BigTV English

Sambhal Jama Masjid: యోగి టార్గెట్ సంభల్.. జామా మసీద్‌ కథ తేలాల్సిందే..

Sambhal Jama Masjid: యోగి టార్గెట్ సంభల్.. జామా మసీద్‌ కథ తేలాల్సిందే..

సంభల్‌‌లోని షాహి జామా మసీదులో సర్వే

బీజేపీ హిందుత్వా పాలిటిక్స్‌కు పదును పెట్టిందా..? అయోధ్యతో ఆగుతుందనుకున్న టెంపుల్ రన్ ఇప్పడప్పుడే ఆగదా..? కాశీ, మధురల తర్వాత కూడా మరిన్ని హిందూ టెంపుల్స్ పున:ప్రతిష్టాపన ప్రయత్నాలు కొనసాగుతున్నాయా? చట్టాలు స్పష్టంగా ఉన్నా పోరాటాలు మాత్రం ఎందుకు ఆగట్లేదు..? ఉత్తర్ ప్రదేశ్‌లో సీఎం యోగీ లక్ష్యం ఏంటీ..? ఇప్పుడు ఇవే సందేహాలు చాలా మందిని పట్టి పీడిస్తున్నాయి. సున్నితమైన అంశాల్లో క్లిష్టమైన అడుగులకు యోగీ సర్కారు సిద్ధమైనట్లే కనిపిస్తుంది.


ఇప్పుడు, సంభల్‌లోకి కొత్తవారు ఎవ్వరు రావాలన్నా అధికారులు అనుమతి తీసుకోవాలి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికల ముగిసిన వేళ ఉత్తరప్రదేశ్‌లో ఈ వివాదం మొదలయ్యింది. సంభల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంభల్‌ సిటీలోని చారిత్రక కట్టడమైన షాహి జామా మసీదులో సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా హింస చెలరేగింది. ఇందులో నలుగురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సంభల్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను మూసివేశారు.

జామా మసీద్‌ ఉన్నచోట 16వ శతాబ్ధానికి ముందు హరిహర మందిరం

సంభల్‌లో మొగల్‌ కాలానికి చెందిన జామా మసీద్‌ ఉన్నచోట 16వ శతాబ్ధానికి ముందు హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుపై జిల్లా న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. నవంబర్ 19న కోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత సంభల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే ఫలితాలను నవంబర్ 29 లోపు అందించాలని కోర్టు కోరడంతో, పురావస్తు శాఖ అధికారులు ఆపని మీద పడ్డారు. ఈ క్రమంలోనే నవంబర్ 4న మసీదు వద్దకు పెద్ద గుంపుగా వచ్చిన కొందరు సర్వేకు వ్యతిరేంగా నినాదాలతో ఆందోళనకు దిగారు.

నిరసనకారుల్ని చెదరగొడుతున్న పోలీసులపై కొందరు దుండగులు రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. దీనితో, అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయోధ్యలో రామ మందిరం ఏర్పాటైన తర్వాత కాశీ, మధుర దేవాలయాల అంశం కూడా తెరమీదకు వచ్చినప్పుడు కూడా ఇంత చర్చ జరగలేదు. కాశీలో జ్ఞాన్‌వాపి మసీదు వివాదం విషయంలో అక్కడి కోర్టు సర్వేకు ఆదేశించినా అది పెద్ద వివాదాన్ని రేపలేదు. కానీ, తాజాగా సంభల్‌లో చెలరేగిన రగడ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారి తీసింది.

Also Read:  మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. పార్టీ చీఫ్ పదవికి నానాపటోల్ రాజీనామా!

సీనియర్ డివిజన్ కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జెస్ ఇచ్చిన ఆదేశాలు

కాశీలో జ్ఞాన్‌వాపి మసీదుపై పిటీషన్ వేసిన సీనియర్ లాయర్ విష్ణు శంకర్ జైనే ఇక్కడా హిందువుల తరఫున పిటీషన్ వేశారు. సీనియర్ డివిజన్ కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జెస్ ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్వకేట్ కమీషన్ ఏర్పాటు చేసి మసీదులో సర్వేను మొదలుపెట్టారు. కమీషన్ ఆధ్వర్యంలో సర్వేను ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలని కోర్టు పేర్కొంది. అయితే, పిటీషన్‌లో లాయర్ విష్ణు జైన్ తెలివిగా వ్యహరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మసీదు కమిటీని, సంభల్ జిల్లా మెజిస్ట్రేట్‌ని కూడా పార్టీలుగా చేర్చారు. మరో కోణంలో భారత పురావస్తు శాఖను కూడా వక్ఫ్ బోర్డుకు తొత్తుగా మారిందనే విధంగా వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా, ఇప్పటి మసీదు ఒకప్పటి హరిహర దేవాలయం అని నిరూపించడానికి మసీదు కట్టడంలో హిందూ గుర్తులు ఉన్నాయని విష్ణుజైన్ బలంగా వాదించారు.

