MLA Anirudh Reddy: అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేన్షల్ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా వరుస వివాదాల్లో ఉంటున్న అనిరుధ్ రెడ్డి మరోసారి ఆన్ స్క్రీన్ కు ఎక్కేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఇతర పార్టీల నుంచి వలసల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో, జడ్చర్ల నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారనే ప్రచారంపై సిట్టింగ్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే కాకుండా, వ్యక్తిగత భద్రత, క్రిమినల్ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.
హాట్ కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ఎర్ర శేఖర్‌కు సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేసిన చరిత్ర ఉందని అనిరుధ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చు అంటూ అనిరుధ్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి కోసం తాను జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాల్సి వస్తుందేమోనని ప్రశ్నించారు. 2022లో కూడా ఎర్ర శేఖర్‌పై తొమ్మిది మర్డర్ కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తితో తాను వేదిక పంచుకోలేనని అనిరుధ్ రెడ్డి అప్పటి పార్టీ ఇన్‌చార్జ్‌కు లేఖ రాసిన సందర్భాలు ఉన్నాయి.
ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అనిరుధ్ రెడ్డి
ఎర్ర శేఖర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే అనిరుధ్ రెడ్డి.. పార్టీకి మోసం చేసి, మూటలు తీసుకుని వెళ్లిన వారికి తిరిగి పార్టీలోకి ఎంట్రీ లేదు అని అనిరుధ్ రెడ్డి కామెంట్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓటమి కోసం ప్రయత్నించిన వారిని తిరిగి చేర్చుకోవడం అంటే, పార్టీ కార్యకర్తలను అవమానించడమే అని ఆయన వాదన. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఆయన చేరికను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
ఎర్రశేఖర్ తో గత కొన్నేళ్లుగా విభేదాలు
అనిరుధ్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎర్ర శేఖర్ వంటి నేత తిరిగి పార్టీలోకి వస్తే, అది జడ్చర్లలో తన ఆధిపత్యాన్ని, పట్టును సవాలు చేస్తుందనేది శేఖర్ వర్గీయుల వాదన. ఎర్ర శేఖర్ చేరిక భవిష్యత్తులో తనకు ఎమ్మెల్యే టికెట్‌కు తీవ్ర పోటీని సృష్టించవచ్చు అనేది ఓ కారణమని చెబుతున్నారు. హత్య ఆరోపణలు, ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్ర ఉన్నవారికి కాంగ్రెస్‌లో చోటు ఉండకూడదని, అప్పుడే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందని అనిరుధ్ రెడ్డి వాదిస్తున్నారు.
అనిరుధ్ వ్యాఖ్యలపై హైకమాండ్ రియాక్ట్ అవుతుందా?
ఓవరాల్ గా అనిరుధ్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలకలం సృష్టించాయి. ఒకవైపు బీఆర్ఎస్‌ను బలహీనం చేసేందుకు వలసలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నుండి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకతను ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం క్రమశిక్షణకు, నైతికతకు ప్రాధాన్యత ఇస్తుందా, లేక రాజకీయ అవసరాల కోసం ఎర్ర శేఖర్‌ను చేర్చుకుంటుందా అనేది చూడాలి.