Supreme Court builders warning| ఇల్లు కొనుగోలు చేసే సమయంలో బిల్డర్ చూపించే బ్రోచర్‌ను చాలామంది ఎంతో నమ్ముతారు. అందులో ఉన్న రోడ్లు, సౌకర్యాలు, పార్కులు, క్లబ్‌హౌస్ వంటి అంశాలు.. కస్టమర్ల కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే బ్రోచర్‌లో చూపించిన విషయాలు వాస్తవంగా అమలు చేయకపోతే పరిస్థితి ఏంటి? ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్ట్‌ను విక్రయించేందుకు ఇచ్చిన స్పష్టమైన హామీలను తర్వాత కేవలం మార్కెటింగ్‌గా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్రాజెక్ట్ బ్రోచర్లను కేవలం ప్రచార సామగ్రిగా చూడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. కొనుగోలుదారులకు ప్రత్యేక సౌకర్యాలు లేదా ప్రణాళికలు చూపించి ఇల్లు విక్రయిస్తే వాటిని అందించాల్సి ఉంటుంది. గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ హోం డెవెలపర్స్ ది ప్రైమస్ (DLF Home Developers The Primus) ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివాదంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్ట్ గురుగ్రామ్‌సెక్టార్ 82Aలో ఉంది.
ఈ కేసులో ప్రధాన వివాదం 24 మీటర్ల వెడల్పున్న రహదారికి సంబంధించినది. ప్రాజెక్ట్ అసలు ప్లాన్‌లో ఈ రహదారిని చూపించారు.
అయితే ఆ రహదారి హామీ ఇచ్చిన విధంగా అందుబాటులో లేదని కోర్టు గుర్తించింది. జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. ప్లాన్‌లో ఈ మార్పుని తీవ్రంగా పరిగణించింది. ఇది చిన్న మార్పుగా పరిగణించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ఈ రహదారిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక విచారణ చేపట్టింది. అసలు ప్లాన్ ప్రకారం రహదారి సుమారు 147 మీటర్ల పొడవు ఉండాలి. అయితే అందులో దాదాపు 52 మీటర్ల ప్రాంతాన్ని గ్రీన్ ప్యాచ్‌గా అభివృద్ధి చేశారు. మరో పెద్ద భాగాన్ని నివాసితులు, సందర్శకులు పార్కింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో సుమారు 100 మీటర్ల రహదారి ముందు చేసిన ప్లాన్‌కు భిన్నంగా ఉంది.
ఇది ప్రతిపాదించిన రహదారిలో దాదాపు మూడింట రెండు వంతుల భాగం.
DLF కంపెనీ 2012లో The Primusను ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా ప్రచారం చేసింది. ప్రచార సామగ్రిలో రెండు 24 మీటర్ల వెడల్పైన యాక్సెస్ రోడ్లను చూపించారు. అలాగే బాంకెట్ సౌకర్యాలు, టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలను కూడా చూపించారు. అయితే కొంతమంది కొనుగోలుదారులు.. బ్రోచర్‌లో చేసిన హామీలకు ప్రాజెక్ట్ వాస్తవ పరిస్థితులకు తేడా ఉందని ఆరోపించారు.
ఐదుగురు హోమ్‌బయర్లు మొదట నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ 2023 మే 29న తీర్పు ఇచ్చింది. తర్వాత కొనుగోలుదారులు, డిఎల్‌ఎఫ్ హోమ్ డెవలపర్స్.. రెండు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ప్రాజెక్ట్ చుట్టూ వ్యవసాయ భూములు ఉండటంతో యాక్సెస్ సమస్యలు ఉన్నాయని కొనుగోలుదారులు ఆరోపించారు. రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రశ్నలు లేవనెత్తారు. పాక్షిక ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఎలా మంజూరైందని కూడా ప్రశ్నించారు. అయితే అవసరమైన నీరు, విద్యుత్, ఇతర నిబంధనలు పూర్తి చేసి పొసెషన్ ఇచ్చామని DLF చెబుతోంది.
Also Read: ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే
ఇదే అంశంపై ఫిబ్రవరిలో కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన అవసరాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కోర్టు గమనించింది. తాజాగా జరిగిన విచారణ సమయంలో అత్యున్నత కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్డర్లు ప్రాజెక్ట్ గురించి జారీ చేసిన బ్రోచర్లు కేవలం మార్కెటింగ్ కోసం కాదని, అందులోని సమాచారం హామీలుగానే పరిగణిస్తామని తెలిపింది. తర్వాత వాస్తవాలను పరిశీలించేందుకు సిబిఐ ప్రాథమిక విచారణ కోసం ఆదేశించింది.
అయితే ఈ కేసు అక్టోబర్ 12న మరోసారి విచారణకు రానుంది. అప్పటికి సిబిఐ తుది నివేదికను కోర్టు పరిశీలించే అవకాశం ఉంది.
విచారణ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.