వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు ఆ లీడర్ల హవా ఒక రేంజ్లో నడిచింది. ప్రత్యర్థులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. ఆ క్రమంలో ఫైర్‌బ్రాండ్‌లు గా ముద్ర వేయించుకున్న వారు అధికారం కోల్పోగానే పార్టీకి దూరంగా ఉంటుండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అంతా తామై చక్రం తిప్పిన వారంతా ఇప్పుడు ఆ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్‌కు నమ్మిన బంట్లుగా పేరున్న ఆ నాయకులు ఎందుకు తమ అధ్యక్షుడి పిలుపుని కూడా పట్టించుకోవడం లేదు? అసలు ఇంతకీ ఎవరా ఫైర్ బ్రాండ్స్?
వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే మొదట గుర్తొచ్చేది మాజీ మంత్రి రోజా, పార్టీలో ఫైర్ బ్రాండ్ గా మొదటి నుంచి పేరున్న ఆర్కే రోజా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 2014 నుంచి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసినా ఆమె దూకుడు తగ్గించలేదు. తర్వాత పార్టీ అధికారంలో ఉన్న అయిదేళ్లు ఆమె ప్రతిపక్షాలపై అంతే దూకుడు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో సంబరాలు చేసుకుంటూ ఇక పవన్ వంతే అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అలాంటి రోజా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరవాత ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు. అటు నగరి నియోజకవర్గానికి, ఇటు పార్టీకి దూరంగా ఉంటూ… అడపా దడపా సోషల్ మీడియలో పోస్టులు పెట్టడం మినహా ఎక్కడా కనిపించడం లేదు. దాంతో మంత్రిగా పార్టీలో చక్రం తిప్పి ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రోజా ఎక్కడ అంటూ సొంత పార్టీ నేతలు సైతం ఆరా తీస్తున్నారు.
వైసీపీలో మరొక ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని. నాలుగు సార్లు గుడివాడలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న కొడాలి నాని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన కొడాలి నాని మీడియాతో ముక్తసారిగా మాట్లాడి నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. సొంత పార్టీ నేతలపై కేసులు నమోదు అవుతున్నా, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, పార్టీ కార్యక్రమాల అమలు విషయంలో కానీ ఎక్కడా కూడా కొడాలి నాని కనిపించలేదు.
అడపాదడపా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరవ్వడం మినహా ఇప్పటివరకు నాని పార్టీ కార్యక్రమాల్లో పార్టి పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కొడాలి నాని పాల్గొనలేదు. టిడిపిపై ఒంటి కాలు మీద లేచే కొడాలి నాని ఎమ్మెల్యేగా ఓటమి చెందగానే నియోజకవర్గంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వీరవిధేయుడిగా పేరున్న ఆయన పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కార్యకర్తలకు అందుబాటులోకి లేకుండా పోయారని సొంత పార్టీ నేతలే గుడివాడ నుంచి తాడేపల్లి వరకు చర్చించుకుంటున్నారు. వైసిపి అధికారంలో ఉండగా అవసరం ఉన్నా లేకున్నా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పదేపదే కలిసే కొడాలి నాని గత కొంతకాలంగా తాడేపల్లి ప్యాలెస్ వైపు సైతం కన్నెత్తి చూడకపోవడం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది .
మాజీ మంత్రి, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సైతం అదే బాటలో పార్టీకి దూరమయ్యారు. తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన అనిల్ కుమార్ యాదవ్ , ఇప్పటివరకు వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు గాని, గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన నరసరావుపేట లోక్‌సభ సెగ్మెంట్ వైపు కాని, సొంత నియోజకవర్గమైన నెల్లూరులో కానీ కనిపించడం లేదు. బాబాయి రూప్‌కుమార్‌యాదవ్‌తో విభేదాలు సొంత నియోజకవర్గంలో నేతలను కలుపుకుని పోకపోవడంతో వంటి వాటితో ఆయనపై నెల్లూరు వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపించింది.
అనిల్ వైఖరికి వ్యతిరేకంగా నెల్లూరులో పలువురు నేతలు వైసీపీకి దూరమయ్యారు. ఆయనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జగన్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్‌ని ఏరి కోరి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఎన్నికల్లో ఓటమి చెందిన నాటి నుంచి అనిల్ యాదవ్ ఎక్కడ ఉన్నారో తెలియక ఆయన అనుచరులు సైతం అయోమయంలో ఉన్నారంట. ఆ మాజీ మంత్రి హైదరాబాద్, చెన్నైల్లో తన సొంత వ్యాపారాల వ్యవహారాల్లో బిజీగా ఉన్నారంటున్నారు స్పాట్ ఇక మరో మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల తర్వాత హాడావుడి చేసినప్పటికీ కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు.
అధికారం ఉన్నా లేకపోయినా వైసీపీపై విమర్శలు చేసేవారిని తనదైన శైలిలో టార్గెట్ చేస్తూ.. మాటల తూటాలు పేల్చే పేర్ని నాని ప్రస్తుతం తనపై అభియోగాలు వస్తున్నా నోరు మెదపడటం లేదు. ఇటీవల రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారంలో పేర్ని నాని కుటుంబ సభ్యులపై సైతం కేసులు నమోదు అయ్యాయి. నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల రైతు సమస్యలపై పోరాటానికి పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చినా, కృష్ణా జిల్లా అధ్యక్షుడి హోదాలో నాని పాల్గొనలేదు. ఆయన కుమారుడు గత ఎన్నికల్లో బందరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పేర్ని కిట్టు కూడా పార్టీ ఆందోళనల్లో అడ్రస్ లేరు. క్యాడర్ మాత్రమే నామమాత్రంగా పాల్గొని మమ అనిపించారు.
Also Read: చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్.. ఆ సమస్యకు చెక్..
నాని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుమారుడిని అభ్యర్థిగా బరిలోకి దించారు. అయితే 24 సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు ఓటమి చెందడంతో అధికార టిడిపికి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కూడా టార్గెట్ అవుతున్నారు. ఇలా మాజీలంతా పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే సైలెంట్ అవ్వడంపై వారి అనుచరులే విమర్శలు గుప్పిస్తున్నారు స్పాట్ మొత్తానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్స్‌గా చెలామణి అయి పార్టీలో చక్రం తిప్పిన వారంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరికి వారు కనుమరుగయ్యారు. పవర్‌లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేనల అధినేతలపై నోరు పారేసుకుని బూతు మంత్రులుగా చెలామణి అయిన సదరు మాజీలు పాల్పడిన అక్రమాలపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆ కేసుల భయంతోనే వారు నోరు మెదపడానికి భయపడుతున్నారని అంటున్నారు.