Konda Surekha: మేడారం టెండర్ల విషయంలో తనకు ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడారం టెండర్లకు సంబంధించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
మేడారం టెండర్ల విషయంలో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆమె శాఖకు సంబంధించిన పనులన్నీ పారదర్శకంగా జరగాలనేదే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ టెండర్ల ప్రక్రియలో మూడు ప్రధాన కంపెనీలు పాల్గొన్నాయని అన్నారు. వాటిలో ప్రతి కంపెనీకి దాని అర్హత ఉంటుందని చెప్పారు. మంత్రిగా తనకు.. తన శాఖ కార్యదర్శికి ప్రతి విషయం నోటీసులో ఉండాలనేదే తన అభిప్రాయమని అన్నారు పనులు వేగవంతంగా జరగాలనేది తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని పేర్కొన్నారు. మేడారం పనులపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటిని ఆదేశించారని కూడా తెలిపారు.
ALSO READ: Maoist Party: మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం.. ఆయుధాలు వదిలేసిన మల్లోజుల.. ఇతను ఎవరంటే..?
ప్రతి విషయాన్ని ఓపెన్ గా మాట్లాడటం తనకు అలవాటని అన్నారు. ఏదీ దాచిపెట్టలేనని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే నటుడు నాగార్జున విషయంలో తాను మాట్లాడిన విషయం వేరని.. దానిని వివాదాస్పదంగా చిత్రీకరించిన తీరు వేరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదం కారణంగా తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని.. అందుకే ఈ మధ్య కాలంలో మీడియాతో అంత బహిరంగంగా ఉండలేకపోతున్నానని అన్నారు. కొంతమంది తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి లాబీయింగ్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అయితే, తన రాజకీయాలు పూర్తిగా పార్టీ అధిష్టానానికే నేరుగా చెప్పి ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరినో ఇబ్బంది పెట్టడానికి లేదా ఏదో సాధించడానికి ఢిల్లీ లేదా హైదరాబాద్‌లో ప్రత్యేక లాబీయింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదని, అంతకన్నా ఆ అవసరం లేదని తేల్చి చెప్పారు.
మంత్రిగా తాను ఏ పని చేసినా దాన్ని వివాదం చేయాలని కొంతమంది చూస్తున్నారని కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ కారణంగానే, మౌనంగా ఉంటూ.. తన శాఖకు సంబంధించిన పనులను మాత్రమే పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎవరెన్ని అనుకున్నా.. కేబినెట్ మంత్రిగా తన బాధ్యతలు ఏంటో తనకు బాగా తెలుసు అని ఆమె నొక్కి చెప్పారు. మొత్తం మీద మంత్రి కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు మేడారం టెండర్ల అంశంపై ప్రభుత్వ పారదర్శకతకు సంబంధించిన ఆమె వైఖరిని తెలియజేస్తుంది. రాజకీయ ప్రత్యర్థుల నుండి ఎదుర్కొంటున్న సవాళ్లను, మీడియా వ్యవహారాల పట్ల ఆమె వ్యక్తిగత అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి. ఇక నుంచి తన బాధ్యతలకు కట్టుబడి పనిచేయడానికి నిశ్చయించుకున్నట్లు ఆమె మాటల్లో అర్థం అవుతోంది.