What Is Dividend Boom: ఒకటీ రెండు కాదు ఏకంగా 40 వేల కోట్ల డివిడెండ్ బూమ్. అంబానీ, అదానీలతో డివిడెండ్ లు పొందిన భారత టైకూన్లు ఎవరు? ఇంతకీ ఏంటీ బూమ్ మ్యాజిక్. దీని ద్వారా ఈ బిలియనీర్లు ఎలాంటి మనీ గేమ్ ఆడుతారు? ఏంటా డివిడెండ్ల ఢమాకా?
కంపెనీ లాభాల్లో కొంత భాగం వాటాదారులకివ్వడమే డివిడెండ్
ఒక కంపెనీ తన లాభాలలో కొంత భాగం తన వాటాదారులకు ఇచ్చేదాన్ని డివిడెండ్ అంటారు. దీన్ని మాములుగా నగదు రూపంలో లేదా అదనపు స్టాక్స్ రూపంలో ఇస్తుంటారు. ఇది కంపెనీ ఎంత లాభాల్లో నడుస్తుందో చెప్పడానికో సూచిక. అలాంటిది 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో.. ఏయే కంపెనీలు భారీ ఎత్తున లాభాల బాట పట్టాయి? ఏయే కంపెనీల యజమానులు పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి భారత కుబేరుల్లో అంబాని, అదానితో సహా శివనాడార్ తదితరులు ఏకంగా 40 వే కోట్ల రూపాయల డివిడెండ్ తో లాభాలు గడించారు. డివిడెండ్ చార్ట్ లో టాప్ ప్లేస్ లో ఎవరున్నారో చూస్తే.. HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ నెంబర్ వన్ గా కనిపిస్తున్నారు. FY25లో ఆయనకు రూ.9,902 కోట్ల డివిడెండ్ ఆదాయం లభించింది. HCL ఒక్కో షేరుకు రూ.60 చొప్పున మొత్తం రూ.16,290 కోట్ల డివిడెండ్ ప్రకటించింది. దీంతో 60.81 శాతం వాటాను కలిగి ఉన్న నాడార్ కుటుంబం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. 37.3 బిలియన్ల నికర విలువతో, భారత్ లోనే మూడో అతి పెద్ద కుబేరుడు, ప్రపంచ సంపన్నుల్లో 50 వ స్థానంలో ఉన్న శివనాడార్ ఈ ఏడాది డివిడెండ్ కింగ్ గా నిలిచారు.
డివిడెండ్ కింగ్ నెం.2 వేదాంత అనిల్ అగర్వాల్
డివిడెండ్ కింగ్ నెంబర్ టూ ఎవరని చూస్తే.. అనిల్ అగర్వాల్ ఆయన వేదాంత సంస్థ నిలుస్తోంది. వేదాంత నుంచి రూ.9,591 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని పొందింది అనిల్ అగర్వాల్ కుటుంబం. కంపెనీ ఈ సంవత్సరానికి మొత్తం రూ.17,009 కోట్ల డివిడెండ్‌లను ప్రకటించింది. అగర్వాల్ కుటుంబం వివిధ అన్‌లిస్టెడ్ సంస్థల ద్వారా వేదాంతలో 56.38 శాతం వాటాను కలిగి ఉంది. దీంతో ఇంత పెద్ద మొత్తంలో ఈ సంస్థ.. లబ్ధి చెందినట్టు చెబుతున్నాయి గణాంకాలు. ఇక విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.4,570 కోట్ల డివిడెండ్‌లను పొందారు. విప్రోలో ప్రేమ్‌జీ కుటుంబం 72.66 శాతం వాటాను కలిగి ఉంది, ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్‌ను ప్రకటించింది విప్రో. దీంతో ఆయన భారీ డివిడెండ్ పొందిన వారిలో థర్డ్ ప్లేస్ లో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ కుటుంబం ఈ ఆర్ధిక సంవత్సరం రూ.7,443 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీలో 50.11 శాతం వాటాను కలిగి ఉంది. దీంతో అంబానీ ఫ్యామిలీకి రూ.3,655 కోట్ల డివిడెండ్ లభించింది. ఒక్కో షేరుకు రూ.5.50 చొప్పున చెల్లించడంతో ఇంత పెద్ద ఎత్తున అంబానీ కుటుంబానికి లబ్ధి చేకూరింది.
