Navagraha Puja: మన భారతీయ సంప్రదాయంలో గ్రహాల పూజకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ తొమ్మిది గ్రహాలనే నవగ్రహాలు అంటారు. వీటి ప్రవర్తనలు, స్థితిగతులను బట్టి మన జీవితం మీద ప్రభావం చూపుతాయని వేద జ్యోతిష్యం చెబుతుంది. అందుకే వీరిని ఆరాధించడం మన పూర్వికులు ఆచారంగా భావిస్తారు.
ప్రపంచం లోని ప్రతి జీవి గ్రహాల ఆధీనంలో ఉంటాడనే విశ్వాసం ఉంది. సూర్యుడు శక్తికి, చంద్రుడు మనసుకు, కుజుడు ధైర్యానికి, బుధుడు మేధస్సుకు, గురుడు జ్ఞానానికి, శుక్రుడు సుఖసంపదలకు, శని కర్మఫలానికీ ప్రతినిధులుగా భావిస్తారు. ఇక రాహు, కేతువులు మన జీవితంలో అనుకోని మార్పులను తీసుకువస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
నవగ్రహాలు సమన్వయంలో ఉన్నప్పుడు మన జీవన ప్రయాణం సాఫల్యంగా సాగుతుంది. కానీ గ్రహదోషాలు వస్తే ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం. అందుకే గ్రహాలను శాంతింపజేయడానికి, దయాగుణం కలిగించడానికి పూజలు చేస్తారు.
Also Read: Amazon offers: గేమ్ ఆడండి ఐఫోన్ గెలుచుకోండి.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ బంపర్ ఆఫర్
నవగ్రహ పూజ ద్వారా మనలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శని దశ, రాహు-కేతు దోషాలు ఉన్నవారు ఈ పూజ చేయడం వల్ల ఉపశమనం పొందుతారని అంటారు.
మన ఆలయాలలో గర్భగుడి వెలుపల ప్రత్యేకంగా నవగ్రహాల విగ్రహాలను ఏర్పాటు చేస్తారు దానికి కారణం కూడా అదే. భక్తుడు ఆలయానికి వచ్చినప్పుడు మొదట నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, తరువాత స్వామివారిని దర్శించుకోవాలి అనే నియమం ఉంది. దీని అర్థం ఏమిటంటే, ముందు మన జీవితాన్ని ప్రభావితం చేసే శక్తులను సంతృప్తిపరచి, తరువాత దేవుని కటాక్షం పొందాలనే భావన.
నవగ్రహారాధన కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రీయమైనది కూడా. సూర్యుడి ఆరాధన ద్వారా శరీరానికి విటమిన్-డి లభిస్తుంది. చంద్రుడి పూజ ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. శనిగ్రహానికి తైలాభిషేకం చేయడం రక్తప్రసరణ మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అంటే పూర్వికులు పెట్టిన ఆచారాలు కేవలం నమ్మకాలే కాకుండా ఆరోగ్య శాస్త్రానికీ సంబంధించినవే. అందుకే ఆలయాల్లోనైనా, ఇంట్లోనైనా, గ్రహపూజలు చేయడం మన సంస్కృతిలో అతి ముఖ్యమైన ఆచారం.