AP Family Tour: ఏపీ పచ్చని ప్రకృతి, చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు. కుటుంబంతో కలిసి చూడటానికి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే బీచ్‌ల నుంచి ప్రశాంతమైన కొండ ప్రాంతాలు, లోయలు ఏపీ సొంతం. ఒక్క సారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రాంతాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఏపీలో తప్పక చూడాల్సిన 6 ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. తిరుపతి: పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం:
తిరుపతిని ఏపీ పవిత్ర రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల కొండలపై ఉంది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికతతో.. పాటు అద్భుతమైన కొండల సౌందర్యాన్ని కలిగి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల దర్శనానికి వస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం, ఆకాశగంగ తీర్థం, శిలాతోరణం, కపిల తీర్థం ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రాంతాలు.
2. వైజాగ్ : బీచ్‌లు, పర్వతాలు:
వైజాగ్.. తూర్పు తీరప్రాంతంలో ఉన్న ఒక అందమైన ఓడరేవు నగరం. బీచ్‌ల ఆనందం, ప్రకృతి సౌందర్యం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. కుటుంబంతో కలిసి బీచ్‌లో విశ్రాంతి తీసుకోవడానికి.. పార్కులను చూడటానికి వైజాగ్ సరైన ప్రదేశం. ఇక్కడి సురక్షితమైన బీచ్‌లు, పిల్లలకు ఆసక్తి కలిగించే మ్యూజియంలు, కైలాసగిరి నుంచి వైజాగ్ వ్యూ చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
3. అరకు లోయ: ప్రకృతి ప్రేమికుల స్వర్గం:
వైజాగ్ సమీపంలో తూర్పు కనుమలలో ఉన్న అరకు లోయ ప్రశాంతమైన కొండ ప్రాంతం. దట్టమైన అడవులు, కాఫీ తోటలు, జలపాతాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ వాతావరణం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ బొర్రా గుహలు (సున్నపురాయి గుహలు), కటికి జలపాతం, గిరిజన మ్యూజియం, కాఫీ ప్లాంటేషన్లు తప్పకుండా చూడాలి. అరకు రైలు ప్రయాణం అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది, బొర్రా గుహలు పిల్లలకు కొత్త అనుభూతిని ఇస్తాయి.
4. విజయవాడ: సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం:
కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడ, సాంస్కృతిక వారసత్వం, ఆధునికత కలగలిసిన నగరం. ఇక్కడ కొండపై వెలసిన కనకదుర్గ అమ్మవారి దేవాలయం ప్రసిద్ధి. కనకదుర్గ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా నదిపై), భవాని ద్వీపం (రివర్ క్రూయిజ్) లు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. కృష్ణా నదిలో బోటింగ్ , నగర చరిత్రను తెలియజేసే ప్రదేశాలు విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Also Read: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !
5. లేపాక్షి: ప్రాచీన కళా సంపద:
అనంతపురం జిల్లాలోని లేపాక్షి, విజయనగర శిల్పకళా అద్భుతాలకు నిదర్శనం. ఇక్కడి వీరభద్ర దేవాలయం, భారీ నంది విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దేవాలయంలోని అపురూపమైన కుడ్య చిత్రాలు, వేలాడే స్తంభం అద్భుతంగా ఉంటాయి. లేపాక్షి వీరభద్ర దేవాలయం, ఏకశిల నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లేపాక్షికి వెళ్లడం ద్వారా భారతీయ కళ , నిర్మాణ చరిత్రను పిల్లలు ప్రత్యక్షంగా చూపించడానికి వీలుంటుంది.
6. గండికోట: భారతదేశపు గ్రాండ్ కాన్యన్:
కడప జిల్లాలోని గండికోట, పెన్నా నది కోతకు గురికావడం వల్ల ఏర్పడిన లోతైన అగాధంకారణంగా ఇండియా గ్రాండ్ కాన్యన్గా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం అద్భుతమైన దృశ్యాలను.. సాహస క్రీడలను ఇష్టపడే వారికి చాలా నచ్చుతుంది. గండికోట కోట, పెన్నా నది అగాధం, రఘునాథ స్వామి ఆలయం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడటం,కోట చరిత్రను తెలుసుకోవడం ముఖ్యం.