భారతీయ రిజర్వు బ్యాంక్.. బ్యాంక్ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ఇకపై చెక్ డిపాజిట్ చేసిన ఒక్క రోజులోనే క్లియర్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే గంటల్లోనే చెక్ క్లియర్ కానుంది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి(అక్టోబర్ 4) నుంచి అమల్లోకి రానుంది. వేగవంతమైన, సురక్షితమైన చెల్లింపులే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఈ రోజుల్లో మొబైల్ బ్యాంకింగ్, యుపిఐ పేమెంట్స్ అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. క్షణాల్లో డబ్బులు పంపడం లేదంటే తీసుకోవడం చేస్తున్నారు. బ్యాంకులతో పని లేకుండా లావాదేవీలో కొనసాగుతున్నాయి. అయితే, చెక్కుల విషయంలో మాత్రం ఇప్పటికీ పాత పద్దతే కొనసాగుతోంది. చెక్ డిపాజిట్ చేసిన తర్వాత, అది క్లియర్ అయ్యేందుకు సుమారు రెండు రోజులకు పైగా సమయం పడుతుంది. దీని వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలస్యానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఒకే రోజులో చెక్ క్లియర్ చేయాలనే రూల్ తీసుకొచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 4 నుంచి చెక్ డిపాజిట్ చేసిన గంటల్లోనే క్లియర్ చేయాలని ఆదేశించింది.
ఇక చెక్ క్లియరెన్స్ కోసం రిజర్వు బ్యాంక్ కంటిన్యూయస్ క్లియరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా చెక్ గంటల వ్యవధిలో క్లియర్ అవుతుంది. ఇందుకోసం ఆయా బ్యాంకులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నాయి. కొత్త విధానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కస్టమర్లు చెక్ లు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ చెక్కులు సాయంత్రం 7 గంటల్లోగా క్లియర్ అవుతాయి. అంటే.. సాయంత్రం 7 గంటల్లోకిగా చెక్ యాక్సెప్ట్ చేయడం లేదంటే రిజెక్ట్ చేయడం జరగాలి.
తొలి దశలో భాగంగా భారతీయ రిజర్వు బ్యాంకు చెక్ డిపాజిట్ అయిన రోజు సాయంత్రం 7 గంటల్లోగా క్లియర్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది. అయితే, జనవరి 2026 నుంచి కేవలం 3 గంటల్లోనే చెక్ క్లియర్ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుత విధానాన్ని ఫేజ్ 1గా, జనవరి 2026 నుంచి రాబోయే విధానాన్ని ఫేజ్ 2గా ఆర్బీఐ భావిస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ రోజు నుంచి చెక్కులను సాయంత్రంలోగా క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. అయితే, కస్టమర్లు చెక్ బౌన్స్ కాకుండా, తిరస్కరణకు గురికాకుండ ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. కస్టమర్లు అన్ని వివరాలను నింపడంతో పాటు చెక్ ఇచ్చే వ్యక్తులు తమ బ్యాంకులలో తగిన బ్యాలెన్స్ ను మెయింటెయిన్ చేయాలని సూచించారు. మొత్తంగా కొత్త విధానంతో ఇక గంటల్లోనే చెక్ నుంచి నగదు పొందే అవకాశం ఉంది.
Read Also: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఈ వార్త మీకోసమే