టెంపుల్ పాలిట్రిక్స్‌కు మరోసారి తెరలేపిన యూపీ సీఎం యోగీ

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ పాత అస్త్రాన్ని బయటకి తీసి పదును పెట్టడంలో బీజేపీకి పెట్టింది పేరు! అయితే, సంభల్ వివాదంలో బీజేపీ పాత్ర, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాత్ర బహిర్గతంగా కనిపించకపోయినా.. ఇటీవల జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా యూపీ సీఎం యోగీ టెంపుల్ పాలిట్రిక్స్‌కు మరోసారి తెరలేపిన మాట వాస్తవం. ఇటీవల, రామజన్మభూమిలోనూ మధుర అంశాన్ని లేవనెత్తిన యోగీ.. రీసెంట్‌గా జార్ఖండ్‌లో మధుర దేవాలయంపై వ్యాఖ్యలు చేశారు.

“మధురలోని కృష్ణ కన్హయ్య ఆలయానికి ఇదే సమయం” అంటూ పిలుపునిచ్చారు. 2047 నాటికి, దేశం స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు జరుపుకుంటున్నప్పుడు.. కాశీ, మధుర కూడా అయోధ్యలా ప్రకాశించాలి” అని అన్నారు. అయితే, వారణాసిలో, కాశీ విశ్వనాథ్-జ్ఞాన్‌వాపి ఆలయ మసీదు వివాదం పరిష్కారం కోసం ఎంతో కాలంగా కోర్టులో పోరాటం జరుగుతోంది. మరోవైపు, మధురలోని కృష్ణ జన్మ భూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై కూడా ఇదే విధంగా కోర్టు కేసు నడుస్తోంది. ఈ తరుణంలోనే ఇప్పుడు యూపీలోని సంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదు వ్యవహారం కూడా తేలాలన్నట్లు సీఎం యోగీ పావులు కదిపారనే అనుమానం వస్తుంది.

మూడు చాలు మరొకటి అడిగే ప్రసక్తే లేదని పెద్దలు స్పష్టం

2024 జనవరి 22.. రామజన్మభూమి అయోధ్యలో రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజుల తర్వాత.. ఫిబ్రవరి 4న.. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి, గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతదేశంలో ఆక్రమణకు గురైన, ఇతర దేవాలయాలను “విముక్తి” చేయాలనే కోరిక తమకు లేదని స్పష్టంగా చెప్పారు. పేరు పెట్టకుండానే అయోధ్య రామ మందిరం, జ్ఞాన్‌వాపి, కృష్ణ జన్మభూమి గురించి మాట్లాడారాయన. “మూడు దేవాలయాలు విడిపిస్తే ఇతర దేవాలయాల వైపు చూడాలని కూడా కోరుకోవడం లేదని అన్నారు.

ఈ మూడు దేవాలయాలు లభిస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనీ.. శాంతియుతంగా మిగతా విషయాలన్నీ మరచిపోతాం” అని గోవింద్ దేవ్ గిరి మహరాజ్ వెల్లడించారు. ఈ క్రమంలో.. అయోధ్య తర్వాత జరిగిన పరిణామాల్లో కాశీ వ్యవహారం కూడా ఓ కొలిక్కి వచ్చేసినట్లే కనిపించింది. ఇక, మధుర కథ కూడా కంచికి చేరితే.. మరో దేవాలయం ఎలాగూ లేదని అంతా అనుకున్నారు. మూడు చాలు మరొకటి అడిగే ప్రసక్తే లేదని కూడా పెద్దలు స్పష్టం చేశారు. అయితే, సంభల్‌లో జరిగిన ఉద్రిక్తతలు చూస్తుంటే.. టెంపుల్ రన్‌లో ఇంకెన్ని దేవాలయాలు ఉన్నాయో అనే సందేహాలు వస్తున్నాయి.

వారణాసిలోని జ్ఞాన్‌వాపీ మసీదు..

1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపించాయన్నది వాస్తవం. బాబ్రీ-మసీదు రామజన్మభూమి వివాదం ఊపందుకున్నప్పుడు, విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు.. వారణాసిలోని జ్ఞాన్‌వాపీ మసీదు, మధురలోని షాహీ ఈద్గా అనే రెండు మసీదుల కేసులను సీరియస్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అయితే, సెప్టెంబరు 1991లో భారతదేశంలో ‘ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991’ రూపుదిద్దుకుంది.

దీన్ని బట్టి, భారతదేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే, కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని చట్టంలో పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిథిలో కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు ఈ చట్టం మాట పక్కనపెడితే.. చరిత్రను తిరగతోడి, జరగాల్సిన సనాతన స్థాపన అనేది ముందు వరుసలో నిలిచిందనే వాదనలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×