Big Stories

Hathras Stampede : ఇది మూఢనమ్మకం కాదు.. పిచ్చి, పైత్యం.. హాథ్రస్ ఘటనపై సర్వత్రా విమర్శలు

Hathras Stampede : ఇది మట్టి రాసిన మరణశాసనం. మట్టి కోసం ఎగబడి.. ఆ మట్టిలోనే కలిసిపోయారు. ఇది నమ్మకమా.. మూఢనమ్మకం అనే రేంజ్‌ దాటి.. పిచ్చి.. పైత్యం వరకు వచ్చింది. లేకపోతే.. ఓ బాబా పాదధూళి కోసం ఎగబడటం ఏంటి? అక్కడ తొక్కిసలాట జరిగి 120 మందికిపైగా మృతి చెందడం ఏంటి? ఇంతకీ యూపీలో అసలేం జరిగింది? జనాలు ఇంతలా వెర్రెక్కిపోవడానికి కారణమేంటి?

- Advertisement -

తరతరాలుగా వస్తన్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అంటే ఓకే. కానీ వీటికి అమాయకత్వం.. నిరక్షరాస్యత.. అతి నమ్మకం తోడైతే.. హాథ్రస్ లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. లేకపోతే ఆయన పాదధూళి.. ఆయన కారు వెళ్లిన దారిలో మట్టి కోసం జనాలు ఎగబడటం ఏంటి ? అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 120 మందికిపైగా మృతి చెందడం ఏంటి ? నిజానికి ఇది ప్రమాదవశాత్తు జరిగిన దారుణం కాదు.. హత్యలు. ఇన్ని ప్రాణాలు తీసిన హంతకులు.. ఈవెంట్‌ను సరిగా నిర్వహించని ఆర్గనైజర్స్.. ఫేమ్‌ తప్ప.. ప్రజల ప్రాణాల గురించి ఆలోచించని భోలే బాబా.. ఇన్ని లక్షల మంది తరలివచ్చినా కనీసం అటువైపు చూడని ప్రభుత్వ వ్యవస్థలు. వీరందరిదీ తప్పే. వీరి నిర్లక్ష్యమే ఇప్పుడింత మంది ప్రాణాలు పోయేందుకు కారణమైంది.

- Advertisement -

Also Read : హాథ్రస్ ఘటనలో గంట గంటకు పెరుగుతున్న మృతులు.. 121కి చేరిన సంఖ్య

ఇంత ఫ్యాన్‌ బేస్.. అదే ఇంత గుడ్డిగా భక్తులు ఆయనను ఫాలో అవుతున్న భోలే బాబా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనకు ఇంత మంది భక్తజనం నిరాజనాలు అర్పిస్తున్నారు..? నారాయణ్‌ సాకర్ విశ్వ హరీ.. భోలే బాబా అసలు పేరు ఇదే. బాబా అవతారం ఎత్తడానికి ముందు ఆయనకు సూరజ్ పాల్ సింగ్ ఇంకో పేరు ఉంది. ఓ దళిత కుటుంబం నుంచి వచ్చిన సింగ్.. గతంలో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 17 ఏళ్లపాటు పనిచేసిన తర్వాత స్వచ్చందంగా పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత ఓ ఆశ్రమాన్ని స్థాపించాడు.. ఆ తర్వాత భక్తుల రాక పెరిగింది. ఆ ఆశ్రమమే తన సామ్రాజ్యంగా మారిపోయింది. తనకు తానే ఓ స్వయం భగవంతుడిగా ప్రకటించుకున్నాడు. తెల్లటి సూట్, టై ధరించి బోధనలు చేస్తాడు భోలే బాబా. బోధన అయిన తర్వాత అతడి అనుచరులు నీరు, మట్టిని అందరికి పంచుతారు. వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు ఆయన భక్తులు.

