Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై వైసిపి పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది.. రుషికొండకు సంబంధించి నిన్న మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం వైసీపీ అధ్యక్షుడితో పాటు, నాయకులపైన ఎన్ని విమర్శలు చేసిన వారు సైలెంట్ గా గడిపేశారు.. పార్టీ అధినేత ఆలోచనో లేదా నాయకుల సొంత నిర్ణయాలో తెలియదు కానీ వాయిస్ పెంచుతున్నారు. రిషికొండ ప్యాలెస్ ను ముందు పెట్టి వైసీపీపై ముప్పేట దాడి చేస్తున్న కూటమి పార్టీలను రుషికొండ ప్యాలెస్ వినియోగంఫై సలహాలిస్తూనే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకునే ఆలోచనను ఆయుధాలుగా మలుచుకుని వైసీపీ వాయిస్ పెంచి రివర్స్ కౌంటర్ ఇస్తుంది.. కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న రిషికొండ ప్యాలెస్, మెడికల్ కాలేజీలను ఆయుధాలుగా మార్చుకోవడం వెనక వైసీపీ ప్లాన్ ఏంటి?
రుషికొండపై ఎదురు దాడి మొదలుపెట్టిన వైసీపీ
రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ దానిపై క్రియాశీలక పోరాటం చేయడం స్టార్ట్ చేసింది.. ఇప్పటివరకు కూటమి నాయకుల మీదే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన పార్టీ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటం చేసి ప్రజల్లో మనుగడ సాగించడానికి వాయిస్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్‌లకే ఎక్కువగా పరిమితం కావడం, కేవలం పరామర్శలు, ఫంక్షన్లకు అటెండ్ అవుతుండడంతో వైసిపి నాయకుల్లో కూడా కొంత నిరుత్సాహం కనిపిస్తూ వచ్చింది..
రైతు సమస్యలపై ఆందోళనల్లో మాత్రమే కనిపించిన జగన్
ఇలాగే ఉంటే మళ్లీ వైసీపీ పార్టీని 2019 కి ముందు ఉన్నట్లు లైన్లో పెట్టడం కష్టం అనుకున్నారో ఏమో తెలియదు గానీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వాయిస్ పెంచి యుద్ధం ప్రకటిస్తున్నట్లు వైసీపీ చేపడుతున్న ఆందోళన బట్టి తెలుస్తోంది. ఇప్పుడు వరకు కేవలం పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రమే మామిడి, మిర్చి రైతులు మద్దతు ధరలపై నేరుగా ఆందోళనల్లో పాల్గొనడం.. విద్యార్థుల పక్షాన ఫీజు పోరు, తల్లికి వందనం లాంటి పార్టీ కార్యక్రమాలకు జగన్ పిలుపునిచ్చినా జిల్లాల్లో నాయకులు మాత్రమే పాల్గొని ఆందోళనలు నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా వైసిపి అధ్యక్షుడు జగన్‌తో పాటు పార్టీ నాయకులు గట్టిగా గళం విప్పి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.
రుషికొండ ప్యాలెస్‌ను ఎత్తిచూపుతూ వైసీపీపై విమర్శలు
ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ నిర్మాణాలను ఎత్తిచూపుతూ కూటమి నేతలు తీవ్రస్థాయిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పైన, పార్టీ నాయకులు పైన విమర్శలు చేస్తూనే వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న ఇప్పటికీ కూడా రుషికొండ ప్యాలెస్ పై కూటమి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా.. ఇప్పటివరకు వైసీపీలో ఏ ఒక్కరు కూడా గట్టిగా వాయిస్ వినిపించి తిప్పి కొట్టే ప్రయత్నం చేయలేదు..
జగన్ సొంతగా వాడుకోవడానికి ప్యాలెస్ నిర్మించారని ఆరోపణలు
విశాఖ రాజధాని అయితే రిషికొండ ప్యాలెస్ లో సీఎం హోదాలో జగన్ ఉంటారు, జగన్ సోంతానికి వాడుకోవడానికి 500 కోట్లతో ప్యాలస్ లు నిర్మించుకున్నారని కూటమి జోరుగా విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను వైసీపీ తిప్పి కొట్టలేకపోయింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో మళ్లీ రాజకీయం రుషికొండ ప్యాలెస్ చుట్టూ తిరగడం మొదలైంది.. ఇప్పటికే రిషికొండ ప్యాలెస్ ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో పరిశీలించారు. రెండోసారి రిషికొండ భవనాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని నాణ్యత లేకపోవడంతో భవనాల పెచ్చులు ఊడిపోతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో మళ్లీ రుషికొండ రాజకీయం ఏపీ రాజకీయాల్లో మొదలైంది.
