Digital Gold Investments: బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని కొందరు భావిస్తున్నాయి. అయితే గోల్డ్ ను డిజిటల్ గా కూడా కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ అతి తక్కువ మొత్తంలో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు.
బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన మార్గం. అత్యవసర సమయాల్లో బంగారాన్ని డబ్బుగా మార్చుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ తరహాలోనే డిజిటల్ గోల్డ్ కూడా సురక్షితమైన, ఆధునిక పెట్టుబడి మార్గమని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ నష్టాల్లో ఉన్నా డిజిటల్ గోల్డ్ ధరలు పెద్దగా మారవని, తరచుగా పెరుగుతుంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే త్వరగా అమ్ముకోవచ్చు లేదా వివిధ మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు.
డిజిటల్ గోల్డ్ కొనుగోలు ఫిజికల్ బంగారంతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది. మేకింగ్ ఛార్జీలు, తరుగు, మజూరి వంటి ఛార్జీలు ఉండవు. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తే మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. లాకర్లలో బంగారాన్ని ఉంచితే అద్దె రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిజిటల్ గోల్డ్ కొనుగోలులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా బీమా చేసిన వాల్ట్‌లలో సురక్షితంగా ఉంటుంది.
మొదటిసారిగా పెట్టుబడి పెట్టేవారికి లేదా క్రమంగా తమ పెట్టుబడులను పెంచుకునేవారికి డిజిటల్ గోల్డ్ మంచి ఎంపిక. మీకు కావాల్సిన మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే భవిష్యత్తులో గొప్ప ఆస్తిగా మిగులుతుంది.
బంగారాన్ని ఆభరణాలు లేదా ఫిజికల్ గా కొనుగోలు చేయడం వల్ల దాని భద్రతపై ఆందోళన చెందుతుంటారు. ఫిజికల్ బంగారాన్ని జాగ్రత్తగా నిల్వ చేయాలి. బంగారాన్ని ఇంట్లో లేదా అద్దె చెల్లించి బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలి. డిజిటల్ బంగారంతో ఇలాంటి ఆందోళనలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్టే ముందు విశ్వసనీయమైన సంస్థలు ఎంచుకుంటే, ఆ సంస్థలు హైటెక్ వాల్ట్‌లలో బంగారాన్ని సురక్షితంగా నిల్వ చేస్తారు. అదనపు ఖర్చు లేకుండా మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గోల్డ్ పై రుణాలు పొందాలనుకుంటే డిజిటల్ బంగారాన్ని ఆన్‌లైన్‌లో తాకట్టు పెట్టవచ్చు. ఈ ప్రక్రియ వేగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. చాలా సంస్థలు, బ్యాంకులు డిజిటల్ గోల్డ్ ను పూచీకత్తుగా అంగీకరిస్తాయి. తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు అందిస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో లేదా స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. ఈ విధానంలో బంగారాన్ని అమ్మకుండానే నిధులను పొందవచ్చు.
మీకు అవసరమైనప్పుడు డిజిటల్ గోల్డ్ ను దానిని భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు. డిజిటల్ బంగారాన్ని నాణేలు, బిస్కెట్లు లేదా ఆభరణాలుగా మార్చుకోవచ్చు. అధిక నాణ్యత గల బంగారాన్ని చాలా సులభంగా పొందవచ్చు. డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడితో పాటు మనం అడిగినప్పుడు ఫిజికల్ గోల్డ్ ఇచ్చే సంస్థలూ ఉన్నాయి.
భారత్ లో బంగారం బహుమతిగా ఇవ్వడం ఒక సంప్రదాయంగా ఉంది. డిజిటల్ గోల్డ్ ను బహుమతిగా ఇవ్వడం మరింత సులభతరం. పండుగలు, వివాహాలు, పుట్టినరోజుల సందర్భాల్లో మీ ప్రియమైనవారికి బంగారాన్ని డిజిటల్ గా అందించవచ్చు. దానిని వారు డిజిటల్ బంగారంగా ఉంచుకోవచ్చు లేదా భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు.
Also Read: JioMart Offer on Rice Bag: జియోమార్ట్ అదిరే ఆఫర్.. 26 కిలోల బియ్యం మరీ ఇంత తక్కువ ధరకా?
Disclaimer: ఈ ఆర్టికల్ లోని సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి. ఇందులోని సమాచారాన్ని బిగ్ టీవీ ధ్రువీకరించలేదు.