Longest Vande Bharat Sleeper Journey: భారతీయ రైల్వే రూపు రేఖలు మార్చిన రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందిన ఈ సెమీ హైస్పీడ్ రైలు.. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. అత్యంత వేగం, ఆధునిక సదుపాయాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 135కు పైగా వందేభారత్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. త్వరలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్ వెర్షన్ వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. ఒకేసారి దేశ వ్యాప్తంగా 10 సర్వీసులను ప్రారంభించేలా రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు కూడా రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయి. ఇక ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లలో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏది? ఎన్ని కిలో మీటర్లు జర్నీ చేస్తుంది? ఎన్ని గంటల ప్రయాణ సమయం పడుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే రైలు
దేశంలో అత్యంత దూరం ప్రయాణించే వందేభారత్ స్లీపర్ రైలుగా ఢిల్లీ- చెన్నై వందేభారత్ స్లీపర్ రైలు గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ రైలు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి MGR చెన్నై సెంట్రల్ మధ్య నడపాలని భావిస్తున్నారు. హజ్రత్ నిజాముద్దీన్-చెన్నై-హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ స్లీపర్ రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో తర్వాత ఈ మార్గంలో అందుబాటులోకి వచ్చిన మూడవ ప్రీమియం రైలుగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. న్యూఢిల్లీ- చెన్నై వందే భారత్ స్లీపర్ రైలు ఏకంగా 2,174 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు గంటకు 160 కి.మీ నుంచి 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ రైలు తన గమ్య స్థానాన్ని చేరుకునేందుకు సుమారు 27 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ఢిల్లీ- GMR చెన్నై సెంట్రల్ స్లీపర్ రైలు షెడ్యూల్
ఢిల్లీ- చెన్నై వందే భారత్ స్లీపర్ రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలోఈ రైలు చెన్నై నుంచి ఉదయం 07:05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09:00 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణం
ఢిల్లీ- MGR చెన్నై సెంట్రల్ వందే భారత్ స్లీపర్ రైలు ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చెన్నైకి బయల్దేరే ఈ రైలు ఆగ్రా కాంట్, గ్వాలియర్, వి లక్ష్మీబాయి జెహెచ్‌ఎస్, భోపాల్, నాగ్ పూర్, బల్హర్షా, వరంగల్, విజయవాడ జంక్షన్ తో సహా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
ఢిల్లీ- చెన్నై వందే భారత్ స్లీపర్ టికెట్ ధర
ఢిల్లీ నుంచి చెన్నై వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 11 AC 3 టైర్ కోచ్‌లు, 4 AC 2 టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ క్లాస్ AC కోచ్ ఉంటుంది. AC 3-టైర్ కోచ్ లో టికెట్ ధర దాదాపు రూ. 4300, AC 2-టైర్ కోచ్ టికెట్ ధర రూ. 5800, AC ఫస్ట్ క్లాస్ టికెట్ ధర దాదాపు రూ. 7200 ఉంటుందని అంచనా. త్వరలో అధికారికంగా వివరాలు వెల్లడికానున్నాయి.
Read Also: విస్టాడోమ్ రైల్లో సఫారీ జర్నీ.. ఎంజాయ్ చేద్దాం పదండి బ్రో!