Telangana Politics: వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు.. చిలికి..చిలికి గాలివానలా మారుతున్నాయ్. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న పంచాయితీ.. ఇప్పుడు ఇద్దరు సహచర మంత్రుల మధ్య రాజుకుందనే చర్చ.. పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పంచాయితీ.. ఏకంగా ఏఐసీసీ పెద్దల కోర్టులోకి చేరింది. ఇంతకీ.. ఓరుగల్లు నేతల మధ్య విభేదాలకు రీజనేంటి? సడన్‌గా సీఎం సీన్‌లోకి ఎందుకొచ్చారు? కొండా సురేఖ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోంది?
ఆ మధ్య.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక్కటిగా జట్టుకట్టి.. కొండా ఫ్యామిలీపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు ప్రతిగా.. కొండా మురళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిపై కౌంటర్ ఫిర్యాదు చేసి ఓరుగల్లు పొలిటికల్ సర్కిల్‌లో మరింత హీట్ పెంచారు. పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన అధిష్టానం.. ఇద్దరికీ సర్ది చెప్పడంతో కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. దీంతో హస్తం పార్టీలో నేతల మధ్య పోరుకు ఫుల్‌స్టాప్ పడిందని భావించారు. అయితే.. గత నెలలో భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం విషయంలో.. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య మళ్లీ పంచాయితీ మొదలైంది. మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే నాయినిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో.. నాయిని ఘాటుగా స్పందించారు. దాంతో.. నివురుగప్పిన నిప్పులా తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేల మధ్య వైరం కొనసాగుతోందనే చర్చ జరుగుతోంది.
మంత్రి కొండా సురేఖ పంచాయితీ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను దాటి.. మంత్రి పొంగులేటిపైకి మళ్లింది. వరంగల్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి, తనకు తెలియకుండానే తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని.. మంత్రి కొండా సురేఖ ఫైర్ అవుతున్నారట. తాజాగా మేడారం సమ్మక్క-సారలమ్మల గద్దెల అభివృద్ధి, చుట్టూ ప్రాకారం నిర్మాణానికి.. దాదాపు 72 కోట్లతో దేవాదాయ శాఖ టెండర్లకు పిలుపిచ్చింది. అయితే.. తన శాఖ టెండర్లలో, తనకు తెలియకుండానే మంత్రి పొంగులేటి బిడ్డింగ్‌లో పాల్గొన్నారట. అంతేకాదు.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో టచ్‌లో ఉంటూ టెండర్ వ్యవహారంలో అనుకూలంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీచేస్తున్నారట. ఈ విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు.. మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురావడంతో ఆమె తీవ్రంగా పరిగణిస్తూ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న తన మాటే వినాలని, అధికారులపై పొంగులేటి సీరియస్ కావడంతో.. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని కొండా సురేఖ భావించారట.
సంవత్సరం క్రితం భద్రకాళి ఆలయ అభివృద్ధి పనుల వ్యవహారంలోనూ.. మంత్రి పొంగులేటి తలదూర్చాడని గుర్రుగా ఉన్న మంత్రి కొండా సురేఖ.. ఇప్పుడు తన శాఖ వ్యవహారాల్లో.. తనకు తెలియకుండా మంతనాలు జరపడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారుల ట్రాన్స్‌ఫర్లు, పోస్టింగ్‌ల విషయంలో తలదూర్చి.. తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. మంత్రి పొంగులేటిపై క్రమశిక్షణ కమిటీకి.. కొద్ది నెలల క్రితమే కొండా మురళి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పొంగులేటి తీరుపై ఆగ్రహంగా ఉన్న కొండా ఫ్యామిలీ.. తన శాఖలో కూడా పొంగులేటి అజమాయిషీ చేయడాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారట. అందుకే.. ఢిల్లీ పెద్దల దగ్గరే ఈ వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు.. మేడారం పనుల టెండర్ ఆన్‌లైన్ ప్రక్రియ, టెండర్ వేస్తే సహించరా అంటూ.. కొండా తీరుపై పొంగులేటి సైతం ఫైర్ అవుతున్నారట. టెండర్ వేయడంపై అభ్యంతరం లేదని.. తన శాఖలోని అధికారులపై పెత్తనం చేయడమేంటని గుర్రుగా ఉన్నారట మంత్రి కొండా సురేఖ.
Also Read: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి
గత ఏడాదిన్నర కాలంగా ఇంచార్జ్ మంత్రి హోదాలో తమ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయడమే కాకుండా.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేశారని, తన పరిధిలోని పనుల విషయంలోనూ.. తనకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని పొంగులేటిపై.. కొండా ఫ్యామిలీ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు ఏకంగా తన శాఖలోనే తలదూర్చడంతో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని భావిస్తున్నారట మంత్రి కొండా సురేఖ. ఈ పంచాయతీ ఢిల్లీ పెద్దల వరకూ చేరితేనే.. సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కొండా మురళీ సైతం భావించారట. అయితే.. ఇంతలోనే ఈ ఎపిసోడ్‌లోకి అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో.. సీన్ మొత్తం రివర్స్ అయింది. కొండా, పొంగులేటి మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. లేటెస్ట్ కాంట్రవర్శీతో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న ఎపిసోడ్‌లపై.. అధిష్టానానికి అన్నీ వివరిస్తూ.. పూర్తి నివేదిక పంపారు. ఇప్పటికే.. మేడారం జాతర లోపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పనులపైనా.. వివాదం చేయడంపై సీఎం సీరియస్ అయ్యారు. సీన్‌లోకి సీఎం ఎంట్రీ ఇవ్వడంతో.. కొండా ఫ్యామిలీ కొన్నాళ్లు సైలెంట్ అవుతుందా? లేక.. తమదారిలోనే వెళ్లి ఏఐసీసీ పెద్దలతో ఈ విషయాన్ని తేల్చుకుంటుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.