BigTV English

CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు ఔట్?

CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆరుగురు ఔట్?

డిసెంబర్ 12తో కూటమి సర్కార్‌కు ఆర్నెళ్లు పూర్తి
హనీమూన్ పీరియడ్ పూర్తవ్వడంతో ప్రొగ్రెస్ రిపోర్టు
మంత్రులను నివేదికలు కోరిన సీఎం నారా చంద్రబాబు
తానూ సర్వే రిపోర్టు తెప్పించుకున్న ముఖ్యమంత్రి
సర్వేలో ఆరుగురి పనితీరు బాగోలేదని తేలిన వైనం!
రాయలసీమ నుంచి ఇద్దరు మంత్రులకు పదవీగండం
ఉత్తరాంధ్ర నుంచి ఒకరిపై లెక్కలేనన్ని ఆరోపణలు, ఫిర్యాదులు
కోస్తా జిల్లాల మంత్రుల్లో ముగ్గురిపై తీవ్ర అసంతృప్తి?
క్లాస్ తీసుకున్నా, హెచ్చరించినా మార్పు రాలేదనే అభిప్రాయం
సంక్రాంతి తర్వాత మార్పులు జరిగినా, మరో ఆర్నెళ్లు గడువు ఇచ్చినా,
ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్న అమరావతి వర్గాలు
ఈసారి ఎక్కువగా సీనియర్లకే అవకాశం ఇవ్వొచ్చంటున్న విశ్లేషకులు
ఆరుగురిలో ఒకరు జనసేన నుంచి మంత్రి కూడా ఉన్నారని భోగట్టా


స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్:
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి డిసెంబర్ 12తో ఆరు నెలలు నిండుబోతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అర్ధ సంవత్సరం పరీక్షలు ముగుస్తున్నాయి. హనీమూన్ పీరియడ్ పూర్తవ్వడంతో మంత్రుల ప్రొగెస్ రిపోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీంతో ఈ ఆర్నెళ్ల పరీక్షల్లో పాసయ్యే దెవరు? అట్టర్ ప్లాప్ అయ్యేదెవరు? అంటూ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై సహజంగానే ప్రజల అంచనాలు, ఆశలు భారీగానే ఉంటాయి. అందుకే ఆరు నెలలపాటు ప్రజలు ఆశావహ దృక్పథం, సానుకూల ధోరణితోనే ఎదురుచూస్తారు. ఆ తర్వాత అసలు సినిమా మొదలవుతుంది. పాలన ఎలా సాగుతోంది? సంక్షేమ పథకాల పరిస్థితేంటి? అని ఓ వైపు ప్రజలు, మరోవైపు ప్రభుత్వ పెద్దలు సైతం రివ్యూలు చేస్తుంటారు. ఈ విషయంలో రాజకీయంగా డక్కా ముక్కీలు తిన్న చంద్రబాబుకు ప్రత్యేకించి ఎవరూ చెప్పనక్కర్లేదు. ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి చూస్తుంటారనే అభిప్రాయం తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పట్నుంచీ ఉంది.


నివేదికలు, సర్వేలు
ఏపీ కేబినెట్‌లో చంద్రబాబు కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో అర డజను మంది తప్ప, అందరూ కొత్త ముఖాలే. అందుకే ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు, పొరపచ్చాలు లేకుండా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. తనదైన శైలిలో రివ్యూలు తీసుకోవడం, నివేదికలను తెప్పించుకుంటూ వారికి తగిన సూచనలు, సలహాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ దిశానిర్దేశం చేసిన చంద్రబాబు, ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి మంత్రి తన శాఖ పరిధి, పని తీరుపై నివేదికలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అడిగారు. మరోవైపు చంద్రబాబు కూడా తనదైన శైలిలో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారని అమరావతి వర్గాలు వెల్లడించాయి. వాటన్నింటినీ క్రోడీకరించి మంత్రులకు రానున్న రోజుల్లో సూచనలు, సలహాలు చంద్రబాబు ఇవ్వబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ మంత్రుల పనితీరుకు ఇవన్నీ ప్రొగ్రెస్ రిపోర్టులు.

బీ.. సీరియస్
మొత్తం మంత్రుల్లో కొందరు మాత్రమే తమ శాఖల్లో పట్టు సాధించి, బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారని అయితే కొందరు మాత్రం నెమ్మదిగా గాడిలో పడుతున్నారనే అభిప్రాయం చంద్రబాబుకు ఉందని తెలిసింది. ఇంకొందరు మంత్రులు మాత్రం ఇంకా ఏబీసీడీల దశలోనే ఉండి అవగాహన పెంచుకోవడానికి చూస్తున్నారని ముఖ్యమంత్రికి అర్థమైంది. ఆర్నెళ్ల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్‌గా చూస్తున్నారు. ప్రభుత్వం పనితీరు అన్నది ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపైనే ఆధారడి ఉంటుంది. అందుకే కేబినెట్ భేటీ జరిగిన ప్రతిసారీ పనితీరు మెరుగుపరుచుకోవాలని పదే పదే కొందరు మంత్రులకు సూచిస్తూ వస్తున్నారు. అంతేకాదు కొందరికి ప్రత్యేకంగా క్లాసులు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవని మంత్రులను ముఖ్యమంత్రి హెచ్చరిస్తూ కూడా వచ్చారు.

సీమలో ఇద్దరు ఔట్!
చంద్రబాబు చేయించిన సర్వే రిపోర్టు ఇప్పటికే చేతికందగా, మంత్రుల నుంచి రావాల్సిన నివేదికలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది. ఆయన చేతికొచ్చిన రిపోర్టు ప్రకారం రాయలసీమ నుంచి ఇద్దరు మంత్రుల పోస్ట్ ఊస్టింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. ఇందులో ఒకరి పనితీరు మరీ దారుణంగా ఉందట. మంత్రి ఎంతసేపూ విమర్శలపాలవ్వడం, ఆయన కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు ఎక్కువగా లేనిపోని విషయాల్లో కలుగజేసుకోవడం లాంటివి ఎక్కువగా ఉన్నాయని తెలియవచ్చింది. తొలిసారి మంత్రిని అనే విషయాన్ని మరిచిపోయి వ్యవహరిస్తున్నారని, దీనికి తోడు ఒకట్రెండు సార్లు స్వయంగా ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నా, గట్టిగా హెచ్చరించినా కూడా సదరు మంత్రిలో నాటి నుంచి నేటి వరకూ ఎలాంటి మార్పు రాలేదని సర్వే రిపోర్టులో తేలిందట. అందుకే ఆ మంత్రి పదవి కచ్చితంగా పోతుందని ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

ఇక మరొకరి విషయానికొస్తే తొలిసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న సదరు ఎమ్మెల్యే ఇక మళ్లీ అవకాశం వస్తుందో లేదో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చిందని, ఇదే విషయం సర్వే రిపోర్టులో కూడా రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఎందుకంటే తాను స్వయంగా క్లాస్ తీసుకున్నా కూడా మార్పు రాకపోవడమే ఇందుకు కారణం. ఎంతసేపూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో విరోధాలు, సదరు మంత్రులతోనూ సఖ్యత లేకపోవడం, అధికారులు చెప్పినా కూడా వినలేదన్నది ఆ మంత్రిపై ఉన్న ప్రధాన ఆరోపణ అని తెలిసింది.

ఉత్తరాంధ్ర నుంచి ఒకరు!
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. ఇందులో ఒకరు కింజరపు అచ్చెన్నాయుడు సీనియర్ కాగా, మరో ఇద్దరూ కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత జూనియర్లే. ఈ ఇద్దరికీ తొలిసారి మంత్రి పదవి అవకాశం వచ్చింది. ఈ ముగ్గురూ మొదట్లో పనితీరు బాగానే కనబరిచినా ఆ తర్వాత ఒకరి విషయంలో చంద్రబాబు ఎందుకో తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారని తెలిసింది. శాఖపైన దృష్టి పెట్టి పట్టు పెంచుకోవాలని పదే పదే చెప్పినా ఫలితం మాత్రం శూన్యమట. కనీసం మీడియా ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలియట్లేదట. జిల్లా సీనియర్ మంత్రి సలహాలు, సూచనలు చేసినా, ఒకట్రెండు సార్లు క్లాస్ చంద్రబాబు క్లాస్ తీసుకున్నా కూడా ఫలితం లేకపోవడం గమనార్హం. అందుకే సదరు మంత్రిని పక్కనెట్టాలని ముఖ్యమంత్రి ఫిక్స్ అయ్యారని తెలిసింది. ఈ మంత్రిపై వైసీపీ నుంచి పదే పదే విమర్శలు, సొంత పార్టీ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతల నుంచి కూడా ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సమాచారం.

కోస్తా నుంచి ఎందరో?
ఇక ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఒకరి మంత్రి పదవి ఊస్టింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా సీనియర్ అయినప్పటికీ ఆయన తొలిసారి మంత్రిగా ఎన్నికయ్యారు. అయితే శాఖను అంతంత మాత్రంగానే పట్టించుకుంటున్న సదరు మంత్రి ఇతర వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారట. పైకి ముఖ్యమంత్రి దగ్గర మాత్రం అన్నీ తానే చేస్తున్నా అనేలా ప్రవర్తిస్తూ మార్కులు కొట్టేయడానికి ముందు వరుసలో ఉంటున్నారని తెలిసింది. అందుకే మాటలు కాదు, చేతలు కావాలని ఒకానొక సందర్భంలో కేబినెట్ భేటీ పూర్తయ్యాక విడిగా మాట్లాడి హెచ్చరించారు. అయితే నాటి నుంచి నేటికి అబ్బే అవేమీ మనకు పట్టవన్నట్లుగా మంత్రి ప్రవర్తిస్తూ చంద్రబాబు ఆగ్రహానికి లోనయ్యారట. అందుకే ఇక అలాంటి వ్యక్తి ఆర్నెళ్లు కాదు కదా ఇంకో ఏడాదిన్నర సమయం ఇచ్చినా ఫలితం లేదని ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది.

ఇక ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, విజయవాడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రుల్లో ఇద్దరి విషయంలో సీఎం సంతృప్తిగా లేరని సమాచారం. ఇచ్చిన శాఖలకు న్యాయం చేయడం పక్కనెట్టి జిల్లాలో అన్ని విషయాల్లో వేలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఓ మంత్రిపై గుర్రున ఉన్నారట చంద్రబాబు. ఇంకో మంత్రి అయితే పదవి వచ్చింది ఆలస్యం, దాన్ని అడ్డుపెట్టుకుని జిల్లానే కాదు, ఇతర జిల్లాల్లోనూ వేలుపెట్టి తనకు కావాల్సిన పనిని చేసుకుంటున్నారట. ఇదేం పద్ధతి? ఎక్కడ్నుంచి ఎక్కడికి వస్తున్నారు? అని ఆయనపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేశారట. దీంతో ఇవన్నీ మానుకోవాలని ముఖ్యంగా ఉచిత ఇసుక, మద్యం విషయంలో అసలు కలుగజేసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. హెచ్చరించి మూడు నెలల వ్యవధి అయినా సరే ఇంతవరకూ ఇసుమంత కూడా సదరు మంత్రిలో మార్పు రాకపోవడం గమనార్హం. అందుకే ఇలాంటి ఒక్కరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట.

విస్తరణలో భాగంగా..
ఇలా రాయలసీమ నుంచి ఇద్దరు, ఉత్తరాంధ్ర ఒకరు, కోస్తా నుంచి ముగ్గురి విషయంలో మొత్తం ఆరుగురు మంత్రులపై గుర్రుగా చంద్రబాబు ఉన్నారట. సంక్రాంతి తర్వాత వారందర్నీ పక్కనెట్టినా, లేదంటే ఇంకో ఆర్నెళ్లు సమయం ఇచ్చినా ఇవ్వొచ్చని తెలిసింది. ఇక అప్పటికీ పనితీరు మారకపోయినా, శాఖపై పట్టు సాధించలేకపోయినా మరుక్షణమే పక్కనెడతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో జనసేనకు చెందిన మంత్రి కూడా ఒకరు ఉన్నారని సమాచారం.

మంత్రుల నుంచి రిపోర్టు ఎప్పుడు వస్తుందో? అందులో ఏం తేలుతుందో? తన సర్వేతో ఆ రిపోర్టు బేరీజు చేసుకుని తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పక్కనెట్టే మంత్రుల స్థానంలో ఈసారి అందరూ సీనియర్లనే తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అసలే జమిలి అనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తప్పకుండా సీనియర్లు అయితేనే ఇచ్చిన శాఖకు న్యాయం చేస్తారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవుల్లో ఉండేదెవరు? కేబినెట్ నుంచి ఊడెదెవరు? మంత్రులయ్యే అవకాశం సీనియర్లలో ఎవరికుంది? చంద్రబాబు మనసులో ఎవరున్నారో? అనేది తెలుసుకోవడానికి ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×