DCC President Post: సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకోంది… చాత డంత లిస్టును చూసి కాంగ్రెస్ పరిశీలకులు ఎవరికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారంట.. అసలు ఆ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేలు సెగ్మెంట్లలో హరీష్ రావు, కేసీఆర్ ప్రాభల్యాల వల్ల ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే లేదు.. అలాంటి జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌లో అంత పోటీ ఎందుకు పెరుగుతోంది?
బీఆర్ఎస్ అగ్ర నేతలు కేసీఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పీఠం కోసం భారీగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అంతంత మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ లో పదవుల లొల్లి కి ఏ మాత్రం కొదువ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. డీసీసీ అధ్యక్షుడి నియామకానికి ఏఐసీసీ పరిశీలకురాలుగా ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి రౌతేలా సిద్దిపేట జిల్లాకు వచ్చారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలో 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. జ్యోతి రౌతేలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీలో నాలుగేసి గ్రూపులతో సతమతం అవుతున్న కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్ష పీఠం కోసం ఏకంగా 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో దరఖాస్తుల సంఖ్యను చూసి పరిశీలకురాలే ఆశ్చర్యపోయారట.
గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేట డీసీసీ పీఠం కోసం పోటీ తీవ్రం కావడంతో ఎవరికి ఆ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి వరసగా రెండు సార్లు అధ్యక్ష పదవి చెపట్టడం తో ఈ సారి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన తన కూతురు ఆంక్షారెడ్డిని డిసిసి పీఠం రేస్ లో నిలిపారు. ఇక ధరిపల్లి చంద్రం, తాడురి శ్రీనివాస్ గౌడ్, నాయని యాదగిరి, దేవులపల్లి యాదగిరి, సూర్యవర్మ, గిరి కొండల్ రెడ్డి, పన్యాల శ్రవణకుమార్ రెడ్డి, గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, పూజల హరికృష్ణ, మార్క సతీష్ గౌడ్, బొమ్మల యాదగిరి, తిరుపతి రెడ్డి వంటి నేతలు డిసిసి పీఠం రేసులో ఉన్నారట.
పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డాం.. పార్టీని నిలబెట్టడంలో మా వంతు పాత్ర పోషించాం.. అధికారంలో ఉన్న ఇప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దు అని, తమకు కీలక పదవులు ఇవ్వాల్సిందే అంటూ జిల్లా మంత్రి, ఇంచార్జి మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు, రాష్ర్ట స్థాయి లీడర్ల చూట్టూ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రదీక్షణలు చేస్తున్నారట. ఇప్పుడు సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో ఒక వైపు మంత్రి పొన్నం ప్రభాకర్, మరో వైపు ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చక్రం తిప్పుతుండగా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు సైతం సిద్దిపేట రాజకీయాల్లో తనదైన పాత్ర కోసం తాపత్రయ పడుతున్నారట.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై పలువురు సీనియర్లు ఆసక్తి చూపుతున్నారట.. వీరిలో చాలా మంది నామినేటెడ్ పదవులను కోరుతున్నా, ఒకవేళ అవి లభించకుంటే కనీసం డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని హై కమాండ్‌ను కోరుతున్నారట. దాదాపుగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లకు డిసిసి పదవి దక్కే అవకాశం లేదంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే సీనియర్లకే అవకాశం కల్పించాలని కోరుతున్నారట. నేతల ప్రయత్నాలు ఎలా ఉన్నా ఈసారి డీసీసీ పీఠం బీసీ వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
అదే సమయంలో గత ఐదేండ్లుగా డీసీసీ అధ్యక్షుడిగా తూంకుంట నర్సారెడ్డి కొనసాగుతుండడంతో ఈసారైనా బీసీలకు అవకాశం ఇవ్వాలనే చర్చను కొందరు ముందుకు తెస్తున్నారు. బీసీలకే డీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించాలని భావిస్తే సిద్దిపేట నియోజకవర్గం నుంచి దర్పల్లి చంద్రం, తాడురి శ్రీనివాస్ గౌడ్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట.. ఇక జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన వ్యక్తికే డీసీసీ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.. మొత్తంగా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే జనరల్ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేది హాట్ టాపిక్ గా మారింది.
Story by Vamshi, Big Tv