World Cup 2027: ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరిని టీమిండియా నుంచి బయటకు పంపించేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) కుట్రలు పన్నినట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ వరకు ఆడి రిటైర్మెంట్ ఇవ్వాలని ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్లాన్ చేసుకున్నారట. కానీ వీళ్లిద్దరి ప్లాన్లకు చెక్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రపంచ కప్ 2027 ( World Cup 2027 ) ఆడాలంటే కొత్త రూల్స్ పాటించాల్సిందేనని ఈ ఇద్దరికీ తేల్చి చెప్పింది అంట బీసీసీఐ.
2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను మార్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. గిల్ కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వన్డే వరల్డ్ కప్ 2027 ను దృష్టిలో పెట్టుకొని మరో కొత్త రూల్ తెరపైకి తీసుకువచ్చింది. ఏ ప్లేయర్ అయినా ఖాళీ సమయంలో దేశ వాలి క్రికెట్ ఆడాల్సిందేనని తాజాగా కండిషన్స్ పెట్టింది. ప్లేయర్లు అందరూ తమ ఫిట్నెస్ అలాగే ఫామ్ కొనసాగించడమే దీని ఉద్దేశమని వివరణ ఇచ్చింది బిసిసిఐ. టెస్టులు, టీ20 లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కూడా ఈ రూల్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అలా తాము పెట్టిన రూల్ పాటించిన వాళ్లు మాత్రమే 2027 వన్డే వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కించుకుంటారని స్పష్టం చేసింది బిసిసిఐ. అజిత్ అగార్కర్ అలాగే గౌతమ్ గంభీర్ కారణంగానే ఈ రూల్ పెట్టినట్లు సమాచారం అందుతోంది.
2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే భారత క్రికెట్ నియంత్రణ మండలి సర్వం సిద్ధం చేస్తోంది. అందుకే యంగ్ క్రికెటర్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు కూడా దేశవాళి క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ కండిషన్స్ పెట్టడంతో… రోహిత్ శర్మ అలాగే కోహ్లీ వాటిని ఫాలో కాబోరని తెలుస్తోంది. తమను కావాలనే బయటకు పంపించేందుకు ఇలాంటి రూల్స్ పెడుతున్నారని, కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఇద్దరు భావిస్తున్నారట. అంతేకాదు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తో జరిగే వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత రిటైర్మెంట్ ఆలోచనలో కూడా ఇద్దరు స్టార్లు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ పొమ్మనక ముందే వెళ్లిపోవాలని అనుకుంటున్నారట.