EPFO Pension Hike: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) అక్టోబర్ 10, 11 తేదీలలో బెంగళూరులో సమావేశం కానుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈపీఎఫ్ కనీస పెన్షన్‌ను నెలకు రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంచే ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS 95) కింద కనీస పెన్షన్ ప్రస్తుతం నెలకు రూ. 1,000 గా ఉంది. చివరిగా 2014లో పెన్షన్ ను సవరించారు. అప్పటి నుంచి పెన్షన్ లో మార్పులేదు. ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నెలకు రూ.1,000 పెన్షన్ చాలా తక్కువగా ఉందని ఉద్యోగ, ట్రేడ్ యూనియన్ల నుంచి డిమాండ్ లు చేస్తున్నాయి.
ఉద్యోగి పెన్షన్ పథకం (EPS) కింద పెన్షన్ మొత్తాన్ని రూ.7,500కి పెంచాలని ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈపీఎఫ్ఓ పెన్షన్‌ను 7.5 రెట్లు పెంచకపోవచ్చని, అందుకు బదులుగా నెలకు రూ.2,500కు పెంచే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఈపీఎస్ పెన్షన్ నిర్థారణకు ఒక సూత్రాన్ని ఉపయోగిస్తారు.
పెన్షన్ = (పెన్షన్ జీతం × పెన్షన్ సర్వీస్) ÷ 70
పెన్షన్ పొందే జీతం అంటే గత 60 నెలల సర్వీస్‌లో సగటు బెసిక్ జీతం + DA. దీనిని రూ. 15,000కి పరిమితం చేశారు. పెన్షన్ పొందడానికి కనీసం 10 సంవత్సరాల సర్వీస్ అవసరం.
గరిష్టంగా నెలకు రూ. 15,000 పెన్షన్ పొందవచ్చు. అంటే ఒక సభ్యుడు 35 సంవత్సరాలు వర్క్ చేస్తే, అతడు నెలకు దాదాపు రూ. 7,500 పెన్షన్ పొందవచ్చు.
సీబీటీ సమావేశంలో EPFO 3.0 సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈపీఎఫ్ ను పూర్తిగా డిజిటలైజేషన్ చేసే ప్రణాళికలు చేపట్టనున్నారు. ఇందులో ఏటీఎంనుండి నేరుగా పీఎఫ్ విత్ డ్రా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా, రియల్-టైమ్ క్లెయిమ్ సెటిల్మెంట్, సవరణల సౌకర్యం, డెత్ క్లెయిమ్‌లకు ఆన్‌లైన్‌లో పరిష్కారం, ఆటోమేటిక్ డేటా ఇంటిగ్రేషన్ సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది.
ఈపీఎఫ్ టెక్నాలజీ అప్ గ్రేడ్ కు ఇన్ఫోసిస్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ఐటీ సంస్థలకు బాధ్యతలను అప్పగించారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ సవాళ్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకోవడంతో పాటు, డిజిటల్ సంస్కరణలు, పెట్టుబడి విధానం, పెన్షన్ నిధిపై బోర్డు చర్చించే అవకాశం ఉంది. బోర్డు తుది నిర్ణయానికి కేంద్రం ఆమోదం అవసరం అయినప్పటికీ, ఈ సమావేశం లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావం చేయనుంది.
Also Read: Today Gold Price: బిగ్ బ్రేకింగ్.. 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు
కనీస పెన్షన్ రూ. 1,000 సరిపోదు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ఉద్యోగి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అందరి దృష్టి అక్టోబర్ 10-11 తేదీలలో జరిగే సీబీటీ సమావేశంపై పడింది.