Feeding Mistakes: పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో.. మంచి పోషకాలతో నిండిన ఆహారన్ని తినిపిస్తుంటారు అమ్మలు. అదే విధంగా అన్నం వేడిగా ఉంటే.. ‘ఉఫ్ ఉఫ్’ అని ఊదుతూ పిల్లలకు తినిపిస్తుంటారు చాలామంది. అయితే, ఆహ్లాదకరమైన ఈ దృశ్యం వెనక చిన్నచిన్న అపాయాలూ, పిల్లల ఆరోగ్యానికి హానిచేసే కొన్ని నిజాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా.. పిల్లల బుగ్గలు అందంగా ఉన్నాయని ఎడాపెడా ముద్దులు చేయడం, వారికి వాడే పాల సీసాల విషయంలోనూ అజాగ్రత్తలు పాటిండం వంటివి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బితీస్తాయంటున్నారు నిపుణులు. మరి, ఆ వివరాలేంటో చూద్దామా..
చిన్నారులను ముద్దు చేయడం, అన్నం పెట్టేటప్పుడు ఆహారంపై ఊదడం ఇవన్నీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో చేసే అతి సాధారణ చర్యలు. కానీ, ఇవే పిల్లల్లో దంతక్షయానికి, నోటి అనారోగ్యానికి కారణమవుతాయట. భారతదేశం సహా యూకే, అమెరికా తదితర దేశాల్లో జరిపిన వేర్వేరు అధ్యయనాల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దంతక్షయం.. తనంతట తానుగా అంటువ్యాధిగా వ్యాప్తిచెందదు, కానీ దానికి కారణమయ్యే సూక్ష్మజీవులు మాత్రం లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. సాధారణంగా పిల్లలు, కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి.. మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
పిల్లలు దంతాలు మృదువైన ఎనామెల్‌ను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా దాడికి త్వరగా గురవుతుంటాయి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ బ్యాక్టీరియా పిల్లలకు సంక్రమిస్తే.. అది వారి నోటిలో స్థిరపడి, క్వావిటీలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు వేడి చల్లార్చడానికి నోటితో ఉఫ్, ఉఫ్ అని ఊదుతుంటారు. ఉఫ్ ఉఫ్ అని ఊదినప్పుడు లాలాజల బిందువులు ఆహారంపై పడే అవకాశం ఉంటుంది. అలా ఆహారంపై పడిన లాలాజల బిందువుల్లో బ్యాక్టీరియా నేరుగా చిన్నారుల నోట్లోకి చేరిపోతుంది.
కొన్నిసార్లు పెద్దవాళ్లు తిన్న ప్లేట్లతెనే.. పిల్లలకు కూడా అన్నం పెడుతుంటారు. తామొక ముద్ద తింటూ, చిన్నారులకు మరో ముద్ద పెడుతున్నా, వారు తాగిన గ్లాసులో నీళ్లు తాగించినా సూక్ష్మక్రిములు పిల్లలకు వ్యాప్తి చెందుతాయి. అలాగే పిల్లల బుగ్గపై ముద్దు పెట్టినప్పుడు అక్కడ లాలాజలం తడి కొంత ఉండిపోతుంది. పిల్లలు తమకు తెలియకుండానే బుగ్గను తుడుచుకుని, ఆ చేతిని నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ లాలాజల తడిలోని బ్యాక్టీరియా పిల్లల శరీరంలోకి చేరుతుంది.
సాధారణంగా పిల్లల్లో ఆర్నెళ్ల వయసు వచ్చాక దంతాలు రావడం ప్రారంభమవుతుంది. రెండున్నరేళ్ల వయసుకు పూర్తిస్థాయిలో పాలదంతాలు వచ్చేస్తుంటాయి. అయితే, ఆ దంతాలపై నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే దంత వైద్యుల్ని సంప్రదించాలి. పాలపళ్లు ఎలాగూ పోతాయని కొంతమంది తల్లిదండ్రులు దంతాలపై మచ్చలున్నా పట్టించుకోరు. కానీ, ఆ మచ్చలు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్గా మారి శాశ్వతంగా దుష్ప్రభావం చూపువచ్చు అంటున్నారు నిపుణులు.