Oil Reserves In India: ప్రపంచంలో ఏ దేశంలో ఏమి జరిగినా భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధాని నరేంద్రమోదీ లోకసభలో ప్రకటించారు. ఆ మాట ముమ్మాటికీ నిజమే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దాని ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంది. తాజాగా దేశంలో ముడి చమురు నిల్వలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. కేవలం 10 రోజులకు మాత్రమే నిల్వలు సరిపోతాయని కేంద్రం వెల్లడించింది.
దేశంలో ఆయిల్ సంక్షోభం మొదలు.. వెలుగులోకి కీలక విషయాలు
దేశంలో చమురు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలీదు. కాకపోతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా 2026 మార్చి 23న రాజ్యసభకు సమర్పించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేశంలో చమురు నిల్వలు సుమారు 3.372 మిలియన్ మెట్రిక్ టన్నుల మాత్రమే ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది దాదాపు 64 శాతం మాత్రమే.
పూర్తి సామర్థ్యంతో నిల్వలు ఉన్నప్పటికీ కేవలం 9.5 రోజులకు మాత్రమే దేశ అవసరాలను తీర్చగలవు. ఈ విషయాన్ని మినిస్టీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచ్యురల్ గ్యాస్ స్వయంగా తెలియజేసింది. ఇదే విషయాన్ని ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. దిగుమతులకు అంతరాయం ఏర్పడిన పక్షంలో భారత్ ముడి చమురు నిల్వలు సుమారు 9.5 రోజుల ముడి చమురు అవసరాన్ని తీర్చగలవని పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం బయటకు వచ్చింది.
దేశంలో కేవలం 9.5 రోజులకు మాత్రమే చమురు నిల్వలు
దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాల్లో ముడి చమురు చాలా కీలకమైనది. భారత్ తన అవసరాల్లో 85 శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లపై చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా అంతరాయం కలిగే అవకాశంపై ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో అత్యవసర పరిస్థితుల కోసం పెద్ దమొత్తంలో చమురు నిల్వ ఉంచే ప్రణాళికను ఎస్‌పీఆర్ అంటారు. 2004లో ఎస్‌పీఆర్‌ను ప్రారంభించారు.
దక్షిణ భారత్‌లోని మూడు నగరాల్లో భారీగా ముడి చమురును నిల్వ చేస్తుంటారు. ప్రస్తుతం దేశంలో విశాఖపట్నం (1.33 MMT), మంగళూరు (1.5 MMT), పడూర్ (2.5 MMT) ఈ మూడు ప్రాంతాల్లో మొత్తం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద చమురు నిల్వలను ఉంచడానికి ఒడిశాలోని చండిఖోల్‌లో 4 MMT, కర్ణాటకలో పడూర్‌లో అదనంగా 2.5 MMT సామర్థ్యంతో రెండు అదనపు సౌకర్యాలను ప్రణాళిక రెడీ చేస్తున్నారు.
ALSO READ: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. రీఫిల్ బుకింగ్ గడువు పెంపు, ఈసారి 35 రోజులు
అవి కూడా అందుబాటులోకి వస్తే 6.5 MMTకి చేరనుంది. ఇదే విషయాన్ని లోకసభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఇంధన దిగుమతులను విభిన్న మార్గాల ద్వారా పొందుతూ సరఫరా పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకప్పుడు చమురును 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, ప్రస్తుతం 41 దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలకు) ప్రయార్టీ ఇస్తున్నట్లు తెలిపారు.