Visakhapatnam AI Hub: విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. భారత ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వ మద్దతుతో గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ హబ్.. దేశ సాంకేతిక రంగానికి మైలురాయిగా నిలవనుంది. వచ్చే ఐదేళ్లలో విశాఖ ఏఐ హబ్ నిర్మాణానికి $15 బిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.1,33,000 కోట్లు) పెట్టుబడి పెట్టబోతున్నామని.. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ ప్రకటించారు.
చరిత్రాత్మక ఒప్పందం
ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమం.. దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ ఉన్నతాధికారులు థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, గూగుల్ క్లౌడ్ – ఏషియా పసిఫిక్) పాల్గొన్నారు.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఏఐ హబ్
ఇది అమెరికా తర్వాత ప్రపంచంలో నిర్మించబోయే.. రెండవ అతిపెద్ద ఏఐ హబ్ అవుతుంది. 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రారంభమయ్యే ఈ హబ్‌ను భవిష్యత్తులో మరిన్ని గిగావాట్లకు విస్తరించనున్నారు. ఇది గూగుల్‌కు చెందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 ఏఐ సెంటర్ల నెట్‌వర్క్‌లో భాగం కానుంది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖలో సముద్రగర్భ సబ్‌సీ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భారతదేశంలోని డేటా సెంటర్లు, డిజిటల్ సిస్టమ్స్, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు పరస్పరం అనుసంధానమవుతాయి. ఇది దేశంలో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కొత్త దశను తెరతీస్తుంది.
ఈ హబ్‌లో అత్యాధునిక టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) ను ఉపయోగించనున్నారు. ఇవి సాధారణ ప్రాసెసర్లతో పోలిస్తే రెండింతల పవర్ ఎఫిషియెన్సీతో పనిచేస్తాయి. AI ప్రాసెసింగ్ వేగం, డేటా భద్రత, సావరిన్ ఏఐ అవసరాల కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. స్థానికంగా డేటాను స్టోర్ చేసి, దేశీయ నియమావళి ప్రకారం ప్రాసెసింగ్ చేయడం ఈ హబ్ ప్రత్యేకత.
ఇది గూగుల్ జెమినీ, ఇమాజిన్ VO, క్లౌడ్ AI మోడల్స్ వంటి పరిష్కారాలను అందించడమే కాకుండా, యాప్ డెవలపర్లు, స్టార్టప్‌లు, సంస్థలు అందరూ ఉపయోగించుకునే ప్లాట్‌ఫామ్‌గా ఉండనుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మందికి నేరుగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. స్థానిక యువతకు గూగుల్ శిక్షణా కార్యక్రమాల ద్వారా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం పెంపొందించనుంది. థామస్ కురియన్ పేర్కొంటూ, ఇది కేవలం ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ కాదు, ఇది భారత యువతకు భవిష్యత్ అవకాశాల వేదిక అన్నారు.
గూగుల్ ప్రకటించినట్లుగా, ఈ హబ్ ద్వారా గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీమెయిల్, యాడ్స్ వంటి ఐకానిక్ ప్రొడక్ట్స్‌లో ఉపయోగించే AI సిస్టమ్స్‌ను భారతదేశం నుంచే ప్రపంచానికి అందించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా భారత్ అంతర్జాతీయ ఏఐ ఎకోసిస్టమ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: అనిరుధ్ రెడ్డికి భయం పట్టుకుందా?
చివరిగా థామస్ కురియన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ 2047 ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి మైలురాయిగా నిలుస్తుంది. భారత ప్రభుత్వ సహకారం, ఆంధ్రప్రదేశ్ నాయకత్వం లేకుండా ఇది సాధ్యంకాదు. విశాఖ ఏఐ హబ్ ద్వారా భారతదేశం ప్రపంచ ఏఐ శక్తిగా అవతరిస్తుంది” అన్నారు.