శ్రీకాకుళం వైసీపీలో సంక్షోభం
గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ మిగిలిన వారిని పక్కన పెట్టడమే దీనికి కారణమని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాంటి బాధిత జాబితాలో దువ్వాడ శ్రీనివాస్ ఇంతవరకూ ఉండగా.. ఇప్పుడు తమ్మినేని సీతారాం కూడా చేరిపోయారని ప్రచారం నడుస్తోంది. ఇటీవల జగన్ నర్సీపట్నం పర్యటనకు వెళ్లినపుడు ప్రతీ జిల్లా నుంచి పార్టీ నేతలు తరలి వెళ్లారు. అందరిలాగే తమ్మినేని సీతారాం వెళ్లినప్పటికీ ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం నుంచి జగన్ పర్యటనకు వెళ్తున్నవారి జాబితాలో జిల్లా పార్టీ సీతారాం పేరు చేర్చలేదని సమాచారం. అందుకే పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారని టాక్.
ధర్మాన బ్రదర్స్ సపోర్ట్ లేకుండా టికెట్ కూడా కష్టమే
తమ్మినేనిని పార్టీలో బలహీనపరిచేందుకే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఆయన పేరు చేర్చలేదని ఫ్యాన్ పార్టీలో ఓ వర్గం పెదవి విరుస్తోంది. నిజంగానే తమ్మినేని సైడ్ చేయడం వెనకలా కృష్ణదాస్ పాత్ర ఉందా? ఏదైనా పొరపాటు జరిగిందా తెలియదు కానీ.. అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోర వైఫల్యానికి కృష్ణదాస్ కుమారుడు కృష్ణచైతన్య తీరే కారణమని విమర్శలు వినిపించాయి. కృష్ణదాస్ మంత్రిగా ఉన్నపుడు కృష్ణచైతన్య అన్ని తానై చూసుకునే వాడు. అప్పట్లో ఆయన జిల్లా ఎమ్మెల్యేల ఫోన్లు కూడా లిప్ట్ చేసేవాడు కాదని ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యవహారశైలితోనే చాలా మంది పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో కినుకు వహించారని ప్రచారం.
పార్టీ ఫ్యూచర్‌ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు
గత ఎన్నికల్లో జరగాల్సిన నష్టం జరిగినా.. ఇప్పటికైనా ధర్మాన ఫ్యామిలీలో మార్పు రావడం లేదని వైసీపీ ద్వితియ శ్రేణి నేతలు మదనపడుతున్నారు. ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ ఇద్దరూ వారి కుమారుల రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారే తప్పా.. పార్టీ ఫ్యూచర్ ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా కృష్ణదాస్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించకపోతే వైసీపీని శ్రీకాకుళంలో మర్చిపోవడమే మంచిదని టాక్ నడుస్తోంది. ఓవరాల్ గా .. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ పై స్థానిక నేతలే గరం గరంగా ఉన్నారన్నమాట. అందులోభాగంగానే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన్ను సైడ్ చేయాలనే స్కెచ్ లు వేస్తున్నారు.