ఉద్యోగి భవిష్యత్ కి భరోసా ఇచ్చేందుకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ప్రభుత్వం మెయింటెన్ చేస్తుంది. వివిధ అవసరాలకోసం వారు అందులోనుంచి డబ్బులు తీసేసుకుంటారు. దీంతో మలి వయసులో వారికి అండగా ఉండాల్సిన నగదు కాస్తా అప్పటికే ఖర్చయిపోతుంది. దీన్ని నివారించేందుకు చరతూ PF ఖాతాల నిబంధనలను ప్రభుత్వం సవరిస్తుంటుంది. తాజాగా అలాంటి సవరణే మరోసారి జరిగింది. ఈసారి PF ఖాతాల విషయంలో ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించబోతోంది. అయితే ఇందులో ఉన్న నిజానిజాలేంటో ఓసారి మీరే చూడండి.
ప్రస్తుత నిబంధన..
ఉద్యోగం కోల్పోయిన తర్వాత నెలరోజులు నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి నెలరోజుల తర్వాత PF మొత్తంలో 75 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. 2 నెలల తర్వాత మొత్తం 100 శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
కొత్త నిబంధన..
కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి నెలరోజులపాటు ఆగకుండా వెంటనే తన PF ఖాతా నుంచి 75 శాతం నగదుని విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే పూర్తి విత్ డ్రా కోసం అతను కచ్చితంగా 12 నెలలు ఆగాల్సి ఉంటుంది. అంటే 100 శాతం PF విత్ డ్రా చేసుకోవాలంటే ఉద్యోగం లేకుండా 12 నెలలు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది.
గతంలో PF విత్ డ్రా కోసం 13 సంక్లిష్టమైన ఉపసంహరణ మార్గాలున్నాయి. అయితే వీటిని ఇప్పుడు నాలుగుకి కుదించారు. అత్యవసరం, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు ఇలా కేటగిరీలు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం PF సెటిల్‌మెంట్, ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఎక్కువ ఆర్థిక భద్రతను ఇస్తాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఫైనల్ సెటిల్మెంట్ సమయానికి ఉద్యోగుల ఖాతాల్లో చాలా తక్కువ మొత్తం ఉండేది. EPFO డేటా ప్రకారం, ఫైనల్ సెటిల్మెంట్ సమయానికి 50 శాతం మంది సభ్యులు రూ. 20,000 కంటే తక్కువ మొత్తాన్ని తీసుకునేవారు. 75 శాతం మంది రూ. 50,000 కంటే తక్కువ మొత్తాన్ని తీసుకునేవారు. 87 శాతం మంది రూ. 1 లక్ష కంటే తక్కువ PFని కలిగి ఉండేవారు. చాలామంది తమ పొదుపుని త్వరగా ఖాళీ చేసేవారు. ఇప్పుడు నిబంధనలు అలాంటి తొందరపాటు చర్యలకు అవకాశం ఇవ్వవు. అయితే కొన్ని సరళీకరణలు కూడా ఉన్నాయి. ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా డబ్బును ఉపసంహరించుకోవడం ఇప్పుడు చాలా సులభంగా మారింది.
Also Read: Digital Gold Investments: డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా? లాభాలు ఏమిటీ?
గతంలో, వివాహం లేదా ఇంటి కొనుగోలు కోసం PF ఉపసంహరించుకోవాలంటే, దానికి 5 నుంచి ఏడేళ్లపాటు వేచి చూడాలి. కానీ ఇప్పుడు కేవలం ఏడాది తర్వాత వివాహం, లేదా ఇంటి కొనుగోలు కోసం PFని ఉపసంహరించుకోవచ్చు. విద్య, అనారోగ్య సమస్యల వల్ల PF ఉపసంహరణ పరిమితులను కూడా మరింత సరళంగా మార్చారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూర్తి అర్హత ఉన్న మొత్తాన్ని ఏడాదికి రెండు సార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు. ఈ మార్పులు విధాన పరమైన ఆలస్యాలను, క్లెయిన్ తిరస్కరణలను తగ్గిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.