BigTV English
Advertisement

Bihar elections: సీఎం అభ్యర్థి నితేశ్! బీహార్‌లో బీజేపీ ప్లాన్ అదేనా?

Bihar elections: సీఎం అభ్యర్థి నితేశ్! బీహార్‌లో బీజేపీ ప్లాన్ అదేనా?

Bihar elections: నరేంద్రమోడీ పీఎం.. నితీశ్ కుమార్ సీఎం.. ఇందులో మార్పు ఉండదు అంటూ.. బీహార్ గడ్డ మీద అమిత్ షా చెప్పిన డైలాగ్.. ఇండియన్ పాలిటిక్స్‌లో రీసౌండ్‌లో వినిపిస్తోంది. అసలు.. బీహార్‌లో నితీశ్ కుమార్‌నే సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎందుకు చెబుతోంది? వయసు మీద పడినా.. పాలనపై విమర్శలు, జనంలో వ్యతిరేకత, స్కాముల ఆరోపణలున్నా.. నితీశ్‌నే పోస్టర్ బాయ్‌గా బీజేపీ ఎందుకు చూపుతోంది?


బీహార్ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు:

ఇండియా పొలిటికల్ అటెన్షన్ అంతా.. ఇప్పుడు బీహార్ వైపే ఉంది. ఈసారైనా.. అక్కడ సర్కార్ మారుతుందా? నితీశ్ కుమార్ ప్రభుత్వానికే ప్రజలు మళ్లీ పట్టం కడతారా? అనే సస్పెన్స్ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఢిల్లీ లెవెల్ లీడర్లు బీహార్ గడ్డ మీద చేసే కామెంట్లు.. అక్కడి రాజకీయం కొత్త టర్న్ తీసుకునేలా చేస్తాయ్. ఎన్నికల ర్యాలీలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. రాజకీయాల్లో ఖాళీ సీట్లు లేవని.. నరేంద్రమోడీ పీఎంగా, నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారని.. అమిత్ చేసిన స్టేట్‌మెంట్.. బీహార్ సహా మిగతా స్టేట్స్‌లోనూ డిబేట్‌కు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో.. ఎన్డీయే క్లీన్ స్వీప్ చేయాలని ఓటర్లను కోరారు అమిత్ షా.

బీజేపీ నితీశ్‌నే సీఎం అభ్యర్థిగా ఎందుకు చెబుతోంది?

ఇప్పుడు నడుస్తున్న చర్చంతా ఒకటే. అసలు.. నితీశే సీఎం అభ్యర్థి అని బీజేపీ ఎందుకు చెబుతోంది? ఆయనకు వయసు మీద పడింది. నితీశ్ సుదీర్ఘ పాలనపై ఎన్నో విమర్శలున్నాయ్. జనంలో వ్యతిరేకతతో పాటు ఆయన హయాంలో స్కాములు జరిగాయనే ఆరోపణలున్నాయ్. అయినా సరే.. నితీశ్ కుమార్‌నే బీజేపీ నెక్ట్స్ సీఎంగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇందుకు.. అనేక కారణాలు కనిపిస్తున్నాయ్. ఇది.. ఎన్డీయే కూటమికి అనివార్యమైన రాజకీయ అవసరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా.. నితీశ్ కుమార్‌కు ఉన్న అతిపెద్ద బలం.. ఈబీసీ ఓట్ బ్యాంక్. అత్యంత వెనుకబడిన తరగతులు, మహాదళిత్‌ల మద్దతు ఆయనకు పుష్కలంగా ఉంది. ఈ వర్గాలే.. బీహార్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నాయి. బీజేపీ తన సంప్రదాయ ఓట్ బ్యాంకుతో పాటు, నితీశ్ ద్వారా ఈ కీలకమైన ఈబీసీ ఓట్లను తమ వైపు ఆకర్షించాలని చూస్తోంది. అందువల్ల.. నితీశ్ కుమార్ నాయకత్వాన్ని గనక తిరస్కరిస్తే.. ఆయన మరోసారి కూటమి మారతారేమోనన్న ఆందోళన బీజేపీ నాయకత్వంలో కనిపిస్తోంది. ఎందుకంటే.. గతంలో రెండు సార్లు నితీశ్ బీజేపీని వీడారు. కూటమి విచ్ఛిన్నం కాకుండా.. స్థిరంగా ఉంచేందుకు.. నితీశే నెక్ట్స్ సీఎం అని.. ఆయన తర్వాతే తామని చెప్పడం తప్పనిసరి అవుతోంది.


నితీశ్ కుమార్ సుదీర్ఘ పాలనపై అనేక విమర్శలు:

మరోవైపు.. నితీశ్ కుమార్‌ని.. బీహార్ ప్రజలు ఇప్పటికీ.. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలోని జంగిల్ రాజ్‌కు పూర్తి విరుద్ధంగా చూస్తారు. దాదాపు.. రెండు దశాబ్దాలుగా బీహార్‌కు పాలనా స్థిరత్వాన్ని ఇచ్చింది నితీశ్ నాయకత్వమే. ప్రతిపక్ష.. మహాఘట్‌బంధన్.. యువ నాయకుడు తేజస్వి యాదవ్‌ని సీఎం అభ్యర్థిగా బరిలో నిలిపినప్పుడు.. ఆయనకు వ్యతిరేకంగా.. అనుభవజ్ఞుడైన, అవినీతి మరకలు లేని నితీశ్‌ని నిలబెట్టడం బీజేపీకి సులభమవుతుంది. పాలనా స్థిరత్వం వర్సెస్ అరాచకత్వం అనే నినాదాన్ని.. జనంలోకి తీసుకెళ్లడానికి.. నితీశ్ కంపల్సరీ అవుతారనే చర్చ జరుగుతోంది. కానీ.. ఇక్కడంతా ఒప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే.. నితీశ్ కుమార్‌కు వయసు మీద పడింది. ఆయన పాలనపై ఇప్పుడు విమమర్శలు వినిపిస్తున్నాయ్. జనంలోనూ.. జేడీయూ హాయాంపై వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమే. అయితే.. ఈ వ్యతిరేకతను.. బీజేపీ తనపై పడకుండా చూసుకునేందుకే.. నితీశ్‌ని ముందుంచుతోందనే వాదన వినిపిస్తోంది. నితీశే సీఎం అభ్యర్థిగా ఉంటే.. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు ఆయన మీదకు, ఆయన పార్టీ జేడీయూ మీదకే ఎక్కుపెడతారు. దీని ద్వారా.. బీజేపీ కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. పైగా.. ఈ వ్యతిరేకతని అధిగమించేందుకు.. బీజేపీ తరచుగా డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్‌ని హైలైట్ చేస్తూ వస్తోంది. నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, నితీశ్ నాయకత్వంలోని బీహార్ పాలనని కలిపి.. డబుల్ ఇంజిన్ సర్కార్ చేపట్టిన ప్రోగ్రెస్‌గా ప్రచారం చేస్తోంది. దాంతో.. నితీశ్‌పై వ్యతిరేకత ఉన్నా.. మోడీ ఇమేజ్‌తో దాన్ని అధిగమించాలని చూస్తోంది.

బీహార్‌లో సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ని బీజేపీ ప్రొజెక్ట్ చేయడం వెనకున్న రాజకీయమేంటి? ఇదంతా.. పొలిటికల్ స్ట్రాటజీనా? లేక.. సామాజిక సమీకరణాలని ప్రభావితం చేసే ఆలోచనా? లేక.. నితీశ్‌కి ఉన్న గుడ్ గవర్నెన్స్ ఇమేజా? అసలు.. నితీశ్ నుంచి బీజేపీ ఆశిస్తున్నదేంటి?

నితీశ్ కుమార్ పాలనపై జనంలో పెరిగిన వ్యతిరేకత:

కొన్ని రోజుల కిందటి వరకు.. బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ఎన్నికలు నితీశ్ నాయకత్వంలో జరుగుతాయి. సీఎంని.. ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారనే ద్వంద వైఖరిని అవలంబించింది. కూటమి భారీ మెజారిటీ సాధించి.. బీజేపీకి అత్యధిక సీట్లు వస్తే.. ఎన్నికల తర్వాత బీజేపీ తమ సొంత నాయకుడిని సీఎం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయ్. కానీ.. ఇప్పుడు బీజేపీ స్వరం మారింది. నితీశ్ కుమార్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా.. కూటమిలో చీలిక రాకుండా, ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. పైగా.. బీహార్‌లో నితీశ్ కుమార్‌కు.. మంచి పాలన అందించిన నాయకుడిగా.. సుశాసన్ బాబు అనే ఇమేజ్ ఉంది. నితీశ్ పాలనలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, ఎంతో కొంత అభివృద్ధి జరిగిందనే నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ.. ఈ ఇమేజ్ ఇప్పుడు అంత స్ట్రాంగ్‌గా లేదనే చర్చ జరుగుతోంది. దాదాపు 20 ఏళ్ల పాటు నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగటం వల్ల.. ప్రజల్లో సహజంగానే కొంత పాలనపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు బీహార్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల.. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటుగా.. నితీశ్ నాయకత్వాన్ని ముందుంచడమే బెటరని బీజేపీ భావించి ఉండొచ్చంటున్నారు.

నితీశ్ కుమార్‌కు వయసు మీద పడిందనే కామెంట్లు:

గతంలో.. నితీశ్ కుమార్ నాయకత్వంలోనే.. ఎన్డీయే కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. కూటమి విజయం కోసం, ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటుని.. నితీశ్ వైపు మళ్లించే వ్యూహం కూడా అయి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే.. కొన్ని వర్గాలు నితీశ్‌పై వస్తున్న సహజ వ్యతిరేకతని, వయసు మీద పడటం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని.. ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి సీఎంను ఖరారు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. కూటమిని సమష్టిగా ముందుకు నడిపించడంలో.. నితీశ్ కుమారే కీలకంగా ఉన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే.. నితీశ్ కుమార్ పర్సనల్ ఇమేజ్ బలహీనపడినా.. బీహార్‌లోని కీలకమైన ఓట్ బ్యాంకుని నిలుపుకునేందుకు.. రాజకీయ స్థిరత్వం కోసం బీజేపీకి ఆయన తప్పనిసరిగా కావాలి.

నితీశ్- చిరాగ్ మధ్య పాత వైరుధ్యాలు:

ఇక.. బీహార్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, వలసలు కొనసాగడం లాంటి సమస్యల వల్ల.. యువ ఓటర్లు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. యువ నాయకుడు తేజస్వి యాదవ్.. భారీగా ఉద్యోగాలు, మార్పును తెస్తాననే హామీలు.. వారిపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీనికితోడు.. నితీశ్ కుమార్ తరచుగా కూటములను మార్చడం వల్ల.. ప్రతిపక్షాలు ఆయన్ని.. పల్టూ రామ్ అని విమర్శిస్తున్నాయ్. ఇది.. ఆయన విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు నితీశే సీఎంగా ఉంటారనే అమిత్ షా ప్రకటన కూడా.. కూటమిలో అంతర్గత అనిశ్చితి రేకెత్తించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. చిరాగ్ పాశ్వాన్‌‌కు చెందిన ఎల్జేపీ పార్టీ బలం పెరిగింది. నితీశ్-చిరాగ్ మధ్య పాత వైరుధ్యాలు కూటమి సమన్వయాన్ని దెబ్బతీయొచ్చనే చర్చ జరుగుతోంది.

ఓటర్లని కూడగట్టే ఆలోచనా?

మరోవైపు.. బీహార్‌లో యాదవులు, ముస్లింలు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఉన్న కూటమికి మద్దతుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. బీహార్‌ని గెలవాలంటే.. ఆ రెండూ కాకుండా బలమైన ఓట్ బ్యాంక్ కావాలి. నితీశ్ కుమార్ తన పాలన ద్వారా.. ఈబీసీలు, మహిళా ఓటర్ల మద్దతుని కూడగట్టుకన్నారు. ఈ ఓట్ బ్యాంక్ బీజేపీకి లేదు. బీహార్‌లో విజయం సాధించాలంటే.. ఎన్డీయే కూటమికి ఈ రెండు వర్గాల ఓట్లు చాలా కీలకం. అందువల్ల.. కూటమి ఐక్యతని ప్రదర్శించేందుకు.. నితీశ్ నాయకత్వాన్ని బలపరుస్తోంది బీజేపీ. అమిత్ షా స్టేట్‌మెంట్‌తో.. ఈ సందేశం బీహార్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అంతేకాదు.. మహాఘట్‌బంధన్.. నితీశ్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా.. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందనే విమర్శల్ని తిప్పికొట్టేందుకు కూడా.. ఈ ప్రకటన పనిచేస్తుందని బీజేపీ భావించి ఉండొచ్చు. మరీ.. ముఖ్యంగా తేజస్వి యాదవ్ మార్పు నినాదంతో ప్రచారం చేస్తున్నారు. అందువల్ల.. అతన్ని ఎదుర్కొనేందుకు.. పరిపాలనలో అనుభవం ఉన్న నితీశ్ కుమార్ కంటే.. బెటర్ ఫేస్ ఎన్డీయేకు మరొకటి లేదు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గనక ఎక్కువ సీట్లు వస్తే.. నితీశ్‌ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి.. అధికారాన్ని, కూటమిపై పట్టును కొనసాగించొచ్చనే ఆలోచన కూడా బీజేపీ ఉండొచ్చు. మొత్తంగా.. నితీశ్ కుమార్ ఓట్ బ్యాంకుని ఉపయోగించుకొని.. ఎన్నికల్లో విజయం సాధించడం, తర్వాత కూటమిలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసమే.. బీజేపీ నితీశ్ కుమార్‌ని సీఎంగా ప్రొజెక్ట్ చేస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది.

Story by Anup, Big Tv

Related News

Azharuddin: అజార్‌కు మంత్రి పదవి.. అందుకేనా!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

IMD : IMD ఏంటిది! ముంచేసిన మెుంథా

DCC President Post: సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు ఎవరు?

Srikakulam: ధర్మాన, తమ్మినేని స్కెచ్ .. జగన్ ఒప్పుకుంటాడా?

AB Venkateswara Rao: ఏబీవీపై.. చంద్రబాబు ప్లాన్ ఏమిటి?

Jubilee Hills : జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా?

Big Stories

×