ప్రస్తుతం ఎదురుదాడికి సిద్దమైన వైసీపీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు రిషికొండ ప్యాలెస్‌ను బూచిగా చూపిస్తూ వైసీపీపై మాటల దాడి చేస్తూనే ఉంది.. అయినా మొదటి నుంచి కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపించినా, ప్రస్తుతం ఎదురుదాడి చేయడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది… వైసిపిలో ఆ పార్టీ ఓటమి తర్వాత ఏ పని మొదలు పెట్టాలన్నా ఎలాంటి విమర్శ చేయాలన్నా, కొన్ని నిర్ణయాలను ప్రజలకు, నాయకులకు చేరవేసే విధంగా చెప్పాలన్న ఠక్కున గుర్తొచ్చే ఒకే ఒక్క నాయకుడు మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ… బొత్స రిషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వానికి ఘాటుగానే కౌంటర్ ఇస్తూ భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చి ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో లాంటి సలహాలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో బొత్స సలహాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్‌ను రెండోసారి పరిశీలించి, అధికారులతో రివ్యూ నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి రిషికొండ ప్యాలెస్ వినియోగంలోకి తీసుకు రావడంపై కొన్ని సిఫార్సులు కూడా చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాలను పరిశీలించి పెచ్చులు ఊడిపోతున్నాయి అని విమర్శలు చేశారో లేదో క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావడానికి ముగ్గురు మంత్రులతో కూడిన ఉప సంఘాన్ని నియమించి రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేయడంతో పాటు అసెంబ్లీలో చర్చించి ఏక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసింది.. ఇప్పటివరకు కూటమికి ఆయుధంగా మారిన రిషికొండ ప్యాలెస్ భవనాల వినియోగంలోకి తీసుకొచ్చే అంశాన్ని వైసీపీ మెయిన్ టార్గెట్ గా తీసుకుని తన వాయిస్‌ని రైస్ చేసే పనిలో పడింది
మెంటల్ ఆస్పత్రిగా మార్చాలని అశోక్‌గజపతి సూచన
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రిషికొండ ప్యాలెస్‌ని ఎలా వినియోగంలోకి తీసుకురావాలనే అంశంపై తీవ్రస్థాయిలో విమర్శలపర్వం కొనసాగుతున్న తరుణంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు రుషికొండ ప్యాలెస్ ను మెంటల్ హాస్పిటల్‌గా మారిస్తే బెటర్ అనే సూచన చేశారు.. 450 కోట్లతో నిర్మించిన భవనాలు వృధాగా వదిలేసే బదులు మెంటల్ హాస్పిటల్ గా మార్చి రిషికొండ ప్యాలెస్ ను నిర్మించిన వాళ్లను దానిలో ఉంచితే సరిపోతుందని రాజకీయ విమర్శలు చేశారు. జగన్ ఆ భవనాలను నిర్మించే బదులు ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి పథకం పూర్తి చేసి ఉంటే ప్రజలకు మంచి నీటిని అందించే అవకాశం ఉండేదని, కానీ గత ప్రభుత్వం అలా చేయలేదని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.
అశోక్ వ్యాఖ్యలపై బొత్స సత్తిబాబు కౌంటర్
గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజు రాజకీయాలు ఎలా మాట్లాడుతారంటూ మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు… రిషికొండ భవనాలను మెంటల్ హాస్పటల్ గా మార్చాలని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్లకే మతిస్థిమితం సరిగ్గా లేనట్లు ఉందని బొత్స తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు గవర్నర్ హోదాలో ఉండి రాజకీయాలు మాట్లాడొచ్చా అని ప్రశ్నిస్తూనే, 450 కోట్లతో నిర్మించిన భవనాలు పెచ్చులుడుతున్నాయని పవన్ కళ్యాణ్ చేత ఎత్తి చూపించే బదులు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ని, ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారు.. రిషికొండ భవనాలకు ఏ ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించారో కూడా బయట పెట్టాలని బొత్స ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు..
తెరపైకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం
కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు రిషికొండ భవనాలను ఎలా వినియోగంలోకి తీసుకురావాలో అర్థం కావడం లేదని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు.. రిషికొండ భవనాలను ఖాళీగా ఉంచే బదులు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి ఇస్తే సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని వాయిస్ పెంచి మరి ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న ఎంతోమంది రిషికొండ ప్యాలెస్‌పై ఫంక్షన్లు చేయడం వల్ల భారీగా ఆదాయం వస్తుంది అని, ప్రతి సంవత్సరం రిసార్ట్స్ నుండి 8 కోట్ల ఆదాయం వచ్చేది అని పదే పదే చెప్పే కూటమి ప్రభుత్వం తాను ఇచ్చే సలహాలు పాటిస్తే 25 కోట్లు ఆదాయం వస్తుందని సలహాతో.. ప్రభుత్వ విమర్శలకు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.
Also Read: చంద్రగ్రహణం రోజు అఘోరాల పూజలు.. విరుగుడుగా శాంతి పూజలు
రిషికొండ ప్యాలెస్ మీద వైసీపీ వాయిస్ పెంచుతున్న సమయంలోనే రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం ఫోకస్ అవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వైసిపి అన్ని వైపుల నుండి ముప్పేట దాడి చేసి టిడిపిని ఇరకటంలో పెట్టడానికి వాయిస్ పెంచి మరి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న వైసిపి తన వ్యవహార శైలిని మార్చుకుని ముందు ముందు వాయిస్‌ని ఇదేవిధంగా రైజ్ చేస్తుందో లేదా ప్రారంభించి తర్వాత చూసుకుందాంలే అనుకున్నట్లు వదిలేస్తుందో వేచి చూడాలి.
Story By vamshi Krishna, Bigtv