Etala Vs Bandi : ఇద్దరూ.. ఇద్దరే! ఎప్పూడు కలవరు. కానీ.. ఆ ఇద్దరే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఒకే పార్టీ నేతలే అయినా.. ఇప్పుడదే పార్టీ ప్రెసిడెంట్ పోస్టు కోసం ప్రత్యర్థులుగా మారారు. పైగా.. ఇద్దరూ ఒకే జిల్లా నుంచి రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. బండి సంజయ్, ఈటల రాజేందర్.. ఈ ఇద్దరిలో ప్రెసిడెంట్ అయ్యే.. ఆ ఒక్కరెవరు? నేషనల్ పార్టీలో నడుస్తున్న.. లోకల్ డిస్కషన్ ఏంటి?
తెలంగాణ బీజేపీకి నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరు?
తెలంగాణ భారతీయ జనతా పార్టీకి.. నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరు? కొన్ని నెలలుగా సస్పెన్స్‌గా మారిన అంశమిది. స్టేట్ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే దానిపై.. అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న సారథి కిషన్ రెడ్డి తర్వాత.. ఆ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సుదీర్ఘ చర్చ సాగుతూ వస్తోంది. మొన్నటిదాకా ప్రెసిడెంట్ రేసులో చాలా మంది నేతల పేర్లు వినిపించాయ్. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, సీనియర్ లీడర్ రాంచందర్ రావు పేర్లు బలంగా వినిపించాయ్.
ఇప్పటికైతే వీళ్లిద్దరే ప్రెసిడెంట్ రేసులో ఉన్నారనే టాక్
రోజులు గడిచేకొద్దీ ఒక్కో పేరు పక్కకు పోవడం మొదలైంది. అలా.. చివరికి.. లిస్టులో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయనే చర్చ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దాంతో.. వీళ్లిద్దరిలోనే.. ఎవరో ఒకరు రాష్ట్ర పార్టీ అధినేత కాబోతున్నారనే చర్చ విపరీతంగా సాగుతోంది. ఆఖరి క్షణంలో అధిష్టానం మనసు మార్చుకుంటే తప్ప.. ఇప్పటికైతే వీళ్లిద్దరే ప్రెసిడెంట్ రేసులో ఉన్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఇద్దరి మధ్య మెుదట్నుంచి గ్యాప్ ఉందనే చర్చ
బండి సంజయ్, ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు. అయినప్పటికీ.. వీళ్లిద్దరి మధ్య మొదట్నుంచీ గ్యాప్ ఉందనే చర్చ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. ముందునుంచీ.. ఇద్దరు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. ఈటల బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచే.. బండి సంజయ్ వర్సెస్ ఈటల అనే టాక్ మొదలైపోయింది.
పరోక్షంగా రాళ్లు రువ్వుకుంటూనే ఉంటారనే చర్చ
ఇదెందుకు మొదలైందనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఇద్దరూ.. ఒకరిపై ఒకరు నేరుగా ఆరోపణలు చేసుకోకపోయినా.. పరోక్షంగా పరస్పరం రాళ్లు రువ్వుకుంటూనే ఉంటారనే చర్చ బీజేపీ శ్రేణుల్లో ఉంది. అయితే.. ప్రధాని మోడీ, అమిత్ షా స్థాయిలో.. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో.. ఈటల పేరే పరిశీలనలో ఉందనే ఓ చర్చ జరుగుతోంది. మరోవైపు.. ఈటలను అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నాయనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది.
ఈటల, అర్వింద్, రఘునందన్, డీకే అరుణ బీజేపీకి కొత్త!
ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్, డీకే అరుణ లాంటి వాళ్లు బీజేపీకి కొత్త! అందువల్ల.. వాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో తమ ఆధిపత్యానికి గండిపడుతుందేమోనన్న భయం, ఆందోళన.. ఆర్ఎస్ఎస్ మూలాలతో ఎదిగి వచ్చిన సీనియర్లలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అందులోనూ.. కొందరికి సంజయ్‌తో పెద్దగా పొసగకపోయినా.. ఇప్పుడు మాత్రం ఈటల కంటే సంజయే బెటరనే ఆలోచనలో పడ్డారట. అందుకోసమే.. లోలోపల సంజయ్‌ని బలపరుస్తున్నారనే మరో ప్రచారం ఊపందుకుంది.
Also Read: బాబుకు చెక్ .. సొంత పార్టీ నేతలే !
అధిష్టానం పరిశీలనలో ఈటలే ఉన్నారని మరో టాక్
అయినా.. అధిష్టానం పరిశీలనలో మాత్రం ఈటల పేరు మీదే చర్చ జరుగుతుందనేది మరో ప్రచారం. దాంతో.. ఈటల, బండి సంజయ్‌లో.. హైకమాండ్ ఎవరి వైపు మొగ్గుతుందనేది ఆసక్తిగా మారింది. బీజేపీ బండికి మళ్లీ సంజయ్‌నే సారథిగా ప్రకటిస్తారా? లేక.. ఈటల రాజేందర్‌కు ఓ అవకాశం ఇచ్చి చూస్తారా? అనేది అటు బీజేపీలోనూ.. ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది.