Vizianagaram District: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా? వైసీపీని విడిచేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారా? పాతవారికి కాకుండా కొత్తవారికి ఆ పార్టీ పగ్గాలు అప్పగిస్తోందా? మేనల్లుడు పార్టీని విడిచిన బాధలో బొత్స కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తాజాగా వైసీపీ హైకమాండ్ నుంచి ఆయనకు భారీ షాక్ తగిలింది. విజయనగరం జిల్లాలో బొత్స ఆధిపత్యానికి చెక్ పడినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జిల్లా కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ను పార్టీ అధినేత జగన్ నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేత బొత్స మేనల్లుడు చిన్న శ్రీను నిర్వర్తించేవారు. వైసీపీని వీడి ఆయన టీడీపీలో చేరడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధిష్టానం, అనుభవజ్ఞుడైన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు బాధ్యతలను అప్పగించింది.
అంతేకాదు నెల్లిమర్ల నియోజకవర్గంలో కీలక మార్పులు చేసింది. నెల్లిమర్ల సమన్వయకర్త అప్పలనాయుడ్ని ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఎందుకంటే ఈయన.. చిన్న శ్రీను వియ్యంకుడు కావడంతో వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్తగా గదల సన్యాసినాయుడ్ని నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. జరుగుతున్న పరిణామాలు చూసి ఒక్కసారి బొత్స వర్గీయులు షాకయ్యారు. దీంతో వియ్యంకుడు అప్పలనాయుడు.. శ్రీనుతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ALSO READ: ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
దశాబ్దాలుగా విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించింది బొత్స కుటుంబం. కీలక పదవులు అన్నీ వారిచేతుల్లో ఉండేవి. మేనల్లుడు శ్రీను వెళ్లిపోవడంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు బొత్సకు తాత్కాలికంగా అప్పగిస్తారని అనుచరులు భావించారు. ఈ విషయంలో బొత్సను పక్కన పెట్టేసి కొత్తగా మాజీ ఎంపీకి బాధ్యతలు అప్పగించడం జీర్ణించుకోలేకపోతున్నారు. మేనల్లుడు కంటే .. బొత్సకు హైకమాండ్ గట్టి దెబ్బ కొట్టిందనే వాదన అప్పుడే మొదలైంది. మొత్తానికి బొత్స కోటకు బీటలు వారాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.