BigTV English

YCP Leaders: ఆళ్ల నానితో పాటు టీడీపీలోకి ఇద్దరు వైసీపీ కీలక నేతలు

YCP Leaders: ఆళ్ల నానితో పాటు టీడీపీలోకి ఇద్దరు వైసీపీ కీలక నేతలు

YCP Leaders: ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గ్రంధి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు టీడీపీలో చేరడం దాదాపు ఖరారైందంటున్నారు. అదే జరిగితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోవడమే కాదు. పక్క జిల్లాల్లో వైసీపీపై కూడా ఆ ప్రభావం రిఫ్లెక్ట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.


ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మాజీ ఎమ్మెల్యే, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ టిడిపిలో చేరడం దాదాపు ఖరారైందన్న ప్రచారం జరుగుతుంది .. ఈ నెల 9వ తేదీన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు వీరిద్దరూ కూడా తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షత్రియ సమాజ వర్గానికి చెందిన కీలక వ్యక్తి పార్టీలో వారి చేరికపై పావులు కదిపారని సమాచారం.

ఆళ్ల నానితో పాటు చెరుకువాడ రంగనాథరాజు, గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్‌బై చెప్పి పార్టీ మారితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చెరుకువాడ శ్రీరంగనాథరాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున అత్తిలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అత్తిలి శాసనసభ నియోజకవర్గం రద్దయింది. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బాట పట్టిన శ్రీరంగనాథరాజు 2014-18 మధ్యకాలంల జిల్లా టీడీపీ సమన్వయకర్తగా వ్యవహరించారు. 2018లో వైసీపీలో చేరిన ఆయన ఆచంట ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.


ఇక భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు జిల్లాలో ప్రచారం ఉపందుకుంది . 2004లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఆయన 2019లో వైసీపీ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచినా కనీస గుర్తింపు లేదని గ్రంధి అనుచరులు బహిరంగం గానే విమర్శలు చేశారు. గ్రంధి శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఖాయం ఇక ప్రకటన వెలువడటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో లిస్ట్ లో గ్రంధి పేరు లేకపోవడంతో గ్రంధి శ్రీనివాస్ తో పాటు అయన అనుచరులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

Also Read:  ధర్మాన అలక.. జగన్ అలా చేయడం వల్లే హర్ట్ అయ్యారా?

మంత్రి పదవి రెండు సార్లు చేతి దాకా వచ్చి జారిపోయినా , వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోకపోయినా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిమీద ఉన్న అభిమానంతో గ్రంధి శ్రీనివాస్ పంటి బిగువన పార్టీలో కొనసాగారంటారు. అవమానాలు దిగమింగుకుంటూ ఎక్కడా బయటపడకుండా , కనీసం తన వర్గీయుల దగ్గర కూడా మాటవరసకు అయినా అధిష్టానం పై విమర్శ చేయకుండా హుందాగా నడుచుకున్నారు . 2019 లో గెలిచినప్పటికీ తనకు వ్యక్తిగతంగా వైసిపి అధిష్టానం ఏమి చేయకపోయినా మరల 2024లో రెట్టించిన ఉత్సాహం తో ఎన్నికల రంగంలోకి దిగారు . చివరి వరకు మళ్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన వెనుకంజ వేయలేదు. చివరికి టిడిపి నుండి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పోటీ చేసి కూటమి బలం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వీచిన వ్యతిరేక పవనాలతో గ్రంధి శ్రీనివాస్‌పై విజయం సాధించారు.

ఆళ్ల నాని టీడీపీలో చేరడం ఖాయమవ్వడంతో చేరిక సందర్భంగా ఆయన తన స్థాయి నిరూపించుకోవాలని భావించారంట.. అందుకే రంగనాథరాజు, గ్రంధి శ్రీనివాస్‌‌లను కూడా తనతో పాటు టీడీపీలో చేర్చడానికి చూస్తున్నారంట.. అయితే వారి చేరికపై సొంత నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయంట. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఎంత కీలకమూ అందరికీ తెలిసింది. పార్టీల తలరాతలు మార్చే జిల్లాలు ఆ రెండు.. అలాంటి వాటిలో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందిప్పుడు. ఆళ్ల నానితో పాటు చెరుకువాడ రంగనాథరాజు, గ్రంధి శ్రీనివాస్‌లు టిడిపిలో చేరితే.. ఆ ప్రభావం పక్క జిల్లాల మీద కూడా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×