TG Rains: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గత పది రోజులుగా ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం పడుతోంది. సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అవుతోంది. వర్షం వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సీజన్‌లో ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో పది నిమిషాల సేపు వర్షం పడినా మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనం నరకం చూస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి భాగ్యనగరంలో పెద్దగా వర్షాలు పడడం లేదు. అయితే ఈ రోజు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ALSO READ: RRC: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2094 ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే జాబ్
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం..?
కాసేపట్లో నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడినవ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ లో ఈ రోజు రాత్రి పొడి వాతావరణమే కొనసాగనుందని వివరించారు.
ALSO READ: RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు
చెట్ల కింద నిలబడొద్దు..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. భారీ వర్షం పడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.