యూపీలో మొదలైన బాబా ఎఫెక్ట్ అతి కొద్దికాలంలోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు కూడా విస్తరించింది. భోలే బాబా భక్తులు బలంగా నమ్మేది ఏంటంటే.. ఆయనకు ఒక దేవత దర్శనం ఇస్తుంది.. ఆమె ఆదేశాల ప్రకారమే భక్తుల సమస్యలు విని పరిష్కరిస్తాడని. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన మకాంను రాజస్థాన్‌కు మార్చాడు భోలే బాబా. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందన్న అనుమానామే దీనికి కారణం.
నిజానికి గతంలో కూడా భోలేబాబా విషయంలో ఓ వివాదం నెలకొంది. కోవిడ్ సమయంలో 50 మందితో సత్సంగ్ నిర్వహిస్తానని పర్మిషన్‌ తీసుకున్న ఈ పెద్దమనిషి.. ఏకంగా 50 వేల మందితో కార్యక్రమం నిర్వహించాడు. ఆ తర్వాత కోవిడ్ కేసులు పెరగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రతి మంగళవారం భోలే బాబా సత్సంగాలు నిర్వహిస్తాడు. హత్రాస్‌లో కూడా మంగళవారం నిర్వహించిన సత్సంగ్‌లోనే తొక్కిసలాట జరిగి ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది.

ఇక నిన్నటి సత్సంగ్ విషయానికి వద్దాం. నిజానికి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆర్గనైజర్స్‌ పర్మిషన్‌ తీసుకున్నారు. కానీ 80 వేల మంది వరకు వస్తారని చెప్పారు. కానీ ఏకంగా రెండున్నర లక్షల మంది తరలివచ్చారు. వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదు. వారందరు లోపలికి వెళ్లిన తర్వాత గేట్లు వేశారు. మళ్లీ బాబా కాన్వాయ్‌ వెళ్లిపోయిన తర్వాతనే తెరిచారు. దీంతో కొంత మంది మట్టి కోసం.. మరికొందరు భరించలేని ఉక్కపోత నుంచి బయటపడదామన్న ఆలోచనతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. అప్పుడు జరిగింది ఈ మృత్యుకేళి.. చాలా మంది స్పృహ కోల్పోయారు.. ఆ తర్వాత అలానే ప్రాణాలు విడిచారు.

Also Read : హథ్రాస్ తొక్కిసలాట.. స్పందించిన భోలే బాబా..

ఇంతా జరిగితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా కూడా భోలే బాబా పేరు లేదని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాబట్టి.. ఇప్పుడే చేర్చే అవకాశం ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ విచారణకు ఆదేశించారు. పోలీసులు దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేలు ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ పోయిన ప్రాణాలైతే మళ్లీ తిరిగి వస్తాయా? గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదా? మరి వాటి నుంచి ప్రభుత్వాలు నేర్చుకున్న పాఠాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏం లేవనే చెప్పాలి. ఇలా ప్రాణాలు పోయినప్పుడు కొన్ని రోజులు హడావుడి చేయడం.
ఆ తర్వాత మళ్లీ మర్చిపోవడం కామన్‌గా మారిపోయింది.

ఇక భక్తుల విషయానికి వస్తే.. బాబాలపై ఏంటి మీకు ఈ గుడ్డి నమ్మకం? For your kind information.. ఇక్కడ మేం ఎవరి విశ్వాసాలను కించపర్చడం లేదు. కానీ విచక్షణ అనేది ఉండాలి కదా? నమ్మకం, మూఢ నమ్మకం మధ్య ఉన్న చిన్న రేఖను గుర్తించకపోతే ఎలా? మీ కష్టాలను, సమస్యలను క్యాష్‌ చేసుకొని.. వారు నిర్మించుకుంటున్న సామ్రాజ్యాలను చూసినప్పుడైనా మీ ఎమోషన్స్‌తో ఎలా ఆడుకుంటున్నారో.. అర్థం కాలేదా ? అతి సర్వత్రా వర్జయేత్.. అని పెద్దలు చెప్పిన విషయాన్ని మరవకండి.. ఇకనైనా మారండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News