HBD Singer Janaki :పక్షుల కిలకిల రావాలు మొదలుకొని.. అమ్మ లాలి పాట వరకు ఎలాంటి స్వరాలనైనా సరే తన గొంతుతో అవలీలగా పలికించే గాయకురాలు, ‘ నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా’ గా పేరు సొంతం చేసుకున్న ఎస్.జానకమ్మ (S.Janakai) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన మధురామృతంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజెండ్రీ గాయకురాలు ఎస్.జానకి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
18వ ఏటనే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, సింహళ, తుళు , సౌరాష్ట్ర , జర్మనీ, ఇంగ్లీష్ , బెంగాలీ, ఒరియా, జపనీస్, జర్మనీ తో పాటు పలు భాషలలో వేలాది పాటలు పాడారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలోని పాలపట్ల అనే గ్రామంలో జన్మించిన ఈమె.. పుడుతూనే మాటల కంటే పాటలనే నేర్చుకుంది. ఈమె తండ్రి శ్రీరామమూర్తి…ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. చిన్నతనంలోనే కూతురి సంగీత అభిలాషను గమనించిన ఆయన సంగీత విద్వాంసుడు శ్రీ పైడిస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి తన 10వ ఏట వరకు వివిధ సంగీత కచేరీలలో పాటలు పాడి మంచి పేరు సొంతం చేసుకున్నారు జానకి. అలా 18వ ఏట జాతీయ స్థాయిలో సంగీత పోటీలో పాల్గొని.. 1957లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత పోటీల్లో ఉత్తమ గాయనిగా అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు.
జానకి తొలి పాట ప్రయాణం అలా మొదలైంది..?
ఇక అప్పటికి ఆమె భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఆమె ప్రతిభను దేశం నలుమూలలా వ్యాపింప చేయాలని ఆలోచించిన ఆమె మావయ్య జానకిని చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడ ఏవీఎం ఆస్థాన సంగీత దర్శకుడు గోవర్ధనం ఆమెకు సంగీతంలో ఒక పరీక్ష పెట్టగా అందులో నెగ్గి అక్కడి స్టాఫ్ సింగర్ గా సెలెక్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచే ఆమె సినీ ప్రయాణం మొదలయింది. ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో లేదో అలా ఏకంగా ఆరు భాషల్లో 100కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించింది. ఇక మొదటిసారి 1957 ఏప్రిల్ 4 తేదీన ఆమె తొలి పాట రికార్డ్ అయింది. పదహారణాల తెలుగు అమ్మాయి అయిన జానకి…తన తొలి పాటను మాత్రం తమిళంలో పాడి ఆకట్టుకుంది. గాయనిగా ఏ భాషలో పాడినా తొలి గీతం విషాదగీతమే పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఎవరైనా సరే తమ మొదటి పాటను ఇలా విషాద పాటలు పాడడానికి ఆసక్తి చూపించరు. కానీ ఆమె అలాంటి సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టేసి అన్ని భాషలలో కూడా అలా విషాద గీతాలు పాడి ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఇకపోతే జానకికి ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళల్లో తమిళంలో వచ్చిన అంత పేరు తెలుగులో రాలేదు. ముఖ్యంగా ‘కొంజుం సలంగై’ అనే తమిళ చిత్రంతో ఈమెకు మంచి పేరు వచ్చింది. సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సన్నాయి తో పోటీపడి జానకి పాడిన పాట ఆమెకెంతో పేరు తీసుకొచ్చింది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘మురిపించే మువ్వలు’ గా డబ్బింగ్ చేయగా.. ఈ పాటలో ‘నీ లీల పాడెద దేవా’ అనే పాట పాడి తెలుగులో కూడా భారీ క్రేజీ సొంతం చేసుకుంది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరు ఊహించని అవార్డులను సొంతం చేసుకుంది. ఈరోజు 87వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఎస్. జానకికి పలువురు సెలబ్రిటీలు , అభిమానులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.