ఆస్టర్ హెల్త్ కేర్ ప్రమోటర్ ఎంఏ మూవిస్
మరో ముఖ్యమైన డివిడెండ్ గెయినర్ ఎవరో చూస్తే ఆస్టర్ హెల్త్ కేర్ ప్రమోటర్ ఎంఏ మూపెన్. ఈయన తన కంపెనీ నుంచి రూ.2,469 కోట్లు సంపాదించారు. 41.89 శాతం వాటా కలిగి ఉన్నారు మూపెన్. ఒక్కో షేరుకు రూ.118 డివిడెండ్‌తో, ఆస్టర్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంస్థగా నిలిచింది. ఇన్ఫోసిస్ గ్రూప్‌లో నారాయణ మూర్తి, నందన్ నీలేకని, శిబులాల్, గోపాలకృష్ణన్, దినేష్‌లు కలిసి రూ.2,331 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని పొందారు. ఇన్ఫోసిస్‌లో వీరికి సంయుక్తంగా 14.6 శాతం వాటా ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో.. ఇన్ఫోసిస్ ఒక్కో షేరుకు రూ.43 చొప్పున రూ.17,854 కోట్లు చెల్లించింది. దీన్నిబట్టీ చూస్తే తన వాటాదారులకు పెద్ద ఎత్తున లాభాలను పంచినట్టు తెలుస్తోందీ టెక్ దిగ్గజం.ఎయిర్‌టెల్ సునీల్ భారతీ మిట్టల్, తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.16 చెల్లించడంతో రూ.2,357 కోట్ల డివిడెండ్‌లను ఆర్జించారు. ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా FY25లో రూ.3,839 కోట్ల డివిడెండ్‌లను చెల్లించింది, దీని నుండి ప్రమోటర్ దిలీప్ సంఘ్వీ, అతని కుటుంబం వారి 54.48 శాతం హోల్డింగ్ కారణంగా రూ.2,091 కోట్లు పొందారు.
బజాజ్ కుటుంబానికి రూ.1,645 కోట్ల డివిడెండ్
బజాజ్ కుటుంబం రూ.1,645 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని పొందింది. మొత్తం లాభంలో అత్యధిక శాతం బజాజ్ ఆటో నుంచే లభించింది. ఒక్కో షేరుకు రూ.210 చొప్పున చెల్లించింది బజాజ్. బజాజ్ హోల్డింగ్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ బజాజ్ ఫైనాన్స్ వంటి గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీలు ప్రకటించిన డివిడెండ్‌లను కూడా ఈ కుటుంబం అందుకుంది. గౌతమ్ అదానీ మరియు అతని కుటుంబం గ్రూప్ కంపెనీల నుంచి రూ.1,460 కోట్ల డివిడెండ్‌లను పొందారు, ఇందులో అత్యధిక భాగం రూ.996 కోట్లు అదానీ పోర్ట్స్, SEZల నుంచే లభించాయి. మిగిలినవి అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ మరియు ACC వంటి ఇతర సంస్థల నుంచి వచ్చాయి. ఒక కంపెనీ డివిడెండ్ చెల్లించే స్థాయికి రావడం ఒక ఎత్తు అయితే.. దీని ద్వారా ఆయా వాటాదారులు లబ్ధి పొందడం మరొక ఎత్తు. ఆపై ఈ కంపెనీలో అధిక వాటాలు కలిగిన వారు పొందే లాభాలు ఇంకొక ఎత్తు. అసలీ కంపెనీ యజమానుల జీతాలు ఎలా ఉంటాయి? ఇప్పటి వరకూ అత్యధిక జీత భత్యాలు పొందిన యజమానులెవరు?
గత ఐదేళ్లుగా జీతం తీస్కోని ముఖేష్ అంబానీ
20 వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీకంపెనీ యజమానులు తమ కంపెనీ స్థాయి.. దాని టర్నోవర్.. తద్వారా వచ్చే లాభాలను అనుసరించి జీతాలు తీసుకుంటూ ఉంటారు. చిన్న కంపెనీల యజమానులు తక్కువ జీతాలు తీసుకుంటారు. అయితే పెద్ద పెద్ద కంపెనీల యజమానులు పెద్దపెద్ద జీతాలు తీసుకోవచ్చు. కొన్నిసార్లు వారి కంపెనీల నుంచి వచ్చే ఆదాయంలోంచి డబ్బు తీసుకోవచ్చు.ఇక దేశంలో అతి పెద్ద వ్యాపారవేత్తలు ఎవరంటే.. అంబానీ అదానీల పేర్లే టక్కున గుర్తుకు వస్తాయి. వీరిలో ముఖేష్ అంబానీ అయితే గత ఐదేళ్లుగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ నుంచి జీతం తీస్కోవడం లేదు. ఆయన కోవిడ్ 19 నుంచీ జీతం తీస్కోవడం మానేశారు. 2008 నుంచి 2020 వరకు సంవత్సరానికి ₹15 కోట్లు జీతం తీసుకున్నారు. 2020 నుంచి, ఆయన ఎలాంటి జీతం తీసుకోవడం మానేశారు. అయితే ముఖేష్ అంబానీ సంపద మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ముఖేష్ అంబానీకి రిలయెన్స్ లో వాటాలున్నాయ. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆయన హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ ఆదాయం మరేదో కాదు డివిడెండ్లే.
2025లో రూ.10.41 కోట్ల జీతం తీస్కున్న అదానీ
గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10.41 కోట్ల జీతం తీసుకున్నారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 12% ఎక్కువ. భారతదేశంలోని ఇతర కంపెనీ యజమానుల జీతాలకన్నా కూడా అదానీ జీతం తక్కువ. ఎయిర్ టెల్ ప్రమోటర్ సునీల్ భారతి మిట్టల్ 2023-24లో రూ. 32.27 కోట్లు తీసుకోగా, రాజీవ్ బజాజ్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 53.75 కోట్లు తీసుకున్నారు, పవన్ ముంజాల్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 109 కోట్లు కోట్లు తీసుకోగా.., ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 76.25 కోట్లు తీస్కున్నారు. ఇక ఇన్ఫోసిస్ సిఇఒ పరేఖ్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 80.62 కోట్లు కోట్లు తీసుకున్నారు. అదానీ సంపాదించే జీతం తన గ్రూప్ కంపెనీల సీఈవోల శాలరీల కంటే తక్కువ. AEL CEO వినయ్ ప్రకాష్ రూ. 69.34 కోట్లు పొందారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ జైన్ రూ. 11.23 కోట్లు పొందగా.. అదానీ గ్రూప్ CFO జుగేషిందర్ సింగ్ రూ. 10.4 కోట్లు శాలరీగా పొందారు.
అదానీ టోటల్ గ్యాస్ CEO-రూ.8.21 కోట్లు
అదానీ కుమారుడు కరణ్ APSEZ నుంచి రూ.7.09 కోట్లు పొందగా, కంపెనీ CEO అశ్వని గుప్తా రూ.10.34 కోట్లు పొందారు. గౌతమ్ అదానీ తమ్ముడు రాజేష్ AEL నుంచి రూ.9.87 కోట్లు జీతంగా తీస్కున్నారు. అదానీ మేనల్లుడు ప్రణవ్ రూ.7.45 కోట్లు శాలరీ తీస్కుంటున్నారు. అతని మరో మేనల్లుడు సాగర్ AGEL నుండి రూ.7.50 కోట్లు సంపాదించాడు. సిటీ గ్యాస్ విభాగం అదానీ టోటల్ గ్యాస్ సీఈఓ సురేష్ 2024-25 సంవత్సరానికి రూ.8.21 కోట్ల వేతనం చెల్లించగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సీఈఓ రూ.14 కోట్ల జీతం అందుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 82.5 బిలియన్ డాలర్ల ఆస్తుల విలువ కలిగిన గౌతమ్ అదానీ, ఆసియాలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీతో పోటీ పడుతున్నారు. 2022లో ఆయన అత్యంత ధనవంతుడైన ఆసియన్ అయ్యాడు, కానీ 2023లో 150 బిలియన్ డాలర్ల మేర ఆయన హిడెన్ బర్గ్ రిపోర్ట్ ద్వారా నష్టపోయారు. దీని తర్వాత ఆ స్థానాన్ని కోల్పోయారు అదానీ. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 104 బిలియన్ డాలర్ల నికర విలువతో 17వ స్థానంలో ఉండగా.. అదానీ 20వ స్థానంలో ఉన్నారు.
Story By Adhinarayana, Bigtv