Visakhapatnam Politics: ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా బొత్స, అమర్‌నాథ్‌లేకీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎందరో నేతలు, పార్టీలో ఎన్నో పదవులు ఉన్నప్పటికీ ఆ ఇద్దరూ నాయకులదే హవా అంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీమంత్రి కన్నబాబు ఉన్నప్పటికీ విశాఖ జిల్లా వైసీపీ రాజకీయం మాత్రం ఆ ఇద్దరు నాయకుల కనుసన్నల్లోనే నడుస్తోంది. విశాఖ జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్న ఆ నాయకులు ఇద్దరు.. మాజీ మంత్రులు కావడంతో జిల్లా అధ్యక్షులు సైతం.. ఆ ఇద్దరు నాయకులు చెప్పింది చేయక తప్పడం లేదంట.
ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో బొత్స , అమర్నాథ్‌ల పెత్తనం
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైసీపీలో ప్రస్తుతం వైసీపీ రాజకీయాల్లో ఎంతమంది సీనియర్, జూనియర్ నాయకులు ఉన్నా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ల పెత్తనం మాత్రమే కొనసాగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. ఇక గుడివాడ అమర్నాథ్ యువ నాయకుడిగా తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఉమ్మడి విశాఖ జిల్లాలో హవా కొనసాగిస్తున్నారంట. ఉమ్మడి విశాఖ జిల్లాలో వేరే నాయకులకు పార్టీ పదవులు ఉన్నప్పటికీ వైసీపీలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈ ఇద్దరు మాత్రమే పార్టీ రాజకీయాల్ని నడిపిస్తున్నారని సొంత పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ
ఉమ్మడి విశాఖ జిల్లాలో హవా కొనసాగిస్తున్న మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌లలో బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా చక్రం తిప్పారు. విజయనగరం జిల్లా నుండి రాజకీయాలు మొదలుపెట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసిన అనుభవంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్ర రీజియన్ మొత్తంలో ఆయనకంటూ ప్రత్యేకమైన పలుకుబడి ఉండడంతో బొత్స తన రాజకీయ ప్రయాణాన్ని ఎక్కడి నుంచైనా నడిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
విజయనగరం జిల్లా నుంచి విశాఖ రాజకీయాల్లో అడుగుపెట్టిన బొత్స
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన నేరుగా విశాఖ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఎమ్మెల్సీగా, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ విశాఖ, విజయనగరం రాజకీయాల్లో ప్రత్యక్షంగా శ్రీకాకుళం జిల్లాలో తన అనుచరుల ద్వారా పరోక్షంగా తన పెద్దరికాన్ని చెలాయిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలకమైన రాజకీయ నాయకుడిగా, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన నేతగా మారిపోయారు.
జగన్‌కి నమ్మకస్తుడిగా పేరున్న గుడివాడ అమర్ నాథ్
ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై వైసీపీ అధిష్టానానికి ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఎనలేని నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సీనియర్లను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అమర్నాథ్‌ను మంత్రిని చేసి విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా నిలబెట్టారు జగన్. 2024 ఎన్నికల్లో అనకాపల్లి టికెట్ నిరాకరించి, చివరి వరకు అమర్‌నాథ్ అసలు ఎమ్మెల్యే సీటు ఉందా లేదా అని చర్చ కొనసాగినా చివరి నిముషంలో ఆయనకు జగన్ గాజువాక టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత విభజిత విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్‌ను నియమించారు.
గుడివాడని అనాకాపల్లి జిల్లాకు పంపించిన జగన్
పార్టీ పదవుల పంపకాల్లో గుడివాడ అమర్నాథ్ ను మళ్లీ అనకాపల్లి జిల్లా రాజకీయాల్లోకి పంపాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కేకే రాజుకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు యువ నాయకుడుగా అందరికీ సుపరిచితుడు కావడంతో గుడివాడ అమర్నాథ్ కేవలం అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం తన హవా మాత్రం నడిపిస్తూనే ఉన్నారు. మంత్రిగా పనిచేసిన సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కలియ తిరగడంతో పాటు, నాయకులందర్నీ తన చట్టూ తిప్పుకున్న గుడివాడ అమర్నాథ్ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో పట్టు సాధించగలిగారు.
డమ్మీగా మారిన వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు
ఉమ్మడి విశాఖ జిల్లాలో బొత్స సత్యనారాయణ ఒకపక్క, గుడివాడ అమర్నాథ్ మరోపక్క పట్టు సాధించి పెత్తనం చెలాయిస్తుంటే ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు కేవలం పదవి అలంకార ప్రాయం అన్నట్లు వ్యవహరిస్తూ డమ్మీగా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. బొత్స లాంటి బిగ్ షాట్ అన్ని తానై వ్యవహరిస్తున్న విశాఖ జిల్లాలో తనకు వాల్యూ లేకుండా పోయిందని కన్నబాబు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
విజయసాయి, వైవీల తరహాలో పవర్ చూపించలేకపోతున్న కన్నబాబు
దానికి తోడు గుడివాడ అమర్నాథ్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో కురసాల కన్నబాబు అవసరం కూడా విశాఖ జిల్లా వైసీపీకి లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లుగా కొనసాగిన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు పార్టీ పరంగా ఉన్న పవర్, పలుకుబడి కొరసాల కన్నబాబుకు లేకపోవడంతో.. జిల్లా వైసీపీ నాయకులు కూడా బొత్స, గుడివాడల చుట్టూనే తిరుగుతున్నారంట.
మాజీమంత్రులను కాదనలేని స్థితిలో ఉన్న కేకే రాజు
ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా కేకే రాజును నియమించింది వైసీపీ అధిష్టానం. ఇప్పటివరకు విశాఖ రాజకీయాల్లో తమకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లను సమన్వయం చేసుకుంటూ కేకే రాజు జిల్లాలో వైసీపీ నాయకులను ముందుకు తీసుకుని వెళ్లాలి. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా వెళ్లిపోయినా, వైసీపీలో తనకున్న పలుకుబడితో విశాఖ రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నారు.
పవర్ చూపించ లేకపోతున్న కన్నబాబు
ఇప్పటివరకు విశాఖ నార్త్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జిగా కొనసాగిన కేకే రాజు ప్రస్తుతం వైసీపీ అధిష్టానం నిర్ణయంతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వారం రోజులే అయింది. విశాఖ జిల్లాలో గుడివాడ అమర్నాథ్ హవా కనిపిస్తుండటంతో కేకే రాజు ఎవర్నీ కాదనలేని స్థితిలో ఉన్నారంట. పార్టీ బాధ్యతలను అధిష్టానం ఎంత మందికి అప్పజెప్పినా విశాఖ జిల్లాలో మాత్రం బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్‌ల పెత్తనమే నడుస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు. మొత్తానికి బొత్స, గుడివాడల పెత్తనం అలా నడిచిపోతోంది.