Open AI Vs Anthropic: దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మాన్, ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ చేతులు కలిపేందుకు నిరాకరించారు. దీంతో వారి మధ్య ఉన్న మనస్పర్థలు మరోసారి బయటపడ్డాయి. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రపంచస్థాయి టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలు ఒకే వేదికపై కనిపించారు. టెక్ సీఈవోలందరూ గ్రూప్ ఫొటో ఫోజులిచ్చారు. ఆ సమయంలో శామ్ ఆల్ట్మాన్, డారియో ఆమోడెయ్ పక్కపక్కనే నిలబడ్డారు. ప్రధాని మోదీకి టెక్ సీఈవోల చేతులను పైకి ఎత్తగా.. అందరూ చేతులు కలిపినప్పటికీ, పక్కపక్కనే ఉన్న శామ్ ఆల్ట్మాన్, డారియో ఆమోడెయ్ మాత్రం చేతులు కలిపేందుకు నిరాకరించారు.
ఈ ఘటనతో వీరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డారియో అమోడెయ్, ఆయన సోదరుడు డానియెల్లా అమోడెయ్ ఇద్దరూ ఆల్ట్మాన్ ‘ఓపెన్ ఏఐ’ సంస్థలో వైస్ ప్రెసిడెంట్స్ గా పనిచేశారు. ఆ సమయంలో.. శామ్ ఆల్ట్మాన్.. భద్రత కంటే వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ.. సోదరులిద్దరూ ఓపెన్ ఏఐకు రాజీనామా చేశారు. 2021లో అమోడెయ్ ఆంథ్రోపిక్ ఏఐను ప్రారంభించారు. దీంతో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
అప్పటి నుంచి, డారియో భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆంథ్రోపిక్‌ను నిర్మించారు. తమ కంపెనీని ఓపెన్ ఏఐ కంటే పూర్తి భిన్నంగా నిర్మించామని వారు తెలిపారు. అదే సమయంలో, ఆల్ట్మాన్ సంస్థ.. తమ మాజీ ఎగ్జిక్యూటివ్‌ను నిశితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు వీరిద్దరూ ఏఐ మార్కెట్ లో ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో ఆంథ్రోపిక్ సూపర్ బౌల్ ప్రకటన తర్వాత ఇరు కంపెనీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరారు. చాట్ జీపీటీలో యాడ్స్ ప్రవేశపెట్టాలనే OpenAI నిర్ణయాన్ని ఆంథ్రోపిక్ ఎగతాళి చేసినట్లు కనిపించింది. ఆంథ్రోపిక్ అభిప్రాయాన్ని ఆల్ట్‌మాన్ బహిరంగంగా వ్యతిరేకించారు.
Also Read: సురక్షితమైన ఏఐ.. సుస్థిరమైన అభివృద్ధి.. గ్లోబల్ సదస్సులో మంత్రి కీలక వ్యాఖ్యలు
“ఆంథ్రోపిక్ ధనవంతులకు ఖరీదైన ఉత్పత్తులను అందిస్తుంది” అని ఆల్ట్మాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. సబ్ స్క్రిప్షన్ చెల్లించలేని బిలియన్ల మందికి ఏఐని చేరువా చేయాల్సిన అవసరం ఉందని తాము గట్టిగా భావిస్తున్నామని ఆల్ట్మాన్ అన్నారు.