఇదిలా ఉండగానే ఆడవాళ్ళు నైట్‌డ్యూటీలలో లేకుండా చూడాలని బెంగాల్‌ సర్కార్, ఒకవేళ డ్యూటీలో ఆడవాళ్ళుంటే వారికి తోడుండేలా చూడాలని కేంద్ర సర్కార్‌ సూచనలివ్వడం విడ్డూరంగా అనిపించింది. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువున్న దేశంలో దాన్ని మరింత తగ్గించే ఇలాంటి సలహాలు.. తిరోగమన ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి. ఈ ఘటన తర్వాతైనా పార్టీలు విమర్శలు చేసుకోవటానికి బదులు మహిళల రక్షణకు ఇంకేమైనా చేయగలమా అని ఆలోచించాల్సిన అవసరముంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×