రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులంటూ ఎవరూ ఉండరు. అధికారం దూరమైతే నేతలు పక్క చూపులు చూడటం ఇటీవల పరిపాటిగా మారింది. ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాల వారీగా అధినేత జగన్ నిర్వహిస్తున్న సమావేశాలకు కొందరు డుమ్మా కొట్టడంతో వారి పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో YCPకు కీలకంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు….తాడేపల్లి మీటింగ్‌కు హాజరుకాకపోవటం.. హాట్ టాపిక్‌గా మారింది.
గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల ముందు నుంచి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే… ఓటమి తర్వాత కొందరు నేతలు ఏకంగా ముఖం చాటేస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు పంచాయితీ నుంచి పార్టీ ఘోర ఓటమి తర్వాత నేతల తీరులో మార్పు వచ్చిందనే టాక్.. పొలిటిక్ వర్గాల్లో సాగుతోంది. తాజాగా తాడేపల్లిలో జగన్ నిర్వహించిన జిల్లావారీ సమీక్షకు మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ జిల్లాల వారీగా జగన్..సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు నేతలు వచ్చినా… ధర్మాన ప్రసాదరావు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం జిల్లాలో ధర్మానప్రసాదరావుకు ప్రత్యేకమైన పేరుంది. YS హయాం నుంచి ఆయన మంత్రిగా పనిచేసి.. సీనియర్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. దీనికి తోడు ఆయనకు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. ఎందుకో..గత ఎన్నికల తర్వాత ఆయన మౌనంగా ఉంటున్నారు. మైకు దొరికితే.. ప్రత్యర్థులను తనదైన శైలిలో ఇబ్బంది పెట్టే ధర్మాన.. మౌనం వెనుక రహస్యమేంటనే చర్చ జోరుగా సాగుతోంది. 2019లో వైసీపీ తరపున గెలిచిన ధర్మాన ప్రసాదరావుకు మొదటి విడతలో మంత్రిగా జగన్ అవకాశం ఇచ్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గం మార్పులో ఆయన్ను పక్కనపెట్టారు. అది కూడా ధర్మాన ప్రసాదరావుకు ఇబ్బంది కలిగించిందని అప్పట్లో ఆయన వర్గీయులు చర్చించుకున్నారట. తర్వాత కాలంలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ధర్మాన రామ్‌మనోహర్ నాయుడుకు సీటు ఇవ్వమని.. అధినేతను కోరగా.. ఆయన తిరస్కరించారట. దీంతో అయిష్టంగానే గత ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు బరిలో నిలిచారని ఆయన వర్గీయుల్లోనే టాక్ నడిచింది.
గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో పాటు జగన్ పాలనాపరమైన వైఫల్యాలతో.. వైసీపీ ఘోర పరాజయం పాలైంది. తర్వాత నుంచి ప్రసాదరావు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రెస్‌మీట్‌లో కానీ.. ఇతర మీటింగ్‌లకు గానీ ఆయన హాజరు అయిన దాఖలాలు లేవని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దీనికి తోడు శ్రీకాకుళం నియోజవర్గ ఇన్‌ఛార్జ్‌గా తన కుమారుడు రామ్‌మనోహర్ నాయుడుకు అవకాశం ఇవ్వమని.. అధినేతను కోరగా.. ఆయన కనీసం ఆ పేరును పరిగణనలోకి కూడా తీసుకోలేదట. దీంతో కుమారుడు భవిష్యత్ కోసం ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని జోరుగా చర్చ సాగుతోంది. దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది అంతుపట్టడం లేదు.
తాడేపల్లిలో జగన్ నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా స్థాయి రివ్యూ సమావేశానికి రాకపోవటంతో అందరూ ధర్మాన వైపు చూస్తున్నారట. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న అంశంపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని.. రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలా? అని సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రసాదరావు ఆలోచనలు అన్నీ కుమారుడు, రాజకీయ వారసుడు ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు నాయుడు భవిష్యత్తు చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎలాగూ ఫ్యాన్ పార్టీకి భవిష్యత్ లేదని.. ఒకవేళ ఉన్నా… తన కుమారుడికి జగన్ సీటు ఇవ్వరని తెలిసే… ధర్మాన మౌనంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
కుమారుడ్ని.. ఏ పార్టీలో చేర్పిస్తే రాజకీయంగా నిలదొక్కుంటారని ధర్మాన ప్రసాదరావు ఆలోచిస్తున్నారట. 2024 ఎన్నికల్లో కుమారుడికి శ్రీకాకుళం శాసన సభ టికెట్ ఇవ్వాలని జగన్‌ని అడిగి భంగపడ్డారు ప్రసాదరావు. దాంతో ధర్మానకు ఆ ఆవేదన వెంటాడుతోందంట.ఈ కారణాలు విశ్లేషించుకున్న తరువాతే ధర్మాన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో కొనసాగుతారా? లేక.. వదిలేస్తారా అన్న మీమాంస కొనసాగుతోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా… నేతలు జనంలోకి తిరిగితేనే గుర్తింపు వస్తుంది. అలాంటిది ధర్మాన చాలా కాలంగా మౌనంగా ఉండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
ధర్మాన ప్రసాదరావు మౌనం కొనసాగిస్తున్న కొద్దీ ఆయనపై రకరకాల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ధర్మాన అన్న… మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ కే మళ్ళీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పారు. ధర్మాన కృష్ణ దాస్… ఇప్పటికే మూడు సార్లు జిల్లా వైసిపి అధ్యక్షునిగా కొనసాగటంతో ఆయన స్థానంలో వేరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన కూడా మొదట చేసారట జగన్ మోహన్ రెడ్డి. దానికోసం కొంతమంది జిల్లా నేతల పేర్లు కూడా సెలక్ట్ చేసారట. చివరి నిమిషంలో జిల్లాలోని సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ, కుటుంబ నేపథ్యం వంటి అంశాల నేపథ్యంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కృష్ణ దాస్ కే మళ్ళీ 4వ సారి జిల్లా అధ్యక్షుడిని చేసింది పార్టీ అధిష్టానం.
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని పేరాడ తిలక్, డాక్టర్ అప్పలరాజులతో కలిసి కృష్ణ దాస్… తన తమ్ముడి బంగ్లాకు వెళ్లి కలిసారట. కానీ ప్రసాదరావు ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీ పట్ల గుస్సాగా ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. వయసులో కృష్ణ దాస్ కంటే ప్రసాదరావు చిన్నవాడు అయినా.. ధర్మాన అని గూగుల్ లో వెతికితే ప్రసాదరావు పేరే మొదట వస్తుంది. కృష్ణదాస్ కంటే రాజకీయాలలో అంత సీనియార్టీ సాధించారు ప్రసాదరావు. కాబట్టి కేవలం అన్న కోసం తన రాజకీయ వ్యూహాలను మార్చుకోడన్న వాదన కూడా ధర్మాన ప్రదరావు సన్నిహితుల నుంచి వినిపిస్తుంది. దానికి తోడు దీపం ఉన్నప్పుడే కుమారుడు రామ్‌మనోహర్ నాయుడు రాజకీయ భవిష్యత్ ను చక్కదిద్దాలన్న ఆలోచన కూడా ప్రసాదరావు మదిలో ఉందట.
Also Read: మనవాడికో మాట, పగవాడికో మాటా? ఇది అల్లు అర్జున్‌కు వర్తిస్తుందా అంబటి?
పార్టీ ఓడిన నాటి నుంచి ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఆరోగ్యం బాగాలేదని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాని ప్రసాదరావు సన్నిహితులు చెబుతున్నారు. కానీ జగన్ వ్యవహార శైలి కూడా ధర్మాన ప్రసాదరావు మౌనానికి కారణమన్న వాదన వినిపిస్తుంది.. పార్టీ నుంచి చాలామంది బయటకి వెళ్ళి పోవడానికి కూడా జగన్ వ్యవహారం తీరే కారణమంటున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడ జగన్‌లో మార్పు రాకపోవడం ..వైసీపీ పరిస్థితిపై కేడర్‌లో నమ్మకం తగ్గడం కూడా ధర్మానను ఆలోచనలో నెట్టిందనే వాదన కూడా జిల్లా వ్యాప్తంగా వినిపిస్తుంది. మరోవైపు ధర్మాన ప్రసాదరావు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబంతో కలిసి దేవాలయాలకు వెళుతున్నారు. దీంతో ధర్మాన తన కుమారుడ్ని రాజకీయల్లో యాక్టివ్ చేసి